CSK vs SRH: చెపాక్‍లో చేతులెత్తేసిన సన్‍రైజర్స్.. చెన్నై ఘన విజయం.. మళ్లీ గెలుపు బాట-sunrisers hyderabad struggles again in chasing and chennai super kings in winning route again csk vs srh ipl 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Csk Vs Srh: చెపాక్‍లో చేతులెత్తేసిన సన్‍రైజర్స్.. చెన్నై ఘన విజయం.. మళ్లీ గెలుపు బాట

CSK vs SRH: చెపాక్‍లో చేతులెత్తేసిన సన్‍రైజర్స్.. చెన్నై ఘన విజయం.. మళ్లీ గెలుపు బాట

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 28, 2024 11:35 PM IST

Chennai Super Kings vs Sunrisers Hyderabad: సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) మరోసారి ఛేజింగ్‍లో తడబడింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో భారీ తేడాతో పరాజయం పాలైంది. దీంతో చెన్నై మళ్లీ గెలుపు బాట పట్టింది.

CSK vs SRH: చెపాక్‍లో చేతులెత్తేసిన సన్‍రైజర్స్.. చెన్నై మళ్లీ గెలుపు బాట
CSK vs SRH: చెపాక్‍లో చేతులెత్తేసిన సన్‍రైజర్స్.. చెన్నై మళ్లీ గెలుపు బాట (PTI)

CSK vs SRH: ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ మరోసారి లక్ష్యఛేదనలో తడబడింది. ఈ సీజన్‍లో తొలుత బ్యాటింగ్ చేస్తూ ఐపీఎల్ అత్యధిక పరుగులు సహా చాలా రికార్డులు బ్రేక్ చేసిన హైదరాబాద్.. ఛేజింగ్‍లో మాత్రం నిరాశపరుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు (ఏప్రిల్ 28) జరిగిన ఐపీఎల్ మ్యాచ్‍లో ఛేజింగ్‍లో చేతులు ఎత్తేసింది ఎస్‍ఆర్‌హెచ్. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‍లో 78 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. హోం టీమ్ సీఎస్కే గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండు వరుస పరాజయాల తర్వాత చెన్నై మళ్లీ గెలుపుబాటట్టింది. ఈ సీజన్‍లో ఐదో విజయాన్ని సాధించింది.

రెచ్చిపోయిన రుతురాజ్, మిచెల్

ఈ మ్యాచ్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 212 రన్స్ చేసింది సీఎస్‍కే. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98 పరుగులు; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుతంగా ఆడాడు. అయితే, సెంచరీకి రెండు పరుగుల దూరంలో చివరి ఓవర్లో ఔటయ్యాడు. డారిల్ మిచెల్ (32 బంతుల్లో 52 పరుగులు; 7 ఫోర్లు, ఓ సిక్స్) అర్ధ శకతంతో మెప్పించాడు. రుతురాజ్, మిచెల్ 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శివం దూబే (20 బంతుల్లో 39 పరుగులు నాటౌట్; ఒక ఫోర్, 4 సిక్స్‌లు) చివర్లో మెరిపించాడు. ఎంఎస్ ధోనీ (2 బంతుల్లో 5 పరుగులు నాటౌట్; ఫోర్) మరోసారి చివరి ఓవర్లో బ్యాటింగ్‍కు వచ్చాడు.

సన్‍రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ తలా ఓ వికెట్ తీశారు. అయితే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (0/49) సహా ఎవరూ పరుగులను కట్టడి చేయలేకపోయారు.

సన్‍రైజర్స్ విఫలం.. దెబ్బకొట్టిన దేశ్‍పాండే

టార్గెట్ ఛేజింగ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోతూ ఓ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆద్యంతం నిరాశపరిచింది. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఎస్ఆర్‌హెచ్ ఆలౌటైంది. హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (13) రెండో ఓవర్లోనే చెన్నై పేసర్ తుషార్ దేశ్‍పాండే బౌలింగ్‍లో ఔట్ కాగా.. తర్వాతి బంతికే అన్‍మోల్ ప్రీత్ సింగ్ (0) డకౌట్ అయ్యాడు. నాలుగో ఓవర్లో అభిషేక్ శర్మ (15)ను కూడా ఔట్ చేసి.. హైదరాబాద్‍ను మరోసారి దెబ్బ కొట్టాడు దేశ్‍పాండే.

నితీశ్ కుమార్ రెడ్డి (15), ఐడెన్ మార్క్‌రమ్ (32) వేగంగా ఆడలేకపోయారు. అనంతరం హెన్రిచ్ క్లాసెన్ (20) కూడా తడబడి.. పతిరాన బౌలింగ్‍లో 16వ ఓవర్లో ఔటయ్యాడు. దీంతో అక్కడే హైదరాబాద్ ఓటమి ఖరారైంది. అబ్దుల్ సమాద్ (19), ప్యాట్ కమిన్స్ (5) సహా తర్వాతి బ్యాటర్లు కూడా విఫలమయ్యారు.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషార్ దేశ్‍పాండే నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. మతీశ పతిరాన, ముస్తాఫిజుర్ తలా రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌కు ఒక్కో వికెట్ దక్కింది. చెపాక్‍లో హైదరాబాద్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలువలేదు. అది ఇంకా కొనసాగింది.

ఛేజింగ్‍లో మళ్లీ తడబాటు

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు ఐదు మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచింది హైదరాబాద్. అదే లక్ష్యఛేదనలో నాలుగు మ్యాచ్‍ల్లో ఒక్కటి మాత్రమే విజయం సాధించింది. ఛేజింగ్‍లో తడబడుతోంది. అయితే, ఈ సీజన్‍లో ఉప్పల్ వేదికగా చెన్నైతో ఛేజింగ్‍లోనే గెలిచింది ఎస్ఆర్‌హెచ్. అయితే, నేటి మ్యాచ్‍లో మాత్రం లక్ష్యఛేదనలో విఫలమైంది. హైదరాబాద్‍పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది చెన్నై.

మూడో ప్లేస్‍కు చెన్నై

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో 5 గెలిచి 10 పాయింట్లను దక్కించుకుంది చెన్నై. ఈ గెలుపు తర్వాత ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. 9 మ్యాచ్‍ల్లో 5 గెలిచి, 4 ఓడిన సన్‍రైజర్స్ (10 పాయింట్లు) నాలుగో స్థానానికి పడింది. నెట్‍ రన్‍రేట్ మెరుగ్గా ఉండటంతో మూడో ప్లేస్‍కు వెళ్లింది చెన్నై.

IPL_Entry_Point