Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్ - సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తున్నాడోచ్!
Suryakumar Yadav: ఐపీఎల్ 2024లో వరుస ఓటములతో డీలా పడ్డ ముంబై ఇండియన్స్‌కు శుభవార్త వచ్చేసింది. గాయంతో ఐపీఎల్‌కు దూరమైన హిట్టర్ సూర్య కుమార్ యాదవ్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ బరిలో దిగనున్నట్లు సమాచారం.

Suryakumar Yadav: ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన ముంబై మూడింటిలో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమవుతోన్న ముంబైని ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్య పేలవమైన కెప్టెన్సీపై విమర్శలు రోజురోజుకు పెరుగుతోన్నాయి.
సూర్యకుమార్ రీఎంట్రీ...
వరుస ఓటములతో డీలా పడిన ముంబై ఇండియన్స్ ఊరట లభించనుంది. గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్, హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జనవరిలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. మోకాలి గాయంతో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.
గాయం నుంచి సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా కోలుకున్నట్లు నేషనల్ క్రికెట్ అకాడెమీ ప్రకటించింది. క్రికెట్ ఆడటానికి అతడు హండ్రెడ్ పర్సెంట్ ఫిట్‌గా ఉన్నాడంటూ క్లియరెన్స్ ఇచ్చింది. గురువారం సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ టీమ్‌లో భాగం కాబోతున్నట్లు సమాచారం.
ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో...
ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న మ్యాచ్ ద్వారా సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్‌లో అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూర్యకుమార్ చేరికతో ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్‌గా మారే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
టీ20లో రికార్డులు...
టీ20 ఫార్మెట్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు మంచి రికార్డులు ఉన్నాయి. ఈ ఫార్మెట్‌లో టీమిండియా తరఫున నాలుగు సెంచరీలు చేశాడు సూర్యకుమార్ యాదవ్. 60 మ్యాచుల్లో 45. 5 యావరేజ్‌తో 2141 రన్స్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 139 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ 3249 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది.
రోహిత్ శర్మ స్థానంలో...
కాగా ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించారు. గత రెండు సీజన్స్‌లో గుజరాత్ టైటాన్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన పాండ్య...ఈ సీజన్‌లో మాత్రం ఆ స్థాయిలో కెప్టెన్‌గా నిర్ణయాలు తీసుకోవడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ విఫలమవుతున్నాడు. దాంతో ఢిల్లీ పై విజయం సాధించి ఈ ఐపీఎల్ సీజన్‌లో బోణీ కొట్టాలని ముంబై భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్‌తో పాటు హార్దిక్ పాండ్యకు కీలకం కానుంది.
కోల్‌కతా టాప్...
ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం మూడింటిలో మూడు విజయాలతో కోల్‌కతా టాప్‌లో ఉంది. మూడు విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్‌లో బోణీ చేయని ముంబై చివరి స్థానంలో ఉండగా...నాలుగు మ్యాచుల్లో ఓ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చివరి నుంచి సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది.