Rishabh Pant: 662 రోజుల తర్వాత.. ఢిల్లీ క్యాంప్‍లో అడుగుపెట్టిన పంత్.. ఆర్సీబీతో జాయిన్ అయిన మ్యాక్స్‌వెల్
Rishabh Pant - Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‍తో జాయిన్ అయ్యాడు రిషబ్ పంత్. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకున్న పంత్.. ఐపీఎల్ 2024 (IPL 2024) కోసం ఢిల్లీ క్యాంప్‍లో అడుగుపెట్టాడు. ఆ వివరాలివే..
Rishabh Pant - IPL 2024: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. పూర్తి ఫిట్‍నెస్ సాధించాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ చాలా శ్రమించి కోలుకున్నాడు. తీవ్రమైన గాయాలు, సర్జరీ జరిగినా మనోధైర్యంతో కష్టపడి అంచనాల కంటే ముందే అతడు రెడీ అయ్యాడు. ఈనెలలో మొదలయ్యే ఐపీఎల్ 2024లో తన టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. చాలా కాలం తర్వాత పంత్ మళ్లీ ఆడనుండటంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.

రిషబ్ పంత్‍కు బీసీసీఐ నుంచి తాజాగా పూర్తి ఫిట్‍నెస్ క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఐపీఎల్ 2024లో అతడు ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో నేడు (మార్చి 13).. అతడు ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనింగ్ క్యాంప్‍లో జాయిన్ అయ్యాడు. ఢిల్లీ జెర్సీ ధరించి ప్రాక్టీస్ చేశాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ వెల్లడించింది. ఢిల్లీ జట్టు ట్రైనింగ్ క్యాంప్ విశాఖపట్టణంలో జరుగుతోంది.
662 రోజుల తర్వాత ఢిల్లీ జెర్సీలో రిషబ్ పంత్ అని క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నేడు పోస్ట్ చేసింది. ఢిల్లీ ట్రైనింగ్ క్యాంప్‍లో పంత్ బ్యాటింగ్ చేసిన ఫొటోను పోస్ట్ చేసింది. “662 రోజుల తర్వాత.. డీసీ కలర్స్‌లో డే1” అని ఢిల్లీ పోస్ట్ చేసింది. రోడ్డు ప్రమాదం జరగడంతో గతేడాది ఐపీఎల్ 2023 సీజన్‍కు రిషబ్ పంత్ దూరమయ్యాడు. దీంతో 2022 సీజన్ నుంచి లెక్కేసి 662 రోజులు అంటూ ఢిల్లీ ఈ పోస్ట్ చేసింది.
గతేడాది ఐపీఎల్‍కు పంత్ దూరమవడంతో ఢిల్లీ జట్టుకు ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేశాడు. అయితే, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. అయితే, చాలాకాలం తర్వాత జట్టులోకి వస్తుండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ పంత్‍కు వెంటనే కెప్టెన్సీ ఇస్తుందా.. కొన్నాళ్లు పరిస్థితిని సమీక్షిస్తుందా అనేది చూడాలి. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న మొదలుకానుంది. ఈ సీజన్‍లో తొలి మ్యాచ్‍ను మార్చి 23న ఢిల్లీ ఆడనుంది. ఈ మ్యాచ్‍తోనే మళ్లీ 14 నెలల తర్వాత క్రికెట్‍లో కమ్ బ్యాక్ ఇవ్వనున్నాడు పంత్.
ఆర్సీబీ క్యాంప్‍లో మ్యాక్స్‌వెల్
ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ నేడు ఇండియాలో అడుగుపెట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో కలిశాడు. బెంగళూరులో ఆర్సీబీ ట్రైనింగ్ క్యాంప్‍లో అడుగుపెట్టాడు. అలాగే, కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ కూడా క్యాంప్‍లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా త్వరలో ఆర్సీబీ క్యాంప్‍లోకి రానున్నాడు.
ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్ కోసం 10 జట్లు ట్రైనింగ్ క్యాంప్‍లు మొదలుపెట్టేశాయి. క్రమంగా ఆటగాళ్లు జాయిన్ అవుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) సన్నాహకాలు కూడా హైదరాబాద్‍లో జోరుగా జరుగుతున్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సన్నద్ధమవుతోంది.
ఐపీఎల్ 2024 సీజన్‍లో తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. తొలి దశలో భాగంగా 21 మ్యాచ్‍ల షెడ్యూల్‍ను బీసీసీఐ ప్రకటించింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఈసారి రెండు దశలుగా షెడ్యూల్ ప్రకటించాలని బీసీసీఐ డిసైడ్ అయింది. రెండో దశ షెడ్యూల్‍ను త్వరలోనే ఖరారు చేయనుంది.