Mumbai Indians: తిలక్ వర్మపై నోరు పారేసుకున్న హార్దిక్.. ముంబై ఇండియన్స్ సీనియర్ల గుస్సా-mumbai indians eliminated from ipl 2024 seniors like rohit sharma bumrah not happy with hardik pandya ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mumbai Indians: తిలక్ వర్మపై నోరు పారేసుకున్న హార్దిక్.. ముంబై ఇండియన్స్ సీనియర్ల గుస్సా

Mumbai Indians: తిలక్ వర్మపై నోరు పారేసుకున్న హార్దిక్.. ముంబై ఇండియన్స్ సీనియర్ల గుస్సా

Hari Prasad S HT Telugu
May 09, 2024 02:07 PM IST

Mumbai Indians: ఐపీఎల్ 2024 నుంచి ఎలిమినేట్ అయిన తొలి టీమ్ గా ముంబై ఇండియన్స్ నిలిచింది. దీంతో ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ టీమ్ ప్రదర్శనపై సీనియర్లు రోహిత్ శర్మ, బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

తిలక్ వర్మపై నోరు పారేసుకున్న హార్దిక్.. ముంబై ఇండియన్స్ సీనియర్ల గుస్సా
తిలక్ వర్మపై నోరు పారేసుకున్న హార్దిక్.. ముంబై ఇండియన్స్ సీనియర్ల గుస్సా (PTI)

Mumbai Indians: ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఐపీఎల్ 2024 నుంచి బయటకు వెళ్లిపోయిన తొలి టీమ్ గా నిలిచింది. దీంతో ఈసారే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. అతనిపై సీనియర్లు రోహిత్, బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేయడం.. తిలక్ వర్మపై హార్దిక్ నోరు పారేసుకోవడంతో ముంబై క్యాంప్ అంతా గందరగోళంలో కూరుకుపోయింది.

ముంబై ఇండియన్స్ ఔట్

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్ లలో కేవలం నాలుగు గెలిచి, ఎనిమిది ఓడింది. ఇక వాళ్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు లేకపోవడంతో ఈ సీజన్ లో లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన తొలి జట్టుగా నిలిచింది. మొదటి నుంచీ కెప్టెన్సీ మార్పుపై అసంతృప్తితో ఉన్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ ఫ్రాంఛైజీ అభిమానులు.. ఇప్పుడు హార్దిక్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా లీగ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ ఒక్కో ప్లేయర్ తో సమావేశం ఏర్పాటు చేసింది. అందులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రాలాంటి సీనియర్లు హార్దిక్ కెప్టెన్సీలో టీమ్ సాగిన విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిజానికి బుమ్రా తప్ప ఈ సీజన్లో ఏ ముంబై ప్లేయర్ కూడా నిలకడగా ఆడలేదు.

కెప్టెన్ హార్దిక్ అయితే మరీ దారుణం. 12 మ్యాచ్ లలో కేవలం 198 రన్స్ చేశాడు. 11 వికెట్లు మాత్రమే తీశాడు. ప్లేయర్ గా, కెప్టెన్ గా విఫలమైన హార్దిక్ పై సహజంగానే సహచరుల నుంచి, అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. జట్టులోని ప్లేయర్స్ అందరిలోనూ నిలకడ లేకపోయినా హార్దిక్ వల్లే లీగ్ స్టేజ్ నుంచి ఇంటిదారి పట్టే పరిస్థితి వచ్చిందని జట్టులోని సీనియర్లు మేనేజ్‌మెంట్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తిలక్ వర్మపై నోరు పారేసుకున్న హార్దిక్

ఇక తాను వరుసగా విఫలమవుతూ.. జట్టులోని ఇతర ప్లేయర్స్ ను నిందించడం కూడా హార్దిక్ పై అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో తిలక్ వర్మ పేరును నేరుగా ప్రస్తావించకుండా అతని చేసిన విమర్శలు ఎవరికీ రుచించలేదు. "అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఓ లెఫ్ట్ హ్యాండర్ (తిలక్ వర్మ) అతనిపై ఎదురు దాడికి దిగడం సరైన పని. ఆటపై అవగాహన లోపించడమే దీనికి కారణం. అదే చివరికి మ్యాచ్ ఓడిపోయేలా చేసింది" అని హార్దిక్ అన్నాడు.

ఈ ఏడాది బుమ్రా తర్వాత తిలక్, సూర్యనే కాస్త అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించారు. అయినా హార్దిక్ చేసిన ఈ కామెంట్స్ టీమ్ లోని ఇతర ప్లేయర్స్ కు నచ్చలేదు. ఇది వాళ్లను అతనికి మరింత దూరం చేసింది. ఈ సీజన్ ముంబై ఇండియన్స్ కు ఇక అయిపోయినట్లే. మిగిలిన రెండు మ్యాచ్ లను కేవలం పరువు కోసం ఆడాల్సిందే.

మరి వచ్చే సీజన్ పరిస్థితి ఏంటన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఈసారి మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఎవరిని కొనసాగిస్తుంది? ఎవరిని తప్పిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఐపీఎల్ ముగియగానే రోహిత్ శర్మ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ ఆడనున్నాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ ఆ మెగా టోర్నీలో ఏం చేస్తుందో చూడాలి.

IPL_Entry_Point