MS Dhoni record: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు ధోనీ.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న సీఎస్కే మాజీ కెప్టెన్
MS Dhoni record: ఐపీఎల్లో మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ ఎవరికీ సాధ్యం కాని మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆదివారం (ఏప్రిల్ 28) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో విజయం తర్వాత ధోనీ ఈ ఘనత అందుకున్నాడు.
MS Dhoni record: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ 42 ఏళ్ల వయసులోనూ ఐపీఎల్లో ఆడుతూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. ఆదివారం (ఏప్రిల్ 28) సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలిచిన తర్వాత ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఇప్పటి వరకూ ఈ మెగా లీగ్ చరిత్రలో 150 విజయాల్లో పాలుపంచుకున్న తొలి ప్లేయర్ గా ధోనీ నిలిచాడు.
ఎమ్మెస్ ధోనీ రికార్డు
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 212 రన్స్ చేసింది. తర్వాత సన్ రైజర్స్ కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో చెన్నై పాయింట్ల టేబుల్లో మూడో స్థానానికి దూసుకెళ్లగా.. ధోనీ గతంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు అందుకున్నాడు.
ధోనీ ఐపీఎల్లో ఇప్పటి వరకూ 259 మ్యాచ్ లు ఆడగా.. అందులో 150 మ్యాచ్ లలో విజయాలు సాధించడం విశేషం. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ తో మొదలైన ధోనీ ప్రయాణం.. మధ్యలో రెండేళ్లు మాత్రం రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ వైపు వెళ్లింది. తర్వాత మళ్లీ సీఎస్కేకు తిరిగి వచ్చిన అతడు.. మొత్తంగా ఐదు టైటిల్స్ సాధించి పెట్టాడు. ఈ సీజన్లోనే తన కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు.
విజయాల్లో టాప్ 5 వీళ్లే
ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్స్ జాబితాలో ఎమ్మెస్ ధోనీ టాప్ లో నిలవగా.. తర్వాతి స్థానాల్లో రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్, సురేశ్ రైనా ఉన్నారు. టాప్ 5లో ముగ్గురు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్సే కావడం విశేషం. ధోనీ 150 విజయాలు సాధించగా.. జడేజా 133 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. అటు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ కూడా 133 విజయాలే సాధించాడు.
ప్రస్తుతం ఆర్సీబీలో ఉన్న దినేష్ కార్తీక్ 125 విజయాలతో నాలుగో స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎక్కువ కాలం ఆడి మిస్టర్ ఐపీఎల్ గా పేరుగాంచిన సురేశ్ రైనా 122 విజయాల్లో పాలుపంచుకున్నాడు. ఒక్క రైనా తప్ప మిగిలిన నలుగురు ప్లేయర్స్ ఈ ఐపీఎల్లోనూ ఆడుతున్నారు. వీళ్లలో ధోనీ, కార్తీక్ బహుశా తమ చివరి ఐపీఎల్లో ఆడుతున్నారని చెప్పొచ్చు.
తిరుగులేని ధోనీ
అంతర్జాతీయ క్రికెట్ లోనే కాదు ఐపీఎల్లోనూ ఓ ప్లేయర్ గా, కెప్టెన్ గా ధోనీ తిరుగులేని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ కూడా అతడే. కెప్టెన్ గా ధోనీ 133 విజయాలు సాధించాడు. రోహిత్ శర్మ 87 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ ఏడాది 42 ఏళ్ల వయసులోనూ చివర్లో బ్యాటింగ్ మెరుపులతోపాటు వికెట్ల వెనుక గ్లోవ్స్ తోనూ అతడు మ్యాజిక్ చేస్తున్నాడు.
ఈ ఏడాది చివరి ఓవర్లలో బ్యాటింగ్ కు వస్తున్న ధోనీ ఇప్పటి వరకూ ఔట్ కానేలేదు. అతడు కేవలం 37 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. 257 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేస్తుండటం విశేషం.