KL Rahul Captaincy: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీకి కేఎల్ రాహుల్ గుడ్ బై.. కారణం అదేనా?
KL Rahul Captaincy: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీకి కేఎల్ రాహుల్ గుడ్ బై చెప్పనున్నాడా? ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా పబ్లిగ్గా తన పరువు తీసేలా వ్యవహరించడంతో అతడు ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
KL Rahul Captaincy: లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా.. తమ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ను పబ్లిగ్గా అవమానించే వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో లక్నో టీమ్ కెప్టెన్సీకి రాహుల్ గుడ్ బై చెప్పనున్నాడన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ సీజన్లోనే అతడు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కెప్టెన్సీ నుంచి రాహుల్ తప్పుకుంటాడా?
లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా గ్రౌండ్లోనే అందరి ముందు చేసిన ఎక్స్‌ట్రాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలుసు కదా. టీమిండియాలో కీలక ప్లేయర్ అయిన రాహుల్ ను అలా అవమానించేలా వ్యవహరించడం ఏంటని ఫ్యాన్స్ అతనికి క్లాస్ పీకారు. ఎంత ఓనర్ అయితే మాత్రం మరీ నీ పనోడిలా అతన్ని ట్రీట్ చేస్తావా అంటూ మండిపడ్డారు.
అయితే ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత బాగానే బాధపడినట్లు తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి అతడు తప్పుకోనున్నట్లు పీటీఐ రిపోర్టు వెల్లడించడం గమనార్హం. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఫ్రాంఛైజీ తనను రీటెయిన్ చేసుకునే అవకాశాలు కనిపించడం లేదని, దీంతో ఈ సీజన్ మధ్యలోనే అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని ఆ రిపోర్టు తెలిపింది.
"డీసీతో తమ తర్వాతి మ్యాచ్ ఆడేందుకు లక్నోకు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ రాహుల్ ఒకవేళ తన బ్యాటింగ్ పైనే దృష్టిసారించడానికి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మాత్రం ఫ్రాంఛైజీకి ఎలాంటి అభ్యంతరం లేదు" అని జట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు పీటీఐ తన రిపోర్టులో తెలిపింది.
అప్పుడు ధోనీ.. ఇప్పుడు రాహుల్
గోయెంకాలకు ఇలా కెప్టెన్లను అవమానించడం ఇదే తొలిసారి కాదు. గతంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి ఏకంగా ధోనీనే తప్పించిన ఘనత సంజీవ్ సోదరుడు హర్ష్ గోయెంకాది. ఇప్పుడు రాహుల్ విషయంలోనూ గోయెంకాలు అదే చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
2022లో పంజాబ్ కింగ్స్ నుంచి తప్పుకున్న కేఎల్ రాహుల్ ను రూ.17 కోట్ల కు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించింది. తొలి రెండు సీజన్లూ ఆ టీమ్ బాగానే రాణించింది. ఈ సీజన్లోనూ ప్లేఆఫ్స్ రేసులోనే ఉంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో దారుణంగా ఓడిపోవడంతో కేఎల్ రాహుల్ ను గ్రౌండ్లోనే ఓనర్ సంజీవ్ గోయెంకా చెడామడా తిట్టినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎంత ఓనర్ అయినా ఇలా చేయడం సరికాదని మాజీ క్రికెటర్లు కూడా ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో లక్నో బ్యాటర్లు ఓవర్ కు 6 పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడిన పిచ్ పై సన్ రైజర్స్ బ్యాటర్లు 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే చేజ్ చేశారు. ఈ దారుణమైన ఓటమి తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కాడు.
నిజానికి లక్నోకు ఇప్పటికీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఆ టీమ్ మరో రెండు మ్యాచ్ లు ఢిల్లీ, ముంబైలతో ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తే లక్నో 16 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే నెట్ రన్ రేట్ (-0.760) విషయంలోనే లక్నో సవాలును ఎదుర్కొంటోంది. ఒకవేళ రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే నికొలస్ పూరన్ కు కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా రాహుల్ ఈ సీజన్లో బాగానే ఆడాడు. అతడు 12 మ్యాచ్ లలో 430 రన్స్ చేశాడు.