Hardik Pandya: ముస్తాక్ అలీ టోర్నీలో హార్దిక్ పాండ్య వీర విహారం - 35 బాల్స్‌లో 74 ర‌న్స్‌-hardik pandya hits fastest half century in syed mushtaq trophy 2024 against gujarat ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Hardik Pandya: ముస్తాక్ అలీ టోర్నీలో హార్దిక్ పాండ్య వీర విహారం - 35 బాల్స్‌లో 74 ర‌న్స్‌

Hardik Pandya: ముస్తాక్ అలీ టోర్నీలో హార్దిక్ పాండ్య వీర విహారం - 35 బాల్స్‌లో 74 ర‌న్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 23, 2024 09:23 PM IST

Hardik Pandya: ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ హార్దిక్ పాండ్య ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ దేశ‌వాళీ టోర్నీలో బ‌రోడా టీమ్ త‌ర‌ఫున బ‌రిలో దిగిన పాండ్య శ‌నివారం గుజ‌రాత్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 35 బాల్స్‌లో 74 ర‌న్స్ చేశాడు.

హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య

Hardik Pandya: ఇటీవ‌లే ఐసీసీ ప్ర‌క‌టించిన‌ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండ‌ర్ల‌ జాబితాలో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు టీమిండియా క్రికెట‌ర్‌ హార్దిక్ పాండ్య‌. ఈ ర్యాంకింగ్స్ ప్ర‌క‌టించి రెండు రోజులు కూడా కాక‌ముందే ముస్తాక్ అలీ టోర్నీలో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

బ‌రోడా టీమ్‌...

ముస్తాక్ అలీ టోర్నీలో బ‌రోడా టీమ్ త‌ర‌ఫున బ‌రిలో దిగాడు హార్దిక్ పాండ్య‌. చాలా రోజుల త‌ర్వాత దేశ‌వాళీ క్రికెట్ ఆడుతోన్న పాండ్య తొలి మ్యాచ్‌లోనే బ్యాట్‌తో వీర‌విహారం చేశాడు. ముస్తాక్ అలీ టోర్నీ గ్రూప్ బీలో భాగంగా శ‌నివారం బ‌రోడా, గుజ‌రాత్ మ‌ధ్య టీ20 మ్యాచ్ జ‌రిగింది.

ఈ మ్యాచ్‌లో పాండ్య జోరుతో బ‌రోడా ఐదు వికెట్ల తేడాతో గుజ‌రాత్‌ను చిత్తు చేసింది. ఈ టీ20 పోరులో పాండ్య ఇర‌వై ఎనిమిది బాల్స్‌లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు. సిక్స‌ర్లు, ఫోర్ల‌తో గుజ‌రాత్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు.

35 బాల్స్‌లో 74 ర‌న్స్‌...

185 ప‌రుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేప‌ట్టిన బ‌రోడా...మ‌రో మూడు బాల్స్ మిగిలుండ‌గానే మ్యాచ్‌లో విజ‌యాన్ని అందుకున్న‌ది. ఈ టీ20 మ్యాచ్‌లో పాండ్య 35 బాల్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్స‌ర్ల‌తో 74 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. తేజ‌స్ ప‌టేల్ వేసిన 19వ ఓవ‌ర్‌లో పాండ్య మూడు సిక్స‌ర్ల‌తో 21 ర‌న్స్ చేశాడు.

బ‌రోడా టీమ్‌లో పాండ్య‌తో పాటు శివాలిక్ శ‌ర్మ 43 బాల్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 64 ర‌న్స్ తో రాణించాడు. పాండ్య, శివాలిక్ జోరుతో బ‌రోడా 19.3 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 188 ర‌న్స్‌తో విజ‌యాన్ని అందుకున్న‌ది. హార్దిక్ పాండ్య సోద‌రుడు కృనాల్ పాండ్య మాత్రం మూడు ప‌రుగుల‌తో నిరాశ‌ప‌రిచాడు.

అక్ష‌ర్ ప‌టేల్‌, ఆర్య‌ దేశాయ్‌...

అంత‌కుముందు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 184 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఆర్య దేశాయ్ 52 బాల్స్‌లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 78 ర‌న్స్‌తో ఆక‌ట్టుకున్నాడు.

కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ 33 బాల్స్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 43 ప‌రుగుల‌తో మెరిశాడు. చివ‌ర‌లో హేమంగ్ ప‌టేల్ ప‌ది బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, ఓ ఫోర్‌తో 26 ర‌న్స్ చేయ‌డంతో గుజ‌రాత్ భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌లోనూ నాలుగు ఓవ‌ర్లు వేసి 37 ప‌రుగులు ఇచ్చిన హార్దిక్ పాండ్య ఓ వికెట్ తీసుకున్నాడు.

Whats_app_banner