AP Farm Fund Scheme : ఏపీ రైతుల‌కు గుడ్‌న్యూస్‌, అకౌంట్‌లో రూ.75 వేలు-ఈ పథకం గురించి తెలుసుకోండి-ap govt farm fund scheme for farmers gives 75k on subsidy scheme details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Farm Fund Scheme : ఏపీ రైతుల‌కు గుడ్‌న్యూస్‌, అకౌంట్‌లో రూ.75 వేలు-ఈ పథకం గురించి తెలుసుకోండి

AP Farm Fund Scheme : ఏపీ రైతుల‌కు గుడ్‌న్యూస్‌, అకౌంట్‌లో రూ.75 వేలు-ఈ పథకం గురించి తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Nov 25, 2024 05:07 PM IST

AP Farm Fund Scheme : ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఫార్మ్ ఫండ్ స్కీమ్ ద్వారా రైతులకు రూ.75 వేల సబ్సిడీ అందిస్తుంది. క‌రువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన పంట‌ల సాగులో నీటి కొత‌ర స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఏపీ రైతుల‌కు గుడ్‌న్యూస్‌, అకౌంట్‌లో రూ.75 వేలు-ఈ పథకం గురించి తెలుసుకోండి
ఏపీ రైతుల‌కు గుడ్‌న్యూస్‌, అకౌంట్‌లో రూ.75 వేలు-ఈ పథకం గురించి తెలుసుకోండి

రైతుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రైతుల అకౌంట్‌ల్లో రూ.75 వేలు జ‌మ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప‌థ‌కం ఏపీ ఫార్మ్ ఫండ్ స్కీమ్‌-2024. ఉద్యాన పంట‌ల పండించే రైతుల కోసం దీనిని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది.

క‌రువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన పంట‌ల సాగులో నీటి కొత‌ర స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఫార్మ్ ఫండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. నీటి ల‌భ్యత‌ను పెంపొందించ‌డం, పంట దిగుబ‌డిని మెరుగుప‌ర‌చ‌డం, నీటి నిల్వ కోసం ఫారం పాండ్‌ల‌ను సృష్టించే ఖ‌ర్చును స‌బ్సిడీ చేయ‌డం ద్వారా రైతును ఆర్థికంగా ఆదుకోవ‌డం ఈ ప‌థ‌కం ల‌క్ష్యంగా ఉంది.

ఈ ప‌థ‌కం ద్వారా ఫామ్ పాండ్‌ల‌ను నిర్మిస్తుంది. 20 మీట‌ర్లు (పొడువు) x 20 మీట‌ర్లు (వెడ‌ల్పు) x 3 మీట‌ర్లు (లోతు) కొల‌త‌లో నిర్మిస్తారు. ఇందులో జియో మెంబ్రేన్ షీట్ (500 మైక్రాన్లు) ఉప‌యోగించి 12 ల‌క్షల లీట‌ర్ల వ‌ర‌కు నీటి నిల్వ చేస్తారు. వేస‌వి కాలంలో రెండు ఎక‌రాల్లో రెండు పంట‌లకు స‌రిపడా నీటిని అందించ‌గ‌ల సామ‌ర్థ్యం ఉంటుంది.

దీనివ‌ల్ల వేస‌వి వంటి క్లిష్టమైన కాలంలో నీటి ల‌భ్యత‌ను నిర్ధారిస్తుంది. పండ్లు, పువ్వులు, కూర‌గాయ‌ల పంటల దిగుబ‌డిని మెరుగ‌ప‌ర‌చ‌డంలో స‌హాయప‌డుతుంది. నీటి కొర‌త ఉన్న ప్రాంతాల్లో స్థిర‌మైన వ్యవ‌సాయ ప‌ద్ధతుల‌ను ప్రోత్సహిస్తుంది.

50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భ‌రిస్తుంది

చెరువు నిర్మాణానికి మొత్తం ఖ‌ర్చు రూ.1.50 ల‌క్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం స‌బ్సిడీ ద్వారా రూ.75 వేలు (మొత్తం ఖ‌ర్చులో 50 శాతం) ఇస్తుంది. రైతు త‌న వాటా కింద రూ. 75 వేలు భ‌రించాల్సి వ‌స్తుంది.

ఈ స్కీమ్‌కు అవ‌స‌ర‌మైన పత్రాలు

1. ల్యాండ్ టైటిల్‌, పాస్‌పుస్తకం

2. ఆధార్ కార్డు

3. బ్యాంక్ పాస్‌బుక్‌

4. దర‌ఖాస్తు ఫారం

దర‌ఖాస్తు ఎలా చేయాలి?

1. దర‌ఖాస్తు ఫారం మీ సేవా కేంద్రాల నుంచి పొందాలి. మీ సేవా కేంద్రంలో ద‌ర‌ఖాస్తును న‌మోదు చేసుకోవాలి.

2. దర‌ఖాస్తు ఫారంను పూర్తి చేసి రైతు భ‌రోసా కేంద్రం (ఆర్‌బీకే)లో స‌మ‌ర్పించాలి.

3. అధికారుల ధ్రువీక‌ర‌ణ త‌రువాత చెరువులు తవ్వడం ప్రారంభించాలి.

4. జియో-మెమ్‌బ్రేన్ షీట్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.

5. దాన్ని ధ్రువీక‌రించిన త‌రువాత రూ.75 వేల స‌బ్సిడీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు జ‌మ అవుతుంది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం