GT vs DC: 8.5 ఓవర్లలోనే గెలిచేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఘోరంగా ఓడిన గుజరాత్
GT vs DC: IPL 2024: గుజరాత్ టైటాన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడించింది. ఏకంగా 8.5 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించి గెలిచింది ఢిల్లీ. హోం గ్రౌండ్‍లో గుజరాత్‍కు ఘోర పరాజయం ఎదురైంది.
Gujarat Titans vs Delhi Capitals: ఐపీఎల్ 2024 సీజన్‍లో గుజరాత్ క్యాపిటల్స్ టీమ్‍కు ఘోర పరాభవం ఎదురైంది. భారీ ఓటమిని ఆ జట్టు మూటగట్టుకుంది. ముందుగా బౌలింగ్‍లో దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఊదేసింది. గుజరాత్‍ను చిత్తుచేసింది. అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హోం గ్రౌండ్‍లో గుజరాత్‍కు ఘోర పరాజయం ఎదురైంది.
బౌలింగ్‍కు సహకరించిన పిచ్‍పై ఢిల్లీ బౌలర్లు చెలరేగారు. దీంతో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో కేవలం 89 పరుగులకే ఆలౌటైంది. రషీద్ ఖాన్ (24 బంతుల్లో 31 పరుగులు; 2 ఫోర్లు, ఓ సిక్స్) మినహా మిగిలిన గుజరాత్ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. అలా వచ్చి అలా పెవిలియన్‍కు వెళ్లారు. కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (8), డేవిడ్ మిల్లర్ (2)తో పాటు మరో ఆరుగురు జీటీ బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు. రషీద్ పోరాడంతో ఆ జట్టుకు ఆ మాత్రమైనా స్కోరు దక్కింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లతో చెలరేగాడు. 2.3 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇషాంత్ శర్మ (2/8), ట్రిస్టన్ స్టబ్స్ తలా రెండు, ఖలీల్ అహ్మద్, అక్షల్ పటేల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.
ఢిల్లీ అలవోకగా..
స్పల్ప లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఊదేసింది. 8.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 92 పరుగులు చేసి విజయం సాధించింది. 53 బంతుల్లోనే ఛేజ్ చేసి.. ఏకంగా 67 బంతులను మిగిల్చి గెలిచింది. జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (10 బంతుల్లో 20 పరుగులు), షాయ్ హోప్ (10 బంతుల్లో 19 పరుగులు), కెప్టెన్ రిషబ్ పంత్ (11 బంతుల్లో 16 నాటౌట్) వేగంగా ఆడారు. లక్ష్యాన్ని త్వరగా కరిగించేశారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్ చెరో వికెట్ తీశారు.
బంతులపరంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఐపీఎల్‍లో ఇది అతిపెద్ద విజయంగా ఉంది.
ఐపీఎల్‍లో గుజరాత్ టైటాన్స్ తొలిసారి 100 పరుగుల లోపు ఆలౌటైంది. 89 పరుగులకే ఆలౌటై.. తమ అత్యల్ప స్కోరు నమోదు చేసింది. హోం గ్రౌండ్‍లో చిత్తుగా ఓడింది.
పంత్ సూపర్ కీపింగ్
ఈ మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతంగా వికెట్ కీపింగ్ చేశాడు. రెండు స్టంప్ ఔట్లు, రెండు క్యాచ్‍లు పట్టాడు. ముఖ్యంగా గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ క్యాచ్‍ను ఫుల్ డైవ్ కొట్టి ఒంటి చేత్తో పట్టాడు పంత్. అభినవ్ మనోహర్(8), షారుఖ్ ఖాన్ (0)ను మెరుపు వేగంతో స్టంపౌట్ చేశాడు. మొత్తంగా సూపర్ వికెట్ కీపింగ్ చేసిన పంత్‍కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఢిల్లీకి మూడోది
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇది మూడో విజయం. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‍ల్లో మూడు గెలిచి 6 పాయింట్లను ఢిల్లీ దక్కించుకుంది. అయితే, భారీ తేడాతో గుజరాత్‍పై గెలువటంతో నెట్‍రన్ రేట్ మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్ తర్వాత ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. గుజరాత్ టైటాన్స్ 7 మ్యచ్‍ల్లో నాలుగు ఓడి మూడు గెలిచింది. ప్రస్తుతం ఆ జట్టు పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.