DC vs CSK: ధోనీ వింటేజ్ హిట్టింగ్: 16 బంతుల్లోనే 37 రన్స్ చేసిన తలా: కానీ చెన్నై ఓటమి.. పంత్ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ బోణీ-dc vs csk ipl 2024 highlights rishabh pant half century ms dhoni vintage super hitting delhi first win in 17th season ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dc Vs Csk: ధోనీ వింటేజ్ హిట్టింగ్: 16 బంతుల్లోనే 37 రన్స్ చేసిన తలా: కానీ చెన్నై ఓటమి.. పంత్ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ బోణీ

DC vs CSK: ధోనీ వింటేజ్ హిట్టింగ్: 16 బంతుల్లోనే 37 రన్స్ చేసిన తలా: కానీ చెన్నై ఓటమి.. పంత్ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ బోణీ

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 01, 2024 12:24 AM IST

DC vs CSK IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‍కు తొలి ఓటమి ఎదురైంది. రీఎంట్రీ తర్వాత రిషబ్ పంత్ ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. చెన్నై స్టార్ ధోనీ చివర్లో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ ఎలా సాగిందంటే..

DC vs CSK: పంత్ హాఫ్ సెంచరీ.. వింటేజ్ ధోనీ హిట్టింగ్: 16 బంతుల్లోనే 37 రన్స్ చేసిన తలా: ఢిల్లీ బోణీ.. చెన్నైకు తొలి ఓటమి
DC vs CSK: పంత్ హాఫ్ సెంచరీ.. వింటేజ్ ధోనీ హిట్టింగ్: 16 బంతుల్లోనే 37 రన్స్ చేసిన తలా: ఢిల్లీ బోణీ.. చెన్నైకు తొలి ఓటమి (AP)

IPL 2024 DC vs CSK: ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. రెండు గెలుపుల తర్వాత ఆ జట్టు పరాజయం చవిచూసింది. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు ఈ సీజన్‍లో తొలి గెలుపు రుచిచూసి.. బోణీ కొట్టింది. విశాఖపట్నం వేదికగా నేడు (మార్చి 31) జరిగిన మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‍పై విజయం సాధించింది.

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 32 బంతుల్లో 51 పరుగులతో అర్ధ శకతం చేశాడు. రోడ్డు ప్రమాదం తర్వాత తన రీఎంట్రీలో పంత్‍కు ఇది తొలి హాఫ్ సెంచరీగా ఉంది. డేవిడ్ వార్నర్ (52), పృథ్వి షా (43) కూడా అదరగొట్టారు. చెన్నై బౌలర్లలో మతీష పతిరణ మూడు వికెట్లతో రాణించగా.. ముస్తాఫిజుర్, రవీంద్ర జడేజా తలా వికెట్ పడగొట్టారు.

లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 రన్స్ మాత్రమే చేయగలిగింది. అజింక్య రహానే (45) రాణించగా.. చివర్లో ఎంఎస్ ధోనీ (37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. అయితే, మిగిలిన బ్యాటర్లు అవసరానికి తగ్గట్టుగా రాణించలేకపోయారు. దీంతో చెన్నైకు ఓటమి ఎదురైంది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశారు.

ధోనీ వీర హిట్టింగ్

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మార్క్ వింటేజ్ హిట్టింగ్‍తో అదరగొట్టాడు. తనకు అచ్చొచ్చిన సాగర తీరం వైజాగ్‍లో మోత మోగించాడు. ఈ సీజన్‍లో తొలిసారి బ్యాటింగ్‍కు దిగిన 42 ఏళ్ల ధోనీ ఈ మ్యాచ్‍ చివర్లో 16 బంతుల్లోనే 4 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. 231 స్ట్రైక్ రేట్‍తో అజేయంగా మహీ 37 రన్స్ చేశాడు. ధోనీ బాదుడుతో ప్రేక్షకుల అరుపులతో వైజాగ్ స్టేడియం హోరెత్తిపోయింది. ధోనీ వింటేజ్ స్టైల్ హిట్టింగ్‍తో అభిమానులు మురిసిపోయారు. మ్యాచ్‍లో చెన్నై ఓడినా.. ధోనీ బ్యాటింగ్ చూసి ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే, అప్పటికే మ్యాచ్ చెన్నై చేజారిపోవడంతో ధోనీ భీకరంగా ఆడినా గెలువలేకపోయింది.

రహానే ఒక్కడే..

భారీ లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. చెన్నై ఓపెనర్లు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1)ను తొలి ఓవర్లోనే ఔట్ చేసిన ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్.. మూడో ఓవర్లో రచిన్ రవీంద్ర (2) పెవిలియన్‍కు పంపాడు. దీంతో 7 పరుగులకే 2 వికెట్ల కోల్పోయి సీఎస్‍కే కష్టాల్లో పడింది. అయితే, ఆ తర్వాత అజింక్య రహానే, డారిల్ మిచెల్ (34) క్రమంగా పరుగులు రాబట్టారు. కాసేపటి తర్వాత దూకుడు పెంచారు. దీంతో 10 ఓవర్లలో 75 రన్స్ చేసింది చెన్నై. కాసేపటికే మిచెల్ ఔటయ్యాడు. దీంతో 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే, రహానే కాసేపు దూకుడుగా ఆడి ఔటయ్యాడు.

ధోనీ దుమ్మురేపినా..

ఆ తర్వాత శివం దూబే (18) వేగంగా ఆడలేకపోగా.. సమీర్ రిజ్వి (0) డకౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా (17 బంతుల్లో 21 పరుగులు, నాటౌట్) దూకుడుగా ఆడలేదు. అయితే, చెన్నై విజయానికి 23 బంతుల్లో 72 పరుగులు అవసరమైన దశలో ధోనీ బ్యాటింగ్‍కు దిగాడు. ధనాధన్ హిట్టింగ్‍తో మోతెక్కించాడు. 16 బంతుల్లోనే 37 రన్స్ చేశాడు ధోనీ. 3 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. అయితే, అప్పటికే మ్యాచ్ చెన్నైకి గెలుపు అసాధ్యంగా మారినా చివరి వరకు పోరాడాడు ధోనీ. జడేజా అలాగే నెమ్మదిగా ఆడాడు. మొత్తంగా ఢిల్లీ 20 రన్స్ తేడాతో గెలిచింది.

కీపింగ్‍లో ధోనీ రికార్డ్

టీ20 క్రికెట్‍లో 300 డిస్మిసల్స్ (213 క్యాచ్‍లు, 87 స్టంపింగ్స్) చేసిన తొలి వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లు, లీగ్‍లలో కలిపి 300 మంది బ్యాటర్ల ఔట్‍లో భాగస్వామ్యమై.. టీ20ల్లో ఈ మార్క్ చేరిన తొలి వికెట్ కీపర్‌గా తలా రికార్డులకెక్కాడు. ఢిల్లీతో మ్యాచ్‍లో పృథ్వి షా క్యాచ్ పట్టడం ద్వారా ఈ మైలురాయి చేరాడు ధోనీ. ఈ జాబితాలో ధోనీ తర్వాతి స్థానంలో దినేశ్ కార్తీక్ (274), పాకిస్థాన్ మాజీ కీపర్ కమ్రాన్ అక్మల్ (274) ఉన్నారు.