KKR vs MI IPL 2024: సూపర్ విక్టరీతో ప్లేఆఫ్స్ చేరిన కోల్‍కతా.. ముంబైకు మరో పరాభవం-kkr vs mi result mumbai indians faces another loss and kolkata knight riders officially enters ipl 2024 playoffs ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kkr Vs Mi Ipl 2024: సూపర్ విక్టరీతో ప్లేఆఫ్స్ చేరిన కోల్‍కతా.. ముంబైకు మరో పరాభవం

KKR vs MI IPL 2024: సూపర్ విక్టరీతో ప్లేఆఫ్స్ చేరిన కోల్‍కతా.. ముంబైకు మరో పరాభవం

Chatakonda Krishna Prakash HT Telugu
May 12, 2024 05:00 AM IST

KKR vs MI Result IPL 2024: ముంబైపై కోల్‍కతా విజయం సాధించింది. ఆల్ రౌండ్ షోతో మళ్లీ అదరగొట్టింది. దీంతో ఈ సీజన్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేసింది కేకేఆర్. ముంబై జట్టుకు మరో పరాభవం ఎదురైంది.

KKR vs MI IPL 2024: సూపర్ విక్టరీతో ప్లేఆఫ్స్ చేరిన కోల్‍కతా.. ముంబైకు మరో పరాభవం
KKR vs MI IPL 2024: సూపర్ విక్టరీతో ప్లేఆఫ్స్ చేరిన కోల్‍కతా.. ముంబైకు మరో పరాభవం (AP)

Kolkata Knight Riders vs Mumbai Indians: ఐపీఎల్ 2024 సీజన్‍లో అద్భుత ప్రదర్శనను కోల్‍కతా నైట్‍రైడర్స్ (KKR) కొనసాగించింది. తొమ్మిదో విజయాన్ని సాధించి అధికారికంగా ప్లేఆఫ్స్ చేరుకుంది. ఈ సీజన్‍లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. ముంబై ఇండియన్స్ (MI) మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు (మే 11) జరిగిన మ్యాచ్‍లో హోం టీమ్ కోల్‍కతా 18 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. వర్షం కారణంగా ప్రారంభం ఆలస్యమవటంతో 16 ఓవర్లకు కుదించిన ఈ పోరులో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన కేకేఆర్ సూపర్ విక్టరీ కొట్టింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఆ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍ను మరింత పటిష్టం చేసుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయిన ముంబై మరో పరాజయాన్ని మూటగట్టుకుంది.

కోల్‍కతా బౌలర్ల జోరు.. ముంబై వెలవెల

16 ఓవర్లలో 158 పరుగుల లక్ష్యం ముందుండగా.. ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపరిచింది. బ్యాటింగ్‍కు సహకరిస్తున్న పిచ్‍పై కూడా రాణించలేకపోయింది. కోల్‍కతా బౌలర్ల జోరుకు దాసోహం అయింది. 16 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 40 పరుగులు; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడినా కిషన్ దుమ్మురేపాడు. అయితే, అతడిని ఏడో ఓవర్లలో ఔట్ చేసి బ్రేత్రూ ఇచ్చాడు కోల్‍కతా స్పిన్నర్ సునీల్ నరైన్. దీంతో 65 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. రన్స్ చేసేందుకు ఇబ్బందులు పడిన రోహిత్ శర్మ (24 బంతుల్లో 19 పరుగులు) ఆ తర్వాతి ఓవర్లోనే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‍లో క్యాచౌట్ అయ్యాడు.

సూర్య, డేవిడ్ విఫలం.. తిలక్ పోరాటం

ఆ తర్వాత ముంబై హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 11 రన్స్) కూడా విఫలమయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2) మరోసారి అలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. 12వ ఓవర్లో హార్దిక్‍ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. టిమ్ డేవిడ్ (0) రసెల్ బౌలింగ్‍లో డకౌట్ అయ్యాడు. యంగ్ స్టార్ తిలక్ వర్మ (17 బంతుల్లో 32 పరుగులు) కాసేపు పోరాడాడు. అయితే, మరో ఎండ్ నుంచి సహకారం దక్కలేదు. చివరి ఓవర్లో తిలక్ కూడా ఔటయ్యాడు. నమన్ ధీర్ (6 బంతుల్లో 17 పరుగులు) కాసేపు మెరిపించినా ఫలితం లేకపోయింది.

కోల్‍కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి 2 వికెట్లతో మెరిశాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాను ఔట్ చేశాడు. ఆండ్రీ రసెల్, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు తీసుకోగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

రాణించిన వెంకటేశ్.. చివర్లో రసెల్, రింకూ

టాస్ ఓడి ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతా నైట్‍రైడర్స్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఫామ్‍లో ఉన్న కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (6)ను ముంబై పేసర్ నువాన్ తుషారా తొలి ఓవర్లో ఔట్ చేయగా.. ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే సునీల్ నరైన్ (0)ను గోల్డెన్ డక్ చేశాడు బుమ్రా. అయితే, ఆ తర్వాత కోల్‍కతా బ్యాటర్లు వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42 పరుగులు; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్ రాణా (23 బంతుల్లో 33 పరుగులు; 4 ఫోర్లు, ఓ సిక్స్) రాణించారు. వారు ఔటైనా ఆండ్రీ రసెల్ (14 బంతుల్లో 24 రన్స్), రింకూ సింగ్ (12 బంతుల్లో 20 పరుగులు) మెరిపించారు. చివర్లో రమణ్‍దీప్ సింగ్ (8 బంతుల్లో 17 పరుగులు నాటౌట్; ఓ ఫోర్, ఓ సిక్స్) కీలక పరుగులు చేశాడు.

ముంబై బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా, స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీసుకోగా.. నువాన్ తుషారా, అన్షుల్ కాంబోజ్‍కు ఒక్కో వికెట్ లభించింది.

కోల్‍కతా టాప్ మరింత పటిష్టం

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు కోల్‍కతా నైట్‍రైడర్స్ 12 మ్యాచ్‍ల్లో 9 గెలిచింది. 18 పాయింట్లను సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‍లో కొనసాగింది. ఆ జట్టుకు ఇంకా రెండు లీగ్ మ్యాచ్‍‍లు ఉన్నాయి. ప్లేఆఫ్స్‌కు కూడా అప్పుడే అర్హత సాధించింది. ఇక, ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్‍ల్లో 9 ఓడి.. 4 మాత్రమే గెలిచింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔటైన ఆ టీమ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.