RCB vs GT IPL 2024: గుజరాత్‍ను కట్టడి చేసిన బెంగళూరు బౌలర్లు.. కళ్లు చెదిరే డైరెక్ట్ హిట్‍తో అదరగొట్టిన కోహ్లీ: వీడియో-rcb vs gt ipl 2024 update royal challengers bangalore bowlers restricted gujarat titans and virat kohli super direct hit ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Vs Gt Ipl 2024: గుజరాత్‍ను కట్టడి చేసిన బెంగళూరు బౌలర్లు.. కళ్లు చెదిరే డైరెక్ట్ హిట్‍తో అదరగొట్టిన కోహ్లీ: వీడియో

RCB vs GT IPL 2024: గుజరాత్‍ను కట్టడి చేసిన బెంగళూరు బౌలర్లు.. కళ్లు చెదిరే డైరెక్ట్ హిట్‍తో అదరగొట్టిన కోహ్లీ: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
May 04, 2024 09:46 PM IST

RCB vs GT IPL 2024: గుజరాత్ టైటాన్స్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు కట్టడి చేశారు. సమిష్టిగా రాణించి గుజరాత్ బ్యాటర్లను నిలువరించారు. కోహ్లీ ఓ అద్భుత రనౌట్ చేశాడు.

RCB vs GT IPL 2024: గుజరాత్‍ను కట్టడి చేసిన బెంగళూరు బౌలర్లు.. కళ్లు చెదిరే డైరెక్ట్ హిట్‍తో అదరగొట్టిన కోహ్లీ: వీడియో
RCB vs GT IPL 2024: గుజరాత్‍ను కట్టడి చేసిన బెంగళూరు బౌలర్లు.. కళ్లు చెదిరే డైరెక్ట్ హిట్‍తో అదరగొట్టిన కోహ్లీ: వీడియో (PTI)

RCB vs GT IPL 2024: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‍లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‍లో తడబడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో నేటి (ఏప్రిల్ 4) మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ తంటాలు పడింది. హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బౌలర్లు మెప్పించారు. దీంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే గుజరాత్ టైటాన్స్ ఆలౌటైంది.

రెచ్చిపోయిన సిరాజ్

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (1)ను రెండో ఓవర్లోనే బెంగళూరు స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. నాలుగో ఓవర్లో గుజరాత్ కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (2)ను పెవిలియన్‍కు పంపాడు. దీంతో 3.5 ఓవర్లలో 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది జీటీ. సాయి సుదర్శన్ (6) కూడా త్వరగానే ఔటయ్యాడు.

నిలబెట్టిన షారూఖ్, మిల్లర్

19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో గుజరాత్ బ్యాటర్ షారూఖ్ ఖాన్ 24 బంతుల్లో 37 పరుగులతో రాణించాడు. 5 ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు. డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లోనే 30 పరుగులతో ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అయితే, 12వ ఓవర్లో మిల్లర్‌ను ఔట్ చేసి బ్రేక్‍త్రూ ఇచ్చాడు ఆర్సీబీ స్పిన్నర్ కర్ణ్ శర్మ. దీంతో 61 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లీ సూపర్ డైరెక్ట్ హిట్.. షారుఖ్ ఔట్

జోరు మీద ఆడుతున్న షారుఖ్ ఖాన్‍ను బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ అద్భుత డైరెక్ట్ హిట్‍తో రనౌట్ చేశాడు. 13వ ఓవర్లో సింగిల్‍కు ప్రయత్నించి షారూఖ్ వెనక్కి వెళ్లగా.. నాన్ స్టైకర్ ఎండ్‍లో వికెట్లకు డైరెక్ట్ త్రో చేశారు కోహ్లీ. అప్పటికి క్రీజులోకి షారూఖ్ రాలేకపోయాడు. దీంతో ఔటయ్యాడు. మొత్తంగా కోహ్లీ సూపర్ డైరెక్ట్ హిట్‍తో షారుఖ్ పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెవాతియా మెరుపులు

రాహుల్ తెవాతియా 21 బంతుల్లోనే 35 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. 5 ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. దీంతో గుజరాత్ కోలుకుంది. అయితే, 18వ ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్‍లో వైశాక్ విజయ్ కుమార్ పట్టిన మెరుపు క్యాచ్‍కు తెవాతియా ఔటయ్యాడు. రషీద్ ఖాన్ (10) కాసేపే నిలిచాడు. చివర్లో టపటపా వికెట్లు పడ్డాయి. దీంతో 19.3 ఓవర్లలోనే 147 పరుగులకు గుజరాత్ చాపచుట్టేసింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, యశ్ దయాళ్, వైశాఖ్ విజయ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. కామెరూన్ గ్రీన్, కర్ణ్ శర్మ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. పొదుపుగా బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. యశ్ యదాల్ 4 ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చాడు. బెంగళూరు ముందు 148 పరుగుల స్వల్ప టార్గెట్ ఉంది.

Whats_app_banner