Yashasvi Jaiswal: కోచ్ గంభీర్ 16 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్ - 34 సిక్సులతో రేర్ ఫీట్!
Yashasvi Jaiswal: పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ పలు రికార్డులు బ్రేక్ చేశారు. కోచ్ గంభీర్ పదహారేళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును యశస్వి జైస్వాల్ తిరగరాయగా... సెహ్వాగ్ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు.
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ సమయోచిత బ్యాటింగ్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌటై విమర్శలను మూటగట్టుకున్న భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అదరగొట్టింది.సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 172 పరుగులతో రెండో రోజును ముగించింది.
ప్రస్తుతం జైస్వాల్ 90 పరుగులతో, కేఎల్ రాహుల్ 62 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 46 పరుగులను కలుపుకొని 218 రన్స్ ఆధిక్యంలో భారత్ ఉంది.
గంభీర్ రికార్డ్ బ్రేక్...
పెర్త్ టెస్ట్ ద్వారా కోచ్ గౌతమ్ గంభీర్ రేర్ రికార్డ్‌ను యశస్వి జైస్వాల్ బ్రేక్ చేశాడు. ఒకే ఏడాదిలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పాడు. 2008లో గంభీర్ టెస్టుల్లో 1134 పరుగులు చేశాడు. ఆ ఏడాది మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో విధ్వంసం సృష్టించాడు. 1209 రన్స్‌తో గంభీర్ పదహారేళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును యశస్వి జైస్వాల్ బ్రేక్ చేశాడు.
అత్యధిక సిక్సులు...
ఒకే ఏడాదిలో టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్‌గా పెర్త్ టెస్ట్‌తో యశస్వి జైస్వాల్ రికార్డ్ నెలకొల్పాడు. ఈ ఏడాది 12 టెస్టుల్లో జైస్వాల్ 34 సిక్సులు కొట్టాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ (33 సిక్సులు) రికార్డును అధిగమించాడు.
మరో ఇరవై పరుగులు దూరంలో...
పెర్త్ పిచ్‌పై అత్యధిక భాగస్వామ్యాన్ని జోడించిన భారత ఓపెనర్లుగా జైస్వాల్, కేఎల్ రాహుల్ నిలిచారు. 1992లో సిద్ధు, శ్రీకాంత్ జోడి 82 పరుగులు జోడించారు. వారి రికార్డును జైస్వాల్, రాహుల్ తిరగరాశారు. మరో అరుదైన రికార్డుకు రాహుల్, జైస్వాల్ జోడీ ఇరవై పరుగుల దూరంలో ఉంది.
టెస్టుల్లో ఆస్ట్రేలియాపై హయ్యెస్ట్ పార్ట్‌నర్‌షిప్ జోడించిన ఓపెనర్లుగా గవాస్కర్, శ్రీకాంత్ (191 రన్స్) పేరిట రికార్డ్ ఉంది. వారి తర్వాత 172 రన్స్‌తో రాహుల్, జైస్వాల్ జోడీ సెకండ్ ప్లేస్‌లో ఉంది. మరో ఇరవై రన్స్ చేస్తే గవాస్కర్, శ్రీకాంత్ రికార్డ్‌ను జైస్వాల్, రాహుల్ అధిగమిస్తారు.
సెహ్వాగ్ రికార్డ్ సమం...
సెనా దేశాలపై వందకుపైగా పరుగల భాగస్వామ్యాన్ని మూడు సార్లు సాధించిన భారత ఓపెనర్‌గా సెహ్వాగ్ రికార్డ్‌ను పెర్త్ టెస్ట్‌తో సమం చేశాడు కేఎల్ రాహుల్.