India Test Squad: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి భారత్ జట్టు ఎంపికపై సెలెక్టర్లు కసరత్తు, టీమ్ ప్రకటన ఎప్పుడంటే?
Duleep Trophy: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం భారత్ జట్టుని ఎంపిక చేయడంపై సెలెక్టర్లు ఈరోజు నుంచి కసరత్తు ప్రారంభించారు. దులీప్ ట్రోఫీలో ప్లేయర్ల ప్రదర్శన ఆధారంగా ఈ ఎంపిక ఉండనుంది.
India vs Bangladesh 2024: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం భారత్ జట్టు ఎంపికపై సెలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. గురువారం నుంచి బెంగళూరు, అనంతపురం వేదికగా దులీప్ ట్రోఫీ- 2024 ప్రారంభమైంది. ఈ టోర్నీలో తొలి రౌండ్ ముగిసిన తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత టెస్టు జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ జట్టు రెండు టెస్టు మ్యాచ్‌లను ఆడనుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడిన టీమిండియా.. చాలా రోజుల తర్వాత మళ్లీ స్వదేశంలో టెస్టులను ఆడబోతోంది.
ఈ టోర్నీలో శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముఖేష్ కుమార్, శ్రేయాస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, కేఎస్ భరత్ తదితరులు ఆడుతున్నారు.
జట్టు ఎంపికపై క్లారిటీ
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు బెంగళూరు, అనంతపురంలో జరిగే ఈ దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్ ముగిసిన తర్వాత బీసీసీఐ.. బంగ్లాదేశ్‌తో సిరీస్ కోసం భారత్ టెస్టు జట్టుని ప్రకటించనుంది. ఎంపికైన ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో సిరీస్ ప్రారంభానికి ముందు సెప్టెంబర్ 12న చెన్నైలో జరిగే శిక్షణా శిబిరంలో పాల్గొంటారు.
పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపైనే 2-0తో చిత్తు చేసిన బంగ్లాదేశ్ అదే ఉత్సాహంతో భారత్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టుకి చెపాక్, రెండో టెస్టుకి కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ కూడా జరగనుంది.
సిరీస్‌లు గెలిస్తే.. ఫైనల్‌కి
అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టులు ఆడనున్న టీమిండియా ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్ కోసం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం వెళ్లనుంది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 68.52 శాతం విజయాలతో అగ్రస్థానంలో ఉన్న భారత్ జట్టు.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై స్వదేశంలో అజేయ రికార్డును కొనసాగించగలిగితే వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.