Ruturaj Gaikwad: నా రికార్డ్ చూసి మావాళ్లు అందుకు ముందే సిద్ధమయ్యారు: రుతురాజ్ గైక్వాడ్
Ruturaj Gaikwad - CSK vs PBKS: ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి టాస్ ఓడిపోయాడు. ఈ విషయంపై అతడు సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
Ruturaj Gaikwad: ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‍కు టాస్ అసలు కలిసి రావడం లేదు. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే అతడు టాస్ గెలిచాడు. మిలిగిన సందర్భాల్లో టాస్ విషయంలో నిరాశ ఎదురైంది. చెపాక్ స్టేడియం వేదికగా నేడు (మే 1) పంజాబ్ కింగ్స్ జట్టుతో మ్యాచ్‍లోనూ చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ ఓడిపోయాడు. దీంతో పది మ్యాచ్‍ల్లో తొమ్మిదోసారి అతడు టాస్ కోల్పోయాడు. మరోసారి టాస్ ఓడాక గైక్వాడ్ సరదాగా కామెంట్లు చేశాడు.
వాళ్లు అప్పుడే రెడీ అయ్యారు
తన టాక్ రికార్డు చూసి బ్యాటింగ్ చేసేందుకు టాస్‍కు ముందే తమ జట్టులోని కొందరు ఆటగాళ్లు సిద్ధమయ్యారని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. నవ్వుతూ ఈ కామెంట్లు చేశాడు. “నా టాస్ రికార్డు చూసి మా టీమ్‍లోని చాలా మంది ప్లేయర్లు ఫస్ట్ బ్యాటింగ్‍కే సిద్ధమయ్యారు. నేను టాస్ ఓడిపోతానని వారికి ముందే తెలిసిపోయింది” అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు.
ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో ముందుగా చెన్నై బ్యాటింగ్‍కు దిగనుంది. ఒకవేళ టాస్ గెలిస్తే తాను ముందుగా బౌలింగ్ తీసుకునే వాడినని.. కానీ ఓడిపోయాడనని రుతురాజ్ చెప్పాడు.
ఈ సీజన్‍లో 10 మ్యాచ్‍ల్లో కేవలం కోల్‍కతా నైట్‍రైడర్స్‌తో మ్యాచ్‍లో ఒక్కటే రుతురాజ్ టాస్ గెలిచాడు. మిగిలిన తొమ్మిది సార్లు టాస్ ఓడాడు.
ఇక, పంజాబ్‍తో నేటి ఈ మ్యాచ్‍కు చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ యార్కర్ స్టార్ పేసర్ మతీష పతిరణ దూరమయ్యాడు. కాస్త ఇబ్బంది ఉండటంతో అతడు ఆడడం లేదని గైక్వాడ్ చెప్పాడు. అలాగే, తుషార్ దేశ్‍పాండే కూడా ఈ మ్యాచ్ ఆడడం లేదు. అతడి ఆరోగ్యం సరిగా లేదని గైక్వాడ్ తెలిపాడు. వారి స్థానంలో శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లెసన్‍ను తుది జట్టులోకి చెన్నై తీసుకుంది. ఇంగ్లండ్ పేసర్ గ్లెసన్ ఆ మ్యాచ్‍తోనే ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు: అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లెసన్, ముస్తాఫిజుర్ రహమాన్
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: జానీ బెయిర్ స్టో, సామ్ కరన్ (కెప్టెన్), రాలీ రూసో, శశాంక్ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అషుతోశ్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో 5 గెలిచి, 4 ఓడింది చెన్నై. పంజాబ్‍తో నేటి మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో మూడు మాత్రమే గెలిచిన పంజాబ్‍కు ఈ మ్యాచ్ చావోరేవో అన్నట్టుగా ఉంది. చెన్నై చేతిలో పరాజయం పాలైతే.. ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు దూరమైనట్టే.