World Test Championship: లార్డ్స్‌లోనే టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్!
వరల్డ్‌టెస్ట్ ఛాంపియన్‌షిప్ సెకండ్ ఎడిషన్ ఇప్పుడు నడుస్తోంది. వచ్చే ఏడాది ఫైనల్ జరగనుంది. తొలిసారి గతేడాది జరిగిన ఫైనల్లో ఇండియా, న్యూజిలాండ్ టీమ్స్ సౌథాంప్టన్ స్టేడియంలో తలపడిన విషయం తెలిసిందే.
దుబాయ్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ ఫైనల్ ప్రతిష్టాత్మక లార్డ్స్ గ్రౌండ్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ ఛీఫ్ గ్రెగ్ బార్‌క్లే వెల్లడించారు. నిజానికి తొలి ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా లార్డ్స్‌లోనే జరగాల్సి ఉన్నా.. కొవిడ్ కారణంగా దానిని సౌథాంప్టన్‌లోని ఎజియస్ బౌల్ గ్రౌండ్‌కు మార్చిన విషయం తెలిసిందే. తొలి ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఇండియాను ఓడించిన న్యూజిలాండ్ తొలి ఛాంపియన్‌గా అవతరించింది.

అయితే ఈసారి మాత్రం ఫైనల్‌ను లార్డ్స్‌లోనే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. "రెండో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లార్డ్స్‌లోనే షెడ్యూల్ అయి ఉంది. నిజానికి ఎప్పుడూ అక్కడే నిర్వహించాలన్నది మా ఉద్దేశం" అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే చెప్పారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ టీటైమ్‌లో బీసీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ ప్రోగ్రామ్‌లో గ్రెగ్ ఈ కామెంట్స్ చేశారు.
"ఫైనల్ జరగబోయేది జూన్‌లో. ఇదొక్క కారణం చాలు మిగతా చాలా వేదికలు రేసులో లేనట్లే. లార్డ్స్‌లోనే తప్పనిసరిగా ఫైనల్ జరుగుతుందని భావించవచ్చు. ఇప్పుడు కొవిడ్ నుంచి కూడా బయటపడ్డాం. ఇక ఏర్పాట్లను బట్టి లార్డ్స్‌లోనే ఫైనల్ నిర్వహించాలన్నది మా ఉద్దేశం" అని గ్రెగ్ చెప్పారు. వచ్చే సమ్మర్‌లో ఇంగ్లండ్ ఏకైక టెస్ట్ ఆడనుంది. ఆ ప్రత్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. ఆ తర్వాత యాషెస్ సిరీస్‌కు ఆతిథ్యమివ్వనుంది. దీనిని బట్టి లార్డ్స్‌లోనే ఫైనల్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికిన్ఫో రిపోర్ట్ వెల్లడించింది.
అయితే లార్డ్స్‌ను ఫైనలైజ్ చేసే ముందు చేయాల్సిన పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే వచ్చే నెలలో జరగబోయే ఐసీసీ వార్షిక సమావేశంలో ఫైనల్ వేదికను ప్రకటించనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్