IPL 2024 RCB vs GT Result: అలవోకగా గెలిచిన బెంగళూరు.. గుజరాత్ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం.. చివరి ప్లేస్‍కు ముంబై-rcb vs gt ipl 2024 result royal challengers begaluru won against gujarat mumbai indians drops 10th place in points table ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Rcb Vs Gt Result: అలవోకగా గెలిచిన బెంగళూరు.. గుజరాత్ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం.. చివరి ప్లేస్‍కు ముంబై

IPL 2024 RCB vs GT Result: అలవోకగా గెలిచిన బెంగళూరు.. గుజరాత్ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం.. చివరి ప్లేస్‍కు ముంబై

Chatakonda Krishna Prakash HT Telugu
May 04, 2024 11:29 PM IST

RCB vs GT IPL 2024 Result: గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలవోకగా విజయం సాధించింది. అద్భుత ఆల్ రౌండ్ ఆటతో బెంగళూరు దుమ్మురేపింది. దీంతో గుజరాత్ ప్లేఆఫ్స్ ఆశలు కూడా సంక్లిష్టం అయ్యాయి.

IPL 2024 RCB vs GT Result: అలవోకగా గెలిచిన బెంగళూరు.. గుజరాత్ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం.. చివరి ప్లేస్‍కు ముంబై
IPL 2024 RCB vs GT Result: అలవోకగా గెలిచిన బెంగళూరు.. గుజరాత్ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం.. చివరి ప్లేస్‍కు ముంబై (PTI)

RCB vs GT IPL 2024 Result: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫామ్‍ కొనసాగిస్తోంది. గుజరాత్ టైటాన్స్‌పై అలవోక విజయంతో నేడు (మే 4) ఆర్సీబీ దుమ్మురేపింది. దీంతో హ్యాట్రిక్ గెలుపు నమోదు చేసింది. ఈ సీజన్‍లో ఆరంభంలో తీవ్రంగా తడబడిన బెంగళూరు ఇప్పుడు పుంజుకుంటోంది. చిన్నస్వామి స్టేడియంలో నేడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‍లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్‍పై విజయం సాధించింది. 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సునాయాసంగా గెలిచింది. దీంతో ఈ సీజన్‍లో 11 మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచి.. ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి ప్రస్తుతం ఏడో ప్లేస్‍కు వచ్చింది. ఈ ఓటమితో గుజరాత్ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టంగా మారాయి.

ఆరంభంలో ధనాధన్.. ఆ తర్వాత టెన్షన్

147 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని అలవోకగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూలు ఛేదించింది. 13.4 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసి విజయం సాధించింది. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 23 బంతుల్లోనే 64 పరుగులతో హిట్టింగ్ వీరంగం చేశాడు. మెరుపు అర్ధ శకతం చేశాడు. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను ఆటాడుకున్నాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు ఫాఫ్. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 27 బంతుల్లోనే 42 పరుగులతో మెరిపించాడు. 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో మెరిపించాడు. ఆరంభంలో ఫాఫ్, కోహ్లీ దూకుడుతో 5.5 ఓవర్లలోనే 92 రన్స్ చేసింది బెంగళూరు. పది ఓవర్లలోనే గెలిచేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్ చివరి బంతికి డుప్లెసిస్‍ను గుజరాత్ పేసర్ లిటిల్ ఔట్ చేశాడు.

ఆ తర్వాత బెంగళూరు బ్యాటర్లు విల్ జాక్స్ (1), రజత్ పటిదార్ (2), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4), కామెరూన్ గ్రీన్ (1) వెనువెంటనే ఔటయ్యారు. కోహ్లీ కూడా కాసేపటికే వెనుదిరిగాడు. దీంతో ఓ దశలో 92/0గా ఉన్న బెంగళూరు 117/6 కు కుప్పకూలి టెన్షన్ పడింది. అయితే, ఆ తర్వాత సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ దూకుడుగా ఆడాడు. 12 బంతుల్లోనే అజేయంగా 21 పరుగులతో గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. స్పప్నిల్ సింగ్ (15 నాటౌట్) కూడా అదరగొట్టాడు. మరో వికెట్ పడకుండా కార్తీక్, స్వప్నిల్ నిలిచారు. దీటుగా ఆడారు. దీంతో బెంగళూరు సునాయాసంగానే గెలిచింది.

గుజరాత్‍ విఫలం

అంతకు ముందు ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బెంగళూరు బౌలర్లు సమిష్టిగా రాణించి.. కట్టడి చేశారు. గుజరాత్ బ్యాటర్లు షారూఖ్ ఖాన్ (37), రాహుల్ తెవాతియా (35), డేవిడ్ మిల్లర్ (30) మోస్తరుగా రాణించగా.. కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (2), వృద్ధిమాన్ సాహా (1) సహా మిలిగిన బ్యాటర్లు విఫలమయ్యారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, యశ్ దయాళ్, వైశాఖ్ విజయ్ కుమార్ తలా రెండు వికెట్లతో రాణించారు. కామెరూన్ గ్రీన్, కర్ణ్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. క్రమంగా వికెట్లు తీస్తూ గుజరాత్‍పై ఒత్తిడి పెట్టారు ఆర్సీబీ బౌలర్లు.

బెంగళూరు 7కు, ముంబై చివరికి..

ఈ సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు 11 మ్యాచ్‍ల్లో 4 గెలిచి.. 7 మ్యాచ్‍ల్లో ఓడింది. 8 పాయింట్లను దక్కించుకుంది. దీంతో ఎట్టకేలకు చివరిదైన పదో స్థానం నుంచి పైకి వచ్చింది. ప్రస్తుతం ఏడో ప్లేస్‍కు చేరింది. లీగ్ దశలో మిగిలిన తన మూడు మ్యాచ్‍లను బెంగళూరు భారీగా గెలిస్తే.. ప్లేఆఫ్స్ ఆశలు కాస్త ఉండొచ్చు. అయితే, అది కూడా కచ్చితంగా కాదు. ఆర్సీబీ పైకి వెళ్లటంతో ముంబై ఇండియన్స్  (11 మ్యాచ్‍ల్లో 8 ఓటమి, 3 గెలుపు) చివరిదైన పదో స్థానానికి పడిపోయింది. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్‍ల్లో ఏడు ఓడి ప్లేఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. 8 పాయింట్లు ఉన్నా -1.32 నెట్ రన్ రేట్‍ ఉండటంతో ప్రస్తుతం పట్టికలో తొమ్మిదో ప్లేస్‍కు పడిపోయింది. మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‍లు భారీగా గెలిస్తేనే ఆ జట్టుకు కాస్త ప్లేఆఫ్స్ ఆశలు ఉంటాయి. అది కూడా కష్టసాధ్యంగానే ఉంది.