RR vs LSG Highlights: దుమ్మురేపిన శాంసన్.. పోరాడిన రాహుల్, పూరన్.. ఆఖర్లో కట్టడి చేసిన బౌలర్లు: రాజస్థాన్‍దే గెలుపు-ipl 2024 rr vs lsg highlights sanju samson rajasthan royals won against kl rahul lucknow supergiants cricket news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rr Vs Lsg Highlights: దుమ్మురేపిన శాంసన్.. పోరాడిన రాహుల్, పూరన్.. ఆఖర్లో కట్టడి చేసిన బౌలర్లు: రాజస్థాన్‍దే గెలుపు

RR vs LSG Highlights: దుమ్మురేపిన శాంసన్.. పోరాడిన రాహుల్, పూరన్.. ఆఖర్లో కట్టడి చేసిన బౌలర్లు: రాజస్థాన్‍దే గెలుపు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 24, 2024 08:34 PM IST

RR vs LSG IPL 2024 Highlights: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ అదిరే ఆరంభం చేసింది. తన తొలి మ్యాచ్‍లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‍పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ వివరాలివే..

RR vs LSG Highlights: దుమ్మురేపిన శాంసన్.. పోరాడిన రాహుల్, పూరన్.. ఆఖర్లో కట్టడి చేసిన బౌలర్లు: రాజస్థాన్‍దే గెలుపు
RR vs LSG Highlights: దుమ్మురేపిన శాంసన్.. పోరాడిన రాహుల్, పూరన్.. ఆఖర్లో కట్టడి చేసిన బౌలర్లు: రాజస్థాన్‍దే గెలుపు (AP)

RR vs LSG IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‍లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై విజయం సాధించింది. ఐపీఎల్ 2024లో జైపూర్ వేదికగా నేడు (మార్చి 24) జరిగిన మ్యాచ్‍లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో లక్నో జట్టుపై గెలిచింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 రన్స్ సాధించింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 రన్స్ మాత్రమే చేయగలిగింది లక్నో.

శాంసన్, పరాగ్ మెరుపులు

టాస్ గెలిచి ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసింది రాజస్థాన్ రాయల్స్. ఓపెనర్లు జోస్ బట్లర్ (11), యశస్వి జైస్వాల్ (24) ఔట్యయాక.. సంజూ శాంసన్ (52 బంతుల్లో 82 పరుగులు నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), రియాన్ పరాగ్ (29 బంతుల్లో 43 పరుగులు; 1 ఫోర్, 3 సిక్సర్లు) దుమ్మురేపారు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపారు. దీంతో రాజస్థాన్ 10.4 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ దాటింది. సంజూ శాంసన్ 33 బంతుల్లోనే అర్ధ శకతం చేశాడు.

ఆ తర్వాత కూడా శాంసన్ దుమ్మురేపాడు. కాసేపు ధనాధన్ ఆట ఆడిన పరాగ్ కాసేపటికి ఔటయ్యాడు. చివర్లో ధృవ్ జురెల్ (20 నాటౌట్) అదరగొట్టాడు. శాంసన్ చివరి వరకు జోరు చూపాడు. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 82 రన్స్ చేశాడు. దీంతో రాజస్థాన్ జట్టుకు 193 పరుగుల భారీ స్కోరు దక్కింది. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్‍కు రెండు, మహ్‍సిన్ ఖాన్, రవి బిష్ణోయ్‍కు తలా ఓ వికెట్ దక్కింది.

పూరన్, రాహుల్ పోరాడినా..

భారీ లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓ దశలో 60 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్‍లో కెప్టెన్ కేఎల్ రాహుల్ (44 బంతుల్లో 58 పరుగులు; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడగా ఆడాడు. కాసేపు మెరిపించిన దీపక్ హూడా (26) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో లక్నో కష్టాల్లో పడింది. ఆ తరుణంలో నికోలస్ పూరన్ (41 బంతుల్లో 64 పరుగులు, 4ఫోర్లు, 4సిక్సర్లు; నాటౌట్) దుమ్మురేపాడు. రాహుల్, పూరన్ అద్భుతంగా పోరాడారు. దూకుడుగా ఆడారు.

కట్టడి చేసిన రాజస్థాన్ బౌలర్లు

పూరన్ దూకుడుగా ఆడటంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 35 బంతుల్లో.. పూరన్ 30 బంతుల్లో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఓ దశలో గెలుపునకు 5 ఓవర్లకు 60 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఆ తర్వాత రాహుల్ ఔటవటంతో దెబ్బ పడింది. రాజస్థాన్ బౌలర్లు సందీప్ శర్మ, అశ్విన్, ఆవేశ్ ఖాన్ చివరి నాలుగు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఓ ఎండ్‍లో పూరన్ పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు, నాండ్రే బర్గర్, అశ్విన్, ఆవేశ్, చాహల్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.