Sunrisers Hyderabad: ఉప్పల్‍లో సన్‍రైజర్స్ సునామీ.. హెడ్, అభిషేక్ వీర కుమ్ముడుతో లక్నో చిత్తుచిత్తు.. 9.4 ఓవర్లలో గెలుపు-tavis head and abhishek sharma blasting batting sunrisers hyderabad huge win over lucknow srh vs lsg ipl 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sunrisers Hyderabad: ఉప్పల్‍లో సన్‍రైజర్స్ సునామీ.. హెడ్, అభిషేక్ వీర కుమ్ముడుతో లక్నో చిత్తుచిత్తు.. 9.4 ఓవర్లలో గెలుపు

Sunrisers Hyderabad: ఉప్పల్‍లో సన్‍రైజర్స్ సునామీ.. హెడ్, అభిషేక్ వీర కుమ్ముడుతో లక్నో చిత్తుచిత్తు.. 9.4 ఓవర్లలో గెలుపు

Chatakonda Krishna Prakash HT Telugu
May 08, 2024 10:55 PM IST

SRH vs LSG IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌ను సన్‍రైజర్స్ హైదరాబాద్ చిత్తుచిత్తుగా ఓడించింది. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీర హిట్టింగ్‍తో దుమ్ములేపారు. 9.4 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించి లక్నోకు దడ పుట్టించించింది సన్‍రైజర్స్.

Sunrisers Hyderabad: ఉప్పల్‍లో సన్‍రైజర్స్ సునామీ.. హెడ్, అభిషేక్ వీర కుమ్ముడుతో లక్నో చిత్తుచిత్తు.. 9.4 ఓవర్లలో గెలుపు
Sunrisers Hyderabad: ఉప్పల్‍లో సన్‍రైజర్స్ సునామీ.. హెడ్, అభిషేక్ వీర కుమ్ముడుతో లక్నో చిత్తుచిత్తు.. 9.4 ఓవర్లలో గెలుపు (AP)

Sunrisers Hyderabad vs Lucknow Super Giants: సన్‍రైజర్స్ హైదరాబాద్ హిట్టింగ్ సునామీలో లక్నో సూపర్ జెయింట్స్ కొట్టుకుపోయింది. హైదరాబాద్‍ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ భీకర హిట్టింగ్‍తో లక్నోను బెంబేలెత్తించారు. ఐపీఎల్ 2024 సీజన్‍లో కీలక మ్యాచ్‍లో కుమ్మేసి ప్లేఆఫ్స్ అవకాశాలు హైదరాబాద్ మెరుగుపరుచుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు (మే 8) జరిగిన మ్యాచ్‍‍లో హోం టీమ్ సన్‍రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 58 బంతుల్లోనే 167 రన్స్ చేసి భారీ విజయం సాధించింది. ఏకంగా 62 బంతులను మిగిల్చి ఎస్ఆర్‌హెచ్ గెలిచింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పుట్టిన రోజున హైదరాబాద్ అద్భుత విజయాన్ని సాధించింది.

హెడ్, అభిషేక్ దండయాత్ర

లక్ష్యఛేదనలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ.. లక్నో బౌలర్లపై దండయాత్ర చేశారు. బౌండరీలు, సిక్స్‌లతో ఇద్దరూ వీర హిట్టింగ్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో మెరుపు హాఫ్ సెంచరీల మోతమోగించారు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లోనే 89 పరుగులతో అద్భుత హిట్టింగ్ చేశాడు. అర్ధ శకతంతో కుమ్మేశాడు. 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో హెడ్ ధనాధన్ బ్యాటింగ్‍తో దుమ్మురేపాడు. అభిషేక్ శర్మ కూడా తన మార్క్ హిట్టింగ్‍తో సునామీ సృష్టించాడు. 28 బంతుల్లోనే 75 పరుగులతో అభిషేక్ అరిపించేశాడు. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో విజృంభించాడు.

హెడ్, అభిషేక్ దూకుడుతో 5.4 ఓవర్లలోనే హైదరాబాద్ 100 పరుగులు దాటేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ కుమ్ముడు ఏ మాత్రం ఆపలేదు. లక్నో బౌలర్లపై విరుచుపడ్డారు. హైదరాబాద్ భీకర ఓపెనర్లను ఎలా అడ్డుకోవాలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‍కు అర్ధం కాలేదు. మొత్తంగా చివరి వరకు హెడ్, అభిషేక్ దుమ్మురేపారు. ఇద్దరూ అజేయంగా 58 బంతుల్లోనే 167 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలిపించేశారు. 9.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 167 పరుగులు చేసి హైదరాబాద్ విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును (287 రన్స్) ఇదే సీజన్‍లో సృష్టించిన హైదరాబాద్ మళ్లీ తన మార్క్ దూకుడు చూపింది.

ఐపీఎల్‍లో 160 పరుగులకుపైగా లక్ష్యాన్ని 10 ఓవర్లలోపే ఛేదించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది హైదరాబాద్.

ఈ మ్యాచ్‍‍లో హెడ్, అభిషేక్ కుమ్ముడుతో లక్నో బౌలర్లందరూ భారీ పరుగులు సమర్పించుకున్నారు. యశ్ ఠాకూర్ 2.4 ఓవర్లలో 47 రన్స్ ఇస్తే.. నవీనుల్ హక్ 2 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చుకున్నాడు. మిగిలిన బౌలర్లు కూడా ఇదే రేంజ్‍లో రన్స్ ఇచ్చారు.

బదోనీ పోరాటం.. లక్నో విఫలం

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోనీ (55 నాటౌట్), నికోలస్ పూరన్ (48 నాటౌట్) మినహా మరెవరూ ఆకట్టుకోలేకపోయారు. బదోనీ చివరి వరకు నిలిచి అర్ధ శకతంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 29 పరుగులే చేసి నిరాశపరచగా.. మిగిలి వారు కూడా ఆకట్టుకోలేకపోయారు. బ్యాటింగ్ పిచ్‍పై లక్నో పెద్ద స్కోరు చేయడంలో విఫలమైంది.

సన్‍రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

మూడో ప్లేస్‍కు సన్‍రైజర్స్

లక్నోపై ఈ భారీ విజయం సాధించిన సన్‍రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానానికి వచ్చింది. 12 మ్యాచ్‍ల్లో 7 గెలిచి 14 పాయింట్లను సొంతం చేసుకుంది. లీగ్ దశలో హైదరాబాద్‍కు మరో రెండు మ్యాచ్‍లు మిగిలి ఉన్నాయి. ఒకటి గెలిచినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉంటాయి. లక్నో సూపర్ జెయింట్స్ 12 మ్యాచ్‍ల్లో 6 గెలిచి, 6 ఓడింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‍లో ఘోరంగా ఓడటంతో -0.76కు ఆ జట్టు నెట్‍రన్ పడిపోయింది.

Whats_app_banner