Puppies Naming Ceremony : జగిత్యాల జిల్లాలో కుక్క పిల్లలకు బారసాల- బంధువులకు దావత్
Puppies Naming Ceremony : పెంపుడు కుక్కకు పుట్టిన పిల్లలకు బారసాల చేసి, తమ బంధువులకు మంచిగా దావత్ ఇచ్చిందో కుటుంబం. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో జరిగింది. ఆ శునకాన్ని పెంచుకున్నప్పటి నుంచి తమ అంతా మంచే జరిగిందని, అందుకే ఇలా చేశామని యజమానులు చెబుతున్నారు.
విశ్వాసం గల శునకంపై అభిమానం చాటుకున్నారు దంపతులు. పెంపుడు కుక్కకు జన్మించిన నాలుగు పిల్లలకు బారసాల నిర్వహించారు. లక్ష్మీ నరసింహ నామకరణం చేసి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టారు. అందరినీ ఆశ్చర్యానికి అంతకుమించిన ఆసక్తిని కలిగించిన కుక్క పిల్లలకు బారసాల వేడుకలు జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో జరిగింది.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి లోని సుభాష్ నగర్ కు చెందిన రాపెల్లి వినోద్ - లావణ్య దంపతులు షీజూ జాతికి చెందిన కుక్క పిల్లను ఏడాది కాలంగా పెంచుకుంటున్నారు. డైసీ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలతో పాటుగా డైసీని కూడా కుటుంబ సభ్యులుగా పోషిస్తున్నారు. ఈ మధ్యనే డైసీ నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. 21 రోజులు కావడంతో మనుషుల మాదిరిగానే కుక్క పిల్లలకు బారసాల నామకరణోత్సవం నిర్వహించారు.
బంధుమిత్రులకు విందు భోజనం
పండుగ వాతావరణం లో బంధుమిత్రులను ఆహ్వానించి కుక్కు పిల్లలకు కొత్త దుస్తులు వేసి లక్ష్మీ, నరసింహ అని నామకరణం చేశారు. మూడు ఆడ కుక్క పిల్లలకు లక్ష్మమ్మ, ఒక మగ కుక్క పిల్లకు నరసింహ అని పేరు పెట్టి అందంగా అలంకరించిన తొట్టెలో వేసి జోలపాట పాడారు. బంధుమిత్రులకు విందు భోజనం పెట్టారు. పెంపుడు కుక్క పిల్లలకు బారసాల చేసి ఆత్మాభిమానం చాటుకున్న దంపతులను అందరూ అభినందించారు.
కుక్కతో అంతా మంచి జరిగింది
కుటుంబంలో ఒకరిలా కుక్కకు అభిమానంతో బారసాల నిర్వహించామని వినోద్ లావణ్య దంపతులు తెలిపారు. కుక్కను తెచ్చుకున్నప్పటి నుంచి అంతా మంచి జరగడంతో ఆ కుక్క పిల్లలకు బారసాల చేశారని చెప్పారు. ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి కావడంతో కుక్కపిల్లలకు లక్ష్మీ నరసింహ అని పేరు పెట్టామని సంబరంగా చెప్పారు.కడుపున పుట్టిన వారిని కన్నవారిని, కట్టుకున్న వారిని, చీదరించుకునే ఈరోజుల్లో కుక్క పిల్లలకు బారసాల చేసి అభిమానం చాటుకోవడం పట్ల పలువురు వారిని అభినందించారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం