LSG vs MI: చిట్టచివరి స్థానంతో ఇంటిముఖం పట్టిన ముంబై - లక్నోను గెలిపించిన పూరన్, రాహుల్
LSG vs MI: ఐపీఎల్ 2024కు ఓటమితో ముంబై ముగింపు పలికింది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ముంబై 18 పరుగులతో తేడాతో ఓటమి పాలైంది. నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్ బ్యాట్‌తో అదరగొట్టి లక్నోకు సూపర్ విక్టరీ అందించారు.
LSG vs MI: ఐపీఎల్ చరిత్రలో ముంబై అంత్యంత పేలవప్రదర్శనను కనబరిచింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2024లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో ఇంటిముఖం పట్టింది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమిపాలైంది. ఈ సీజన్‌ను ఓటమితోనే మొదలుపెట్టి ఓటమితోనే ముంబై ముగించింది.
పోరాడిన...ఓటమి తప్పలేదు...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ టార్గెట్‌ను ఛేదించడంలో ముంబై పోరాడిన కీలక బ్యాట్స్‌మెన్స్ తక్కువ పరుగులకే ఔట్‌కావడంతో ఓటమి తప్పలేదు. ఇరవై ఓవర్లలో 196 పరుగులు వద్ద ముంబై పోరాటం ముగిసింది.
రోహిత్ హాఫ్ సెంచరీ...
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బదులు ఓపెనర్‌గా బ్రేవిస్ బరిలో దిగాడు. అతడితో కలిసి రోహిత్ శర్మ ముంబైకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. రోహిత్ ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదడంతో ముంబై స్కోరు పరుగులు పెట్టింది. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు ఎనిమిది ఓవర్లలో ఎనభై పరుగులు జోడించడంలో ముంబై ఈ మ్యాచ్‌లో ఈజీగా గెలిచేలా కనిపించింది.
బ్రేవిస్‌ను (20 బాల్స్‌లో 23 రన్స్) ఔట్ చేసి లక్నోకు తొలి బ్రేక్ ఇచ్చాడు నవీన్ ఉల్ హక్. సూర్యకుమార్ డకౌట్ కావడం, ఇషాన్ కిషన్ (14 రన్స్), కెప్టెన్ హార్దిక్ పాండ్య (16 రన్స్) తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో ముంబై సీన్ మొత్తం రివర్సైంది. వరుసగా వికెట్లు కోల్పోతున్న తన జోరును కొనసాగించిన రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 38 బాల్స్‌లో పది ఫోర్లు, మూడు సిక్సర్లతో 68 రన్స్ చేసిన రోహిత్ శర్మ ఔట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది.
ఆకాశమే హద్దుగా...
ముంబై చిత్తుగా ఓడటం ఖాయమైన తరుణంలో యంగ్ ప్లేయర్ నమన్ ధీర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దొరికిన ప్రతి బాల్‌ను బాదడమే లక్ష్యంగా కనిపించాడు. అతడి మెరుపులతో ముంబై మళ్లీ గెలుపు రేసులోకి వచ్చింది. కానీ చివరలో లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, సాధించాల్సిన రన్‌రేట్ భారీగా ఉండటంతో నమన్ ధీర్ పోరాటం వృథాగా మారింది.
ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ముంబై 196 రన్స్ మాత్రమే చేసింది. 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 28 బాల్స్‌లో ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 62 రన్స్ చేసిన నమన్ ధీర్ నాటౌట్‌గా నిలిచాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్, రవి బిష్టోయ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
పూరన్, రాహుల్ మెరుపులతో...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 214 పరుగులు చేసిందంటే అది నికోలస్ పూరన్ వల్లే. 29 బాల్స్‌లో ఎనిమిది సిక్సర్లు ఐదు ఫోర్లతో పూరన్ 75 రన్స్ చేశాడు. అతడితో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ 41 బాల్స్‌లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 55 రన్స్ తో రాణించాడు. చివరలో ఆయుష్ బదోని పది బాల్స్‌లో 22 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో లక్నో స్కోరు రెండు వందలు దాటింది.
ముంబై బౌలర్లలో చావ్లా, తుషారా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. మిగిలిన వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన అర్జున్ టెండూల్కర్ గాయంతో తన కోటా పూర్తిచేయలేకపోయాడు. 2.2 ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 22 పరుగులు ఇచ్చాడు. కండరాలు నొప్పితో మ్యాచ్ నుంచి అర్థాంతరగా వైదొలిగాడి. అర్జున్ ఓవర్‌ను నమన్ ధీర్ పూర్తిచేశాడు.
ప్లేఆఫ్స్ రేసులో ఉన్నా కానీ...
ఈ గెలుపుతో 14 పాయింట్లతో ప్లేఆఫ్ ఆశలను నిలుపుకుంది లక్నో. శనివారం చెన్నై, ఆర్‌సీబీ మధ్య జరిగే మ్యాచ్‌లో లక్నో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందా? లేదా? అన్నది తేలుతుంది. రన్‌రేట్ తక్కువగా ఉండటం లక్నోకు ప్రతికూలంగా మారింది.