MS Dhoni Trolling: ధోనీపై మీమ్స్ వరద.. కానీ అసలు విషయం తెలిస్తే ఇలా చేయరు.. 9వ స్థానంలో బ్యాటింగ్ వెనుక కారణం ఇదీ-ms dhoni struggling with leg muscle tear this is the reason for his late batting at lower order reveals csk sources ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni Trolling: ధోనీపై మీమ్స్ వరద.. కానీ అసలు విషయం తెలిస్తే ఇలా చేయరు.. 9వ స్థానంలో బ్యాటింగ్ వెనుక కారణం ఇదీ

MS Dhoni Trolling: ధోనీపై మీమ్స్ వరద.. కానీ అసలు విషయం తెలిస్తే ఇలా చేయరు.. 9వ స్థానంలో బ్యాటింగ్ వెనుక కారణం ఇదీ

Hari Prasad S HT Telugu
May 07, 2024 01:21 PM IST

MS Dhoni Trolling: ధోనీ మీద మీమ్స్ వరద పారుతోంది. చెన్నైసూపర్ కింగ్స్ జట్టులో అతని ఉనికినే ప్రశ్నిస్తూ ఈ మీమ్స్ సాగుతున్నాయి. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే మాత్రం ఫ్యాన్స్ అలా చేయరు.

ధోనీపై మీమ్స్ వరద.. కానీ అసలు విషయం తెలిస్తే ఇలా చేయరు.. 9వ స్థానంలో బ్యాటింగ్ వెనుక కారణం ఇదీ
ధోనీపై మీమ్స్ వరద.. కానీ అసలు విషయం తెలిస్తే ఇలా చేయరు.. 9వ స్థానంలో బ్యాటింగ్ వెనుక కారణం ఇదీ (ANI )

MS Dhoni Trolling: ధోనీ ఈ ఐపీఎల్ 2024లో ఓ హీరో స్థాయి నుంచి ఇంటర్నెట్ లో మీమ్స్ కోసం వాడుకునే సరుకుగా మారిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతని బ్యాటింగ్ స్థానాన్ని ప్రశ్నిస్తూ ఎంతో మంది ఇప్పుడు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎన్నో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ముందు నువ్వెళ్లు అంటూ చివరికి కోచ్ డ్వేన్ బ్రావోను ధోనీ అడుగుతున్నట్లుగా కూడా మీమ్స్ క్రియేట్ చేశారు. కానీ ధోనీ ఇలా ఆలస్యంగా బ్యాటింగ్ కు రావడానికి బలమైన కారణం లేకపోలేదు.

ధోనీ కాలి కండరంలో చీలిక

ధోనీ ఈ సీజన్ మొదటి నుంచి తన కాలి కండరంలో చీలికతో బాధపడుతున్నాడు. డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెబుతున్నా కూడా అతడు వినడం లేదు. ఫ్రాంఛైజీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండటానికి అతడు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అయితే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అతడు ఏకంగా 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడంతో ఈ విషయం పట్టించుకోకుండా ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేస్తున్నారు.

ధోనీ చివర్లో రావడం వెనుక సీఎస్కే వ్యూహం ఏదో ఉందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. కానీ అసలు విషయం మాత్రం కండరాల్లో చీలికే అని తాజాగా తేలింది. సీజన్లో మొదట్లోనే ధోనీ తన కుడికాలి మడమ భాగంలో కట్టుతో కనిపించాడు. అది చూసే అతనికి ఏమైందన్న ప్రశ్న తలెత్తింది. ఆ తర్వాత చివర్లో బ్యాటింగ్ కు దిగిన ప్రతిసారీ వికెట్ల మధ్య ఎక్కువగా పరుగెత్తకుండా బౌండరీలు బాదడానికే అతడు ప్రయత్నించాడు.

దీనికి కారణం ఆ చీలికే అని స్పష్టమవుతోంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నా.. ఇప్పటికే గాయాలతో సతమతమవుతూ ఇబ్బంది పడుతున్న జట్టును మరిన్ని సమస్యల్లోకి నెట్టకుండా ఉండేందుకు ధోనీ అలాగే కొనసాగుతున్నాడు. ఈ విషయం తెలిసో తెలియకో హర్భజన్ సింగ్ లాంటి మాజీ క్రికెటర్లు కూడా అతన్ని పక్కన పెట్టి ఓ పేస్ బౌలర్ ను తీసుకోవాలని సలహా ఇవ్వడం గమనార్హం.

బ్యాకప్ కీపర్ లేక..

సీఎస్కే ఈసారి కూడా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. అయితే సీజన్ మధ్యలో గాయాల బెడద ఎక్కువైంది. తాజాగా పేస్ బౌలర్ దీపక్ చహర్ కూడా మిగిలిన టోర్నీకి దూరమయ్యాడు. ధోనీకి బ్యాకప్ కీపర్ గా ఉన్న స్టార్ న్యూజిలాండ్ బ్యాటర్ డెవోన్ కాన్వే అయితే గాయం కారణంగా అసలు ఈసారి రానే లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధోనీ కొనసాగుతూనే ఉన్నాడు.

అతన్ని విమర్శించే వారికి ధోనీ జట్టు కోసం చేస్తున్న త్యాగమేంటో తెలియదని సీఎస్కే వర్గాలు అంటున్నాయి. గాయాల వల్ల రిజర్వ్ ప్లేయర్స్ తోనూ ఆడే స్థితికి చెన్నై సూపర్ కింగ్స్ చేరిన వేళ ధోనీ పెద్ద దిక్కుగా గాయంతోనే జట్టులో కొనసాగుతున్నాడని వాళ్లు చెబుతున్నారు.

పైగా కొత్తగా ఈసారే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ కు కూడా ధోనీ వెన్నంటి నిలుస్తున్నాడు. ఈ ఏడాది సీఎస్కే సాధించే ఫలితంతో సంబంధం లేకుడా రుతురాజే కెప్టెన్ గా కొనసాగుతాడని సీఎస్కే టీమ్ స్పష్టం చేస్తోంది. ఎప్పటిలాగే తనపై వచ్చే పొగడ్తలు, విమర్శలకు స్పందించని ధోనీ.. ఇప్పుడూ అదే పని చేస్తూ ముందుకు సాగుతున్నాడు.