GT vs KKR IPL 2024: మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్ రేసును నుంచి గుజరాత్ ఔట్.. కోల్‍కతాకు టాప్-2 పక్కా-ipl 2024 gt vs kkr match abandoned due to rain gujarat titans out from play offs race ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gt Vs Kkr Ipl 2024: మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్ రేసును నుంచి గుజరాత్ ఔట్.. కోల్‍కతాకు టాప్-2 పక్కా

GT vs KKR IPL 2024: మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్ రేసును నుంచి గుజరాత్ ఔట్.. కోల్‍కతాకు టాప్-2 పక్కా

Chatakonda Krishna Prakash HT Telugu
May 13, 2024 11:23 PM IST

GT vs KKR IPL 2024: గుజరాత్ టైటాన్స్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య మ్యాచ్ రద్దయింది. వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ క్యాన్సిల్ అయింది. దీంతో ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్ అయింది.

GT vs KKR IPL 2024: మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్ రేసును నుంచి గుజరాత్ ఔట్.. కోల్‍కతాకు టాప్-2 పక్కా
GT vs KKR IPL 2024: మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్ రేసును నుంచి గుజరాత్ ఔట్.. కోల్‍కతాకు టాప్-2 పక్కా (AFP)

GT vs KKR IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో గుజరాత్ టైటాన్స్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య మ్యాచ్ వర్షార్పణం అయింది. అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు (మే 13) జరగాల్సిన ఈ మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయింది. చాలాసేపు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. కాసేపు విరామం ఇచ్చినా మళ్లీ కురిసింది. దీంతో మ్యాచ్‍ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. అయితే, ఈ కీలక మ్యాచ్ క్యాన్సిల్ అవడంతో ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్ అయింది. 2023 సీజన్‍లో టైటిల్ గెలిచి.. 2023లో రన్నరప్ అయిన ఆ జట్టు.. ఈ ఏడాది లీగ్ దశలోనే ఎలిమినేట్ కానుంది.

గుజరాత్ ఔట్

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‍లు ఆడిన గుజరాత్ టైటాన్స్ ఏడు ఓడి, ఐదు గెలిచింది. కోల్‍కతాతో నేటి మ్యాచ్ రద్దయింది. దీంతో 11 పాయింట్లతో గుజరాత్ ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో ప్లేస్‍లో నిలిచింది. లీగ్ దశలో గుజరాత్‍కు మరో మ్యాచ్ మిగిలి ఉంది. అయితే, ఆ మ్యాచ్ గెలిచినా.. ఆ జట్టు పాయింట్లు 13కు చేరుతాయి. అయినా ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరలేదు. దీంతో యువ స్టార్ శుభ్‍మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‍లో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టనుంది.

రెండేళ్లు భళా.. ఇప్పుడు డీలా

గుజరాత్ టైటాన్స్ జట్టు 2022లో ఐపీఎల్‍లో అరంగేట్రం చేసింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో తన తొలి సీజన్‍లోనే టైటిల్ గెలిచి సత్తాచాటింది గుజరాత్. గతేడాది 2023 సీజన్‍లోనూ ఫైనల్ వరకు చేరింది. ఫైనల్‍లో చెన్నై చేతిలో చివరి బంతికి ఓడి రన్నరప్‍గా నిలిచింది. అయితే, 2024 సీజన్‍లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్‍ను వీడి ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్లాడు. దీంతో శుభ్‍మన్ గిల్ కెప్టెన్ అయ్యాడు. ఈ సీజన్‍లో నిలకడ లేని ఆటతో గుజరాత్ నిరాశపరిచింది. మొత్తంగా గ్రూప్ దశలోనే ఎలిమినేట్ కానుంది. మే 16న సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో ఈ సీజన్‍లో తన చివరి మ్యాచ్ ఆడనుంది గుజరాత్ టైటాన్స్.

కోల్‍కతా టాప్-2 ఫిక్స్

ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టు భీకర ఫామ్‍లో ఉంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 9 గెలిచి, 3 మాత్రమే ఓడగా.. గుజరాత్‍తో నేటి మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఈ సీజన్‍లో ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. 19 పాయింట్లు కోల్‍కతా ఖాతాలో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‍లో కొనసాగింది. అయితే, తన చివరి లీగ్ మ్యాచ్‍ను కోల్‍కతా మే 19వ తేదీన రెండో ప్లేస్‍లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఆడనుంది. ఒకవేళ ఆ మ్యాచ్ ఓడినా పాయింట్ల పట్టికలో టాప్-2లోనే ఉంటుంది కోల్‍కతా. దీంతో ఇప్పటికే ఆ జట్టు క్వాలిఫయర్-1లో అడుగుపెట్టేసింది.

2022, 2023 సీజన్లలో ఏడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ చేరకుండా కేకేఆర్ నిరాశపరిచింది. అయితే, మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఈ 2024 సీజన్‍కు మెంటార్‌గా రావడంతో జట్టు ఆట తీరు మారిపోయింది. దూకుడుగా ఆడింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కోల్‍కతా దుమ్మురేపింది. దీంతో అలవోగా విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది.