PAK vs BAN 2nd Test: పాకిస్థాన్ టాప్ బౌలర్‌కి చేదు అనుభవం, రెండో టెస్టు నుంచి రెస్ట్ పేరుతో వేటు
Pakistan vs Bangladesh 2nd Test: సొంతగడ్డపై తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ పరువు నిలుపుకునేందుకు సాహసం చేస్తోంది. ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిదిని రెండో టెస్టు నుంచి తప్పించింది.
Pakistan vs Bangladesh 2nd Test 2024: పాకిస్థాన్ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిదికి చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్‌తో ఈరోజు (ఆగస్టు 30) నుంచి రావల్పిండి వేదికగా ప్రారంభంకానున్న రెండో టెస్టు నుంచి అతడ్ని పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ తప్పించింది.
మ్యాచ్‌కి ముందు 12 మందితో కూడిన జట్టుని ప్రకటించిన పాకిస్థాన్ అందులో షాహిన్ అఫ్రిది పేరుని చేర్చలేదు. వన్డే, టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న షాహిన్ అఫ్రిది, టెస్టుల్లో మాత్రం గత కొంతకాలంగా ఘోరంగా విఫలమవుతున్నాడు.
రావల్పిండి వేదికగానే ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన తొలి టెస్టులో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దాంతో ఈరోజు నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని ఆతిథ్య జట్టు ఆశిస్తోంది. దాంతో తమ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని కూడా పక్కన పెట్టి సాహసం చేస్తోంది.
వాస్తవానికి సొంతగడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. స్వదేశంలో లేదా విదేశాల్లో ఒక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 10 వికెట్ల తేడాతో ఒక జట్టుని ఓడించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.
సెంటిమెంట్ తెరపైకి తెచ్చిన పాక్ హెడ్ కోచ్
అఫ్రిదిపై వేటు వేసే ముందు పాకిస్థాన్ టీమ్ అతనితో మాట్లాడిందని పాకిస్థాన్ హెడ్ కోచ్ జాసన్ గిలెస్పీ క్లారిటీ ఇచ్చాడు. ఈ విరామం అఫ్రిది తన కుటుంబంతో కొంత సమయం గడపడానికి వీలు కల్పిస్తుందని గిలెస్పీ చెప్పుకొచ్చాడు. ‘‘మేము అఫ్రిదితో సానుకూలంగా మాట్లాడాము. రెండో టెస్టులో బెస్ట్ కాంబినేషన్ ఉండాలనే మా తాపత్రయాన్ని అతను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అలానే అఫ్రిది ఇటీవల తండ్రయ్యాడు. ఈ విరామం అతను తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇచ్చిన అవకాశం’’ అని గిలెస్పీ చెప్పుకొచ్చాడు.
మోకాలి గాయం కారణంగా 2022 జూలై నుంచి అఫ్రిది కేవలం ఆరు టెస్టులు మాత్రమే ఆడాడు. ఈ ఏడాది జనవరిలో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు నుంచి కూడా పేలవ ప్రదర్శన కారణంగా అతడ్ని తప్పించారు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశల్ని పాకిస్థాన్ వదులుకోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌తో ఓటమిపై కూడా గెలెస్పీ స్పందిస్తూ ‘‘బంగ్లాదేశ్ టీమ్ తొలి టెస్టులో మెరుగైన క్రికెట్ ఆడి గెలిచింది. కానీ రెండో టెస్టుకి మా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని సత్తాచాటుతాం’’ అని ధీమా వ్యక్తం చేశాడు.
పేరుకే విరామం.. కానీ వేటు
2018 నుంచి టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న షాహిన్ అఫ్రిది 30 మ్యాచ్‌ల్లో 115 వికెట్లు పడగొట్టాడు. కానీ ఐదు రోజుల ఫార్మాట్‌లో అతని బౌలింగ్ ఎకానమీ 3.11గా ఉండటం పాక్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో కూడా తొలి ఇన్నింగ్స్‌లో 30వ ఓవర్లు వేసిన షాహిన్ అఫ్రిది తీసిన వికెట్లు కేవలం 2 మాత్రమే. అతని పేలవ బౌలింగ్ ప్రదర్శన టీమ్‌పై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోందని పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దాంతో విరామం పేరుతో వేటు వేస్తూ రెండో టెస్టు నుంచి తప్పించింది.