Rohit Sharma vs Hardik Pandya: హార్దిక్ పాండ్యా రాగానే లేచి వెళ్లిపోయిన రోహిత్, సూర్యకుమార్-rohit sharma suryakumar yadav tilak varma left as hardik pandya walks into bat in the nets ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma Vs Hardik Pandya: హార్దిక్ పాండ్యా రాగానే లేచి వెళ్లిపోయిన రోహిత్, సూర్యకుమార్

Rohit Sharma vs Hardik Pandya: హార్దిక్ పాండ్యా రాగానే లేచి వెళ్లిపోయిన రోహిత్, సూర్యకుమార్

Hari Prasad S HT Telugu
May 14, 2024 02:27 PM IST

Rohit Sharma vs Hardik Pandya: ముంబై ఇండియన్స్ జట్టులో విభేదాల వార్తల నేపథ్యంలో మరోసారి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య జరిగిన ఈ ఘటన వార్తల్లో నిలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే దెబ్బ తిన్నట్లు స్పష్టమవుతోంది.

హార్దిక్ పాండ్యా రాగానే లేచి వెళ్లిపోయిన రోహిత్, సూర్యకుమార్
హార్దిక్ పాండ్యా రాగానే లేచి వెళ్లిపోయిన రోహిత్, సూర్యకుమార్ (Deepak Gupta/Hindustan Times)

Rohit Sharma vs Hardik Pandya: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలను ముంబై ఇండియన్స్ టీమ్ దాచి పెట్టాలని చూసినా అది ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంది. కెప్టెన్సీ మార్పు తర్వాత మొదలైన వీళ్ల విభేదాలు.. ముంబై టీమ్ ఈ సీజన్లో దారుణమైన ప్రదర్శనతో మరింత ముదిరాయి. తాజాగా నెట్స్ లో హార్దిక్ ను చూడగానే రోహిత్, సూర్య వెళ్లిపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది.

హార్దిక్ రాగానే రోహిత్, సూర్య జంప్

రాబోయే టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా టీమిండియాను నడిపించబోతున్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరి మధ్యా రోజురోజుకూ ముదురుతున్న విభేదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టును ఈ గొడవలు దెబ్బ తీశాయి. ఈ సీజన్లో ముంబై కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది.

ఇప్పటికీ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నట్లు తాజాగా జరిగిన ఓ ఘటన నిరూపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడటానికి అక్కడికి వెళ్లింది ముంబై ఇండియన్స్. అక్కడ ప్రాక్టీస్ సెషన్లో ముందుగా కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో రోహిత్ మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. తర్వాత అదే ప్రాక్టీస్ సెషన్లో జరిగిన మరో ఘటన రోహిత్, హార్దిక్ మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టింది.

రెండుగా చీలిన ముంబై ఇండియన్స్

అంతేకాదు ముంబై ఇండియన్స్ రెండుగా చీలిపోయినట్లు కూడా తెలుస్తోంది. దైనిక్ జాగరన్ రిపోర్టు ప్రకారం.. ఈ ఐపీఎల్ సీజన్లో రోహిత్, హార్దిక్ అసలు కలిసి ప్రాక్టీస్ చేయలేదు. కేకేఆర్ మ్యాచ్ కు ముందు రోహిత్ మొదటగా నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా ఎక్కడా కనిపించలేదు. రోహిత్ తన ప్రాక్టీస్ తర్వాత సూర్యకుమార్, తిలక్ వర్మలతో కలిసి కూర్చొన్నాడు.

అదే సమయంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి రాగానే ఈ ముగ్గురూ అక్కడి నుంచి వెళ్లిపోయి మరో చోటు కూర్చొన్నారు. ఇది చూసిన తర్వాత ముంబై ఇండియన్స్ క్యాంప్ రెండు చీలిపోయిందన్న వార్తలు మరింత బలపడుతున్నాయి. జట్టులోని సూర్య, తిలక్ వర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ రోహిత్ క్యాంప్ లో ఉండగా.. ఇషాన్ కిషన్ లాంటి యువ ఆటగాళ్లు హార్దిక్ క్యాంప్ లో ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.

దారుణంగా హార్దిక్ ప్రదర్శన

గతేడాదే గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తిరిగి తీసుకొచ్చిన ముంబై ఇండియన్స్ అతనికి కెప్టెన్సీ అప్పగించింది. అయితే దీనిపై రోహిత్ అసంతృప్తితో ఉన్నట్లు సులువుగా అర్థమైంది. అటు ముంబై అభిమానులు కూడా దీనిని అంగీకరించలేదు. మొదట్లో అతడు ఎక్కడికి వెళ్లినా.. ప్రేక్షకులు హేళన చేశారు. దీనికి తోడు ఈ సీజన్లో కెప్టెన్ గా, ప్లేయర్ గా హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు.

13 మ్యాచ్ లలో కేవలం 200 రన్స్ మాత్రమే చేశాడు. 11 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ రేటు కూడా 10.59గా ఉండటం గమనార్హం. అతనితోపాటు ఇతర కీలక ప్లేయర్స్ అందరూ గాడి తప్పడంతో ఈ సీజన్లో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇది హార్దిక్ పై మరిన్ని విమర్శలకు కారణమైంది. మరి రోహిత్, హార్దిక్ మధ్య ఉన్న ఈ విభేదాలు రాబోయే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై ఏమైనా ప్రభావం చూపిస్తాయా అన్నది చూడాలి.

Whats_app_banner