Riyan Parag RR vs DC: 4, 4, 6, 4, 6.. ఒకే ఓవర్లో 25 పరుగులు బాదిన రియాన్ పరాగ్.. అదీ బెస్ట్ పేస్ బౌలర్ బౌలింగ్‌లో..
Riyan Parag RR vs DC: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 25 రన్స్ బాదాడు.

Riyan Parag RR vs DC: ఐపీఎల్ 2024లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్. బుధవారం (మార్చి 27) ముంబై ఇండియన్స్ పై ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెస్ ఇన్నింగ్స్ మరవక ముందే పరాగ్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ తో చెలరేగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఆ టీమ్ బౌలర్ ఎన్రిచ్ నోక్యా వేసిన చివరి ఓవర్లో ఏకంగా 25 రన్స్ బాదాడు.
రియాన్ పరాగ్ విశ్వరూపం
రాజస్థాన్ రాయల్స్ జట్టులో రియాన్ పరాగ్ చాలా ఏళ్లుగా ఉన్నాడు. అతడు తన బ్యాటింగ్ కంటే కూడా వివాదాలు, విమర్శలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. టాలెంటెడ్ ప్లేయర్ అన్న పేరే తప్ప ఇప్పటి వరకూ ఎప్పుడూ చూపించలేదు. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 45 బంతుల్లో 84 రన్స్ తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్ అయితే హైలైట్ అని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ పేస్ బౌలర్లలో ఒకడైన ఎన్రిచ్ నోక్యా బౌలింగ్ లో పరాగ్ ఏకంగా 25 రన్స్ బాదాడు. వరుసగా 4, 4, 6, 4, 6, 1 రన్స్ చేయడం విశేషం. తొలి ఐదు బంతుల్లో 24 రన్స్ చేసిన పరాగ్.. చివరి బంతికి సింగిల్ తో సరిపెట్టుకున్నాడు. అయితే ఈ ఓవర్లో అతడు కొట్టిన ప్రతి షాట్ అద్భుతంగా ఉన్నాయి.
ఫీల్డ్ లో, బయట ఎక్స్‌ట్రాలు చేస్తాడన్న విమర్శలు తప్ప ఇప్పటి వరకూ పరాగ్ పెద్దగా మెరిసిందేమీ లేదు. అయినా రాయల్స్ టీమ్ అతనిపై నమ్మకం ఉంచుతూ వచ్చింది. మొత్తానికి ఇన్నాళ్లకు తనపై ఉన్న నమ్మకాన్ని అతడు నిలబెట్టుకున్నాడు. ఒకదశలో 140 పరుగులు చేస్తే చాలనుకున్న రాయల్స్ కు ఏకంగా 185 పరుగుల స్కోరు దగ్గరికి తీసుకెళ్లాడు.
పరాగ్ పరాక్రమం
ఒక దశలో రాయల్స్ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యశస్వి (5), బట్లర్ (11), సంజూ శాంసన్ (15) లాంటి వాళ్లంతా పెవిలియన్ బాట పట్టారు. ఈ సమయంలో రాయల్స్ భారీ స్కోరు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొంది నాలుగో స్థానంలో వచ్చిన పరాగ్.. ఇన్నింగ్స్ మొత్తాన్ని మార్చేశాడు.
మొదట అశ్విన్ (29)తో కలిసి నాలుగో వికెట్ కు 64 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ చివరికి వస్తున్న కొద్దీ జోరు పెంచాడు. చివరి ఓవర్లో గేర్ మార్చి ఏకంగా 25 రన్స్ పిండుకున్నాడు. పరాగ్ ఇన్నింగ్స్ లో మొత్తంగా 7 ఫోర్లు, 6 సిక్స్ లు ఉన్నాయి. అతడు కొట్టిన ప్రతి సిక్స్ కళ్లు చెదిరేలా ఉంది. 15వ ఓవర్లో రాయల్స్ స్కోరు 100 దాటగా.. 20వ ఓవర్ ముగిసే సమయానికి 185 పరుగులకు చేరిందంటే అది కేవలం పరాగ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ వల్లే అని చెప్పాలి.