Wasim Akram on Mumbai Indians: ఇండియాలో ఇదే ప్రాబ్లెం: రోహిత్‌ను తప్పించడంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
Wasim Akram on Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియా, పాకిస్థాన్ లాంటి దేశాల్లో ఇదే సమస్య అని అతడు అనడం గమనార్హం.
Wasim Akram on Mumbai Indians: ఐపీఎల్ 2024 సీజన్ సగానికిపైనే ముగిసినా.. ఇప్పటికీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా దీనిపై స్పందించాడు. ఇండియా, పాకిస్థాన్ లలో ఇదే సమస్య అంటూ అతడు ఈ ఇష్యూపై కాస్త ఘాటుగానే స్పందించడం గమనార్హం.
హార్దిక్ పాండ్యాను హేళన చేయడంపై..
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యాకు అప్పగించిన సంగతి తెలుసు కదా. అయితే ఈ నిర్ణయాన్ని ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా తప్పుబట్టారు. దీంతో హార్దిక్ ను సొంత మైదానంతోపాటు ఎక్కడికి వెళ్లినా హేళన చేస్తున్నారు. ఇది సరికాదు అని ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు అభిమానులకు సూచించారు.
తాజాగా వసీం అక్రమ్ అయితే మరింత ఘాటుగా స్పందించాడు. "ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ఇదే సమస్య. మనం ఎప్పటికీ మరచిపోము. 20 ఏళ్ల కిందట మీ నాన్న కెప్టెన్ ఎలా అయ్యాడో పాండ్యా కొడుకుకు చెప్పాల్సిందిగా మనం మన పిల్లలకు చెబుతాం. మనం అక్కడే ఆగిపోతాం.
అభిమానులు కాస్త శాంతించాలి. అతడు మీ ప్లేయరే. ముంబై ఇండియన్స్ కే ఆడుతున్నాడు. మిమ్మల్ని గెలిపించేది అతడే. మీ సొంత ప్లేయర్ ను హేళన చేయడం సరికాదు. విమర్శించడం వరకూ ఓకే. కానీ తర్వాత వదిలేయాలి" అని స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ వసీం అక్రమ్ అన్నాడు.
రోహితే కొనసాగాల్సింది
ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మే కొనసాగాల్సింది అని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ మార్పు ఎలా చేశారో చూడాలని ఈ సందర్భంగా అక్రమ్ అన్నాడు. "ఫ్రాంఛైజీ క్రికెట్ లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సీఎస్కే కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని ఎలా తీసుకుందో చూడండి.
దీర్ఘకాలం గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నారు. ముంబై ఇండియన్స్ ది కూడా అదే ఆలోచన కావచ్చు. ఇదేమీ వ్యక్తిగత నిర్ణయం కాదు. కానీ నా దృష్టిలో రోహిత్ శర్మనే మరో ఏడాది కెప్టెన్ గా కొనసాగించాల్సింది. వచ్చే ఏడాది హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాల్సింది" అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోహిత్ శర్మ ఇంకా టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతుండగానే.. హార్దిక్ కు కెప్టెన్సీ ఇవ్వడం అభిమానులకు మింగుడు పడలేదు.
అలాగని కెప్టెన్సీ మార్పు ముంబై ఇండియన్స్ కు అంత మంచి ఫలితాలను ఏమీ ఇవ్వలేదు. హార్దిక్ కెప్టెన్ గా, వ్యక్తిగతంగా విఫలమవుతున్నాడు. ముంబై టీమ్ 8 మ్యాచ్ లలో కేవలం 3 గెలిచి, 5 ఓడింది. ప్రస్తుతం 8వ స్థానంలో ఆ టీమ్ ఉంది. ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మరో ఆరు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నా.. వాటిలో కనీసం 5 గెలవాల్సి ఉంటుంది. ఇది అంత సులువేమీ కాదు.