DC vs LSG: లక్నోకు భారీ దెబ్బేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో అలవోకగా గెలిచిన పంత్ సేన-dc vs lsg ipl 2024 lucknow super giants playoff chances grim after loss against delhi capitals ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dc Vs Lsg: లక్నోకు భారీ దెబ్బేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో అలవోకగా గెలిచిన పంత్ సేన

DC vs LSG: లక్నోకు భారీ దెబ్బేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో అలవోకగా గెలిచిన పంత్ సేన

Chatakonda Krishna Prakash HT Telugu
May 14, 2024 11:50 PM IST

DC vs LSG IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో పంత్ సేన దుమ్మురేపింది. దీంతో లక్నో ప్లేఆఫ్స్ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసేసింది డీసీ. నికోలస్ పూరన్, అర్షద్ ఖాన్ పోరాడినా లక్నోకు ఓటమి ఎదురైంది.

DC vs LSG: లక్నోకు భారీ దెబ్బేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో అలవోకగా గెలిచిన పంత్ సేన
DC vs LSG: లక్నోకు భారీ దెబ్బేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో అలవోకగా గెలిచిన పంత్ సేన (ANI)

DC vs LSG IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ అవకాశాలపై కీలక సమయంలో దెబ్బేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సీజన్‍లో తన చివరి లీగ్ మ్యాచ్‍లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ అలవోకగా గెలిచింది. ప్లేఆఫ్స్ అవకాశాలను కాస్త మిగిల్చుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నేడు (మే 14) జరిగిన మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. లక్నో జట్టుకు మరో లీగ్ మ్యాచ్ మిగిలే ఉన్నా.. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ ఆశలు చాలా సంక్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్ ఎలా సాగిందంటే..

దుమ్మురేపిన ఇషాంత్.. కుప్పకూలిన లక్నో

209 పరుగుల లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభం నుంచే తడబడింది. గెలిచేలా ఏ దశలోనూ కనిపించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (3/34) ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి లక్నోను కష్టాల్లోకి నెట్టాడు. మొత్తంగా 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసి లక్నో ఓటమి పాలైంది.

లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‍ (5)ను ఢిల్లీ పేసర్ ఇషాంత్ శర్మ తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు. ఆ తర్వాత క్వింటన్ డికాక్‍ (12)ను ఇషాంత్ మూడో ఓవర్లో బోల్తా కొట్టించి పెవిలియన్ పంపాడు. మార్కస్ స్టొయినిస్‍ (5)ను అక్షర్ పటేల్ బౌలింగ్‍లో పంత్ స్టంపౌట్ చేశాడు. ఐదో ఓవర్లో దీపక్ హుడా (0)ను ఇషాంత్ శర్మ డకౌట్ చేశాడు. దీంతో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది లక్నో.

పూరన్, అర్షద్ పోరాటం

వరుసగా వికెట్లు పడుతున్నా లక్నో హిట్టర్ నికోలస్ పూరన్ ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. 27 బంతుల్లోనే 61 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో పూరన్ పోరాడాడు. జట్టును మ్యాచ్‍లో సజీవంగా ఉంచాడు. ఆయుష్ బదోనీ (6) కూడా త్వరగా పెవిలియన్ చేరాడు. 12వ ఓవర్లో పూరన్‍ను ముకేశ్ కుమార్ ఔట్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత లక్నో ఆల్ రౌండర్ అర్షద్ ఖాన్ 33 బంతుల్లో 58 పరుగులతో (3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దుమ్మురేపాడు. దూకుడుగా ఆడుతూ పోరాడాడు. ఓ దశలో ఢిల్లీ క్యాంప్‍లో అర్షద్ టెన్షన్ పెంచాడు. చివరి వరకు నిలిచి మంచి అర్ధ శకతం చేశాడు. యుధ్ వీర్ (17) ఔటయ్యాక అర్షద్‍కు సరైన సహకారం లభించలేదు. దీంతో లక్నో ఓటమి పాలైంది.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి మూడు వికెట్లతో రాణించాడు. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్ చెరో వికెట్ తీశారు. ఢిల్లీ కెప్టెన్ పంత్ ఏకంగా 8 మందితో బౌలింగ్ చేయించాడు.

స్టబ్స్, పోరెల్ సూపర్ హాఫ్ సెంచరీలు

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఓపెనర్ అభిషేక్ పోరెల్ (33 బంతుల్లో 58 పరుగులు; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆరంభంలో అర్ధ శకతంతో దుమ్మురేపాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 57 పరుగులు నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీతో దడదడలాడించాడు. మొత్తంగా 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు చేసింది ఢిల్లీ.

జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (0) విఫలమైనా.. అభిషేక్ పోరెల్ దుమ్మురేపాడు. షాయ్ హోప్ (38), కెప్టెన్ రిషబ్ పంత్ (33) పర్వాలేదనిపించారు. చివర్లో స్టబ్స్ భారీ హిట్టింగ్‍తో చెలరేగటంతో ఢిల్లీకి భారీ స్కోరు దక్కింది. లక్నో బౌలర్ నవీనుల్ హక్ రెండు వికెట్లు తీసినా 51 పరుగులు సమర్పించుకున్నాడు. రవి బిష్ణోయ్, అర్షద్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు.

లక్నో ప్లేఆఫ్స్ ఆశలకు దెబ్బ

ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలో తన అన్ని 14 లీగ్ మ్యాచ్‍లను ఆడేసింది. ఏడు గెలిచి.. మరో ఏడు ఓడింది. 14 పాయింట్లను సొంతం చేసుకుంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉన్నాయి. అయితే, అవకాశాలు చాలా తక్కువే. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో ప్లేస్‍లో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకు 13 మ్యాచ్‍లు ఆడి ఆరు గెలిచి, ఏడు ఓడింది. 12 పాయింట్లతో ఉంది. లీగ్ దశలో లక్నోకు ఇంకో మ్యాచ్ ఉంది. ముంబై ఇండియన్స్‌తో మే 17న తలపడనుంది. ఈ మ్యాచ్ భారీగా గెలిస్తే లక్నోకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండొచ్చు. అది కూడా ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. లక్నో ప్రస్తుతం పట్టికలో ఏడో స్థానానికి చేరింది. మొత్తంగా ఢిల్లీ, లక్నోకు ప్లేఆఫ్స్ ఆశలు చాలా అత్యల్పంగానే ఉన్నాయి.

లక్నోపై ఢిల్లీ విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ బెర్త్ పక్కా అయింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‍ల్లో 8 గెలిచిన ఆ జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించేసింది. ఆ జట్టు మరో రెండు లీగ్ మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే కోల్‍కతా కూడా ప్లేఆఫ్స్ చేరింది.

Whats_app_banner