Pakistan Cricket Team: మేజర్ సర్జరీ తప్పేలా లేదు: పాకిస్థాన్ టీమ్ ఓటమిపై పీసీబీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు
Pakistan Cricket Team: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా చేతుల్లో ఓడిపోవడంపై పీసీబీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేజర్ సర్జరీ తప్పేలా లేదని ఆయన అనడం గమనార్హం.
Pakistan Cricket Team: టీమిండియా చేతుల్లో పాకిస్థాన్ ఓడిపోవడాన్ని అక్కడి అభిమానులు, మాజీ క్రికెటర్లే కాదు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఆరు పరుగుల తేడాతో పాక్ ఓడిన తర్వాత పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వి చేసిన కామెంట్స్ చూస్తుంటే.. ఆ టీమ్ సమూల ప్రక్షాళన జరిగేలా కనిపిస్తోంది. ఇంతకీ ఆయనేమన్నారంటే..
మేజర్ సర్జరీ తప్పేలా లేదు..
టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో ఒక దశలో గెలిచేలా కనిపించిన పాకిస్థాన్ చివరికి 6 పరుగులతో ఓడిపోయింది. బుమ్రా (4 ఓవర్లలో 14 రన్స్, 3 వికెట్లు) ధాటికి పాక్ కనీసం 120 పరుగులు కూడా చేజ్ చేయలేక చేతులెత్తేసింది. ఆ టీమ్ మిడిలార్డర్ కుప్పకూలడంపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసికూన యూఎస్ఏ చేతుల్లో ఓటమి నుంచి తేరుకోక ముందే దాయాది చేతుల్లో పరాజయం వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వి అయితే చాలా తీవ్రంగా స్పందించారు. ఓ మెగా టోర్నీ మధ్యలో తమ టీమ్ ప్రదర్శనను తీవ్రస్థాయిలో విమర్శించడం అత్యంత అరుదుగా చూస్తుంటాం. ఇప్పుడు నఖ్వీ అదే చేశారు. "టీమ్ మళ్లీ గెలుపు బాట పట్టాలంటే ఏదో చిన్న సర్జరీ అవసరం అని నేను భావించాను. కానీ ఇప్పుడు చూస్తుంటే మేజర్ సర్జరీ అవసరం అయ్యేలా ఉంది" అని పాకిస్థానీ మీడియాతో నఖ్వి అన్నారు.
ప్రక్షాళన చేస్తాం: నఖ్వీ
టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్ ఆడిన తొలి రెండు మ్యాచ్ లలోనూ ఓడింది. ఇప్పుడు సూపర్ 8కు వెళ్లడం కూడా అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో పాక్ టీమ్ పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో క్రికెట్ బోర్డులు తమ టీమ్ కు అండగా ఉంటాయి. కానీ పాక్ విషయంలో మాత్రం రివర్స్ గా ఉంది.
"యూఎస్ఏతోపాటు ఇప్పుడు ఇండియా చేతుల్లో ఇలా ఓడిపోవడం చాలా నిరాశ కలిగించింది. ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్స్ ను కాకుండా బయటి వాళ్లను పరిశీలించాల్సిన సమయం వచ్చింది" అని నఖ్వీ అనడం గమనార్హం. ఆయన మాటలను బట్టి చూస్తే వరల్డ్ కప్ తర్వాత టీమ్ పూర్తి ప్రక్షాళన తప్పేలా కనిపించడం లేదు.
"టీమ్ ఎందుకు బాగా ఆడటం లేదని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. వరల్డ్ కప్ ఇంకా నడుస్తోంది. కానీ మేము దీనిపై సమీక్ష జరిపి ప్రతి అంశాన్ని పరిశీలిస్తాం" అని నఖ్వీ ముగించారు. నిజానికి గతేడాది వరల్డ్ కప్ లోనూ తొలి రౌండ్లోనే పాక్ ఇంటికెళ్లిపోయింది. ఆ వెంటనే బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా షహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ అప్పగించారు.
కానీ ఈ టీ20 వరల్డ్ కప్ కు ముందు మరోసారి పీసీబీ కెప్టెన్సీని బాబర్ కే అప్పగించింది. అయితే అతని కెప్టెన్సీలోనూ పాక్ తీరు మారలేదు. ఈ వరల్డ్ కప్ కు ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు తొలి రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టేలా ఉంది.