Sunrisers Hyderabad: 20 రోజుల్లోనే తన చరిత్రనే తిరగరాసిన హైదరాబాద్.. హెడ్, క్లాసెన్ వీరకుమ్ముడు.. చిన్నస్వామిలో సునామీ
Sunrisers Hyderabad: సన్‍రైజర్స్ హైదరాబాద్ తన చరిత్రనే తిరగరాసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును మరోసారి సాధించింది. ట్రావిస్ హెడ్ రికార్డు సెంచరీ చేయగా.. భారీ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ మెరుపులు మెరిపించాడు. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపి.. హైదరాబాద్ దుమ్మురేపింది.
SRH vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ మరోసారి అద్భుతం చేసింది. ఐపీఎల్‍లో తాను సృష్టించిన అత్యధిక పరుగుల చరిత్రను.. 20 రోజుల్లో తానే తిరగరాసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం చేసి హిస్టరీ క్రియేట్ చేసింది హైదరాబాద్. పరుగుల సునామీ సృష్టించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేడు (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును మళ్లీ తన పేరిటే లిఖించుకుంది.
హెడ్ సూపర్ సెంచరీ.. క్లాసెన్ ధనాధన్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది సన్‍రైజర్స్ హైదరాబాద్. ఓపెనర్ అభిషేక్ శర్మ (34) కాసేపు దూకుడుగా ఆడి ఔటయ్యాడు. ట్రావిస్ హెడ్ 41 బంతుల్లోనే 102 పరుగులతో మెరుపు శకతం చేశాడు. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో విధ్వంసం చేశాడు హెడ్. ఎస్ఆర్‌హెచ్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ మరోసారి వీరకుమ్ముడు కుమ్మాడు. 31 బంతుల్లోనే 67 పరుగులతో క్లాసెన్ దుమ్మురేపాడు. 2 ఫోర్లు మాత్రమే కొట్టిన క్లాసెన్.. ఏకంగా 7 సిక్స్‌లు బాదాడు. ఈ ఇద్దరూ కలిసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను కనికరం లేకుండా బాదేశారు. వీరహిట్టింగ్‍తో దుమ్మురేపారు. కళ్లు చెదిరే షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిని ఎలా ఆపాలో తెలీక దిక్కుచని స్థితిలో కనిపించాడు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.
సమద్, మార్క్‌రమ్ అదిరే ఫినిషింగ్
సెంచరీ పూర్తి చేసుకున్నాక 13వ ఓవర్లో ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. అయితే, అప్పటికే సన్‍రైజర్స్ 165 పరుగులు చేసేసింది. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ తన విధ్వంసాన్ని సృష్టించాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. అనంతరం కాసేపు హిట్టింగ్ కొనసాగించాక.. 17వ ఓవర్లో ఔటయ్యాడు. అయితే, ఆ తర్వాత కూడా రాయల్ చాలెంజర్స్ బౌలర్లకు ఏ మాత్రం ఉపశమనం దక్కలేదు. ఐడెన్ మార్క్‌రమ్ (17 బంతుల్లో 32 పరుగులు నాటౌట్), అబ్దుల్ సమాద్ (10 బంతుల్లో 37 పరుగులు నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా సమద్ భారీ సిక్సర్లతో చెలరేగాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల చరిత్రను మరోసారి సృష్టించింది హైదరాబాద్.
20 రోజుల్లోనే..
మార్చి 27న ముంబై ఇండియన్స్ జట్టుతో ఉప్పల్‍లో జరిగిన మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డు సాధించింది. ఆర్సీబీ (2013లో 263 రన్స్) రికార్డును బద్దలుకొట్టింది. అయితే, ఐపీఎల్‍లో తాను సాధించిన అత్యధిక స్కోరు చరిత్రను 20 రోజులు ముగియకముందే తానే బద్దలుకొట్టింది హైదరాబాద్. నేటి మ్యాచ్‍లో బెంగళూరుపై ఏకంగా 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు తొలి, రెండో స్థానాల్లో నిలిచింది.
ట్రావిస్ హెడ్ రికార్డు
సన్‍రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డును ట్రావిస్ హెడ్ సాధించాడు. ఈ మ్యాచ్‍లో 39 బంతుల్లోనే శకతం మార్కుకు చేరాడు హెడ్.
ఐదుగురు బౌలర్లు 50కుపైగా..
సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల హిట్టింగ్‍కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు బెంబేలెత్తిపోయారు. రీస్ టోప్లీ 4 ఓవర్లలోనే ఒక వికెట్ తీసి ఏకంగా 68 పరుగులు సమర్పించేసుకున్నాడు. ఆర్సీబీ పేసర్ వైశాఖ్ విజయ్ కుమార్ 64 రన్స్, లూకీ ఫెర్గ్యూసన్ 52 పరుగులు, యశ్ దయాళ్ 51 పరుగులు ఇచ్చేసుకున్నారు. ఫెర్గ్యూసన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మహిపాల్ లోమ్రోర్ ఒక ఓవర్ వేసి 18 పరుగులు ఇవ్వగా.. విక్ జాక్స్ 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి.. పర్వాలేదనిపించాడు.