GT vs DC: ఐపీఎల్‍లో గుజరాత్ టైటాన్స్ తొలిసారి ఇలా.. హోం గ్రౌండ్‍లో కుప్పకూలిన గిల్‍సేన.. రెచ్చిపోయిన ఢిల్లీ బౌలర్లు
GT vs DC IPL 2024: ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా సత్తాచాటంతో గుజరాత్ టైటాన్స్ జట్టు కుప్పకూలింది. తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. దీంతో ఢిల్లీ ముందు స్వల్ప లక్ష్యం నిలిచింది.
GT vs DC IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టుకు షాక్ ఎదురైంది. హోం గ్రౌండ్ అహ్మదాబాద్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో మ్యాచ్‍లో గుజరాత్ కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో విలవిల్లాడిండింది. అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు (ఏప్రిల్ 17) ఐపీఎల్ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు.
గుజరాత్ తొలిసారి ఇలా..
ఐపీఎల్‍లో 100 పరుగుల లోపు ఆలౌట్ అవడం గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇదే తొలిసారి. 2022 సీజన్‍లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ ఈ మ్యాచ్ ముందు వరకు 100 రన్స్ లోపు ఎప్పుడూ కుప్పకూలలేదు. అయితే, నేటి మ్యాచ్‍లో ఢిల్లీ బౌలర్లు చెలరేగటంతో 89 పరుగులకే శుభ్‍మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ చాపచుట్టేసింది. ఆ జట్టుకు ఐపీఎల్‍లో ఇదే అత్యల్ప స్కోరు.
వికెట్లు టపటపా
ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగింది. గుజరాత్ బ్యాటర్లలో రషీద్ ఖాన్ (31) మినహా మరెవరూ రాణించలేకపోయారు. 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు. రెండో ఓవర్లోనే ఢిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ… గుజరాత్ కెప్టెన్ శుభ్‍మన్ గిల్(8)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్లో వృద్ధిమాన్ సాహా (2)ను ముకేశ్ కుమార్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత గుజరాత్ బ్యాటర్లు పెవిలియన్‍కు క్యూ కట్టారు. సాయి సుదర్శన్ (12), డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ (8) అలా వచ్చి ఇలా వెళ్లారు. ఎక్కువ సేపు నిలువలేకపోయారు. దీంతో 48 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. పీకల్లోతు కష్టాల్లో పడింది.
రషీద్ పోరాడటంతో ఆ మాత్రం..
రాహుల్ తెవాతియా (10) కాసేపు నిలువగా.. షారుఖ్ ఖాన్ (0) డకౌట్ అయ్యాడు. అయితే, గుజరాత్ స్టార్ రషీద్ ఖాన్ ఒంటరిగా పోరాడాడు. ఘోర అవమానం ఎదురవకుండా జట్టును కాపాడాడు. ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా.. నిలకడగా పరుగులు రాబట్టాడు. 24 బంతుల్లోనే 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 రన్స్ చేశాడు రషీద్. అతడికి మోహిత్ శర్మ (2) కాసేపు తోడుగా నిలిచాడు. అయితే, 18వ ఓవర్లో రషీద్ ఖాన్‍ను ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ ఔట్ చేశాడు. మోహిత్ శర్మ (2), నూర్ అహ్మద్ (1) కూడా త్వరగానే వెనుదిరిగారు. దీంతో గుజరాత్ నిలువలేకపోయింది. 89 పరుగులకే ఆలౌటైంది.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో పేసర్ ముకేశ్ కుమార్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. ఇషాంత్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 90 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది.