MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు-ipl 2024 mi vs lsg nicholas pooran smashes mumbai indians bolwers lucknow super giants post huge total ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mi Vs Lsg: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Hari Prasad S HT Telugu
May 17, 2024 09:41 PM IST

MI vs LSG: ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పూరన్ చెలరేగిపోయాడు. రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది.

దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు
దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు (LSG X)

MI vs LSG: లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికొలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 29 బంతుల్లోనే 75 రన్స్ చేశాడు. అతనికి తోడు కెప్టెన్ కేఎల్ రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు ఏకంగా 214 రన్స్ చేసింది. ముంబై బౌలర్లలో తుషార మాత్రమే 3 వికెట్లతో రాణించాడు.

పూరన్ విధ్వంసం

ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో లక్నో బ్యాటర్ నికొలస్ పూరన్ చెలరేగిపోయాడు. విధ్వంసం స‌ృష్టించాడు. కేవలం 29 బంతుల్లోనే 8 సిక్స్ లు, 5 ఫోర్లతో 75 రన్స్ చేశాడు. అతడు క్రీజులోకి వచ్చే సమయానికి లక్నో టీమ్ 9.3 ఓవర్లలో 3 వికెట్లకు 69 రన్స్ చేసి ఎదురీదుతోంది. అయితే పూరన్ రాగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

అతడు క్రీజులోకి వచ్చీ రాగానే బౌండరీల వర్షం కురిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాడు. దీంతో సడెన్ లక్నో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ మ్యాచ్ లో తమ స్టార్ బౌలర్ బుమ్రా లేకుండానే ముంబై బరిలోకి దిగింది. అది కూడా లక్నోకు కలిసి వచ్చింది. ప్రతి బౌలర్ ను పూరన్ చితకబాదాడు. అతని ధాటికి ముంబై బౌలర్ అన్షుల్ కంబోజ్ 3 ఓవర్లలోనే 48 రన్స్ సమర్పించుకున్నాడు.

ఈ సీజన్లో తొలిసారి ఓ మ్యాచ్ ఆడిన అర్జున్ టెండూల్కర్ 2.2 ఓవర్లలో 22 రన్స్ ఇచ్చి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. పూరన్ తోపాటు రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. అయితే అతడు నింపాదిగా ఆడుతూ ఓవైపు వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డాడు. రాహుల్ 41 బంతుల్లో 55 రన్స్ చేశాడు. కానీ పూరన్ ఔటవగానే అర్షద్ ఖాన్ తొలి బంతికే డకౌట్ కావడం, తర్వాతి ఓవర్ తొలి బంతికే రాహుల్ కూడా పెవిలియన్ చేరడంతో లక్నో మళ్లీ కష్టాల్లో పడినట్లు కనిపించింది.

అయితే చివర్లో ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా చెలరేగారు. లక్నో స్కోరు 200 దాటుతుందా అని అనిపించినా.. ఈ ఇద్దరూ ఏకంగా స్కోరును 214 పరుగుల వరకు తీసుకెళ్లారు. చివరి ఓవర్లో బదోని వరుసగా రెండు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టాడు. చివరికి అతడు 10 బంతుల్లో 2 సిక్స్ లు, ఒక ఫోర్ తో 22 రన్స్ చేయగా.. కృనాల్ 7 బంతుల్లో 12 రన్స్ చేశాడు.

ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, తుషార చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. తుషార 4 ఓవర్లలో కేవలం 28 రన్స్ ఇవ్వగా.. పియూష్ కూడా 4 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చాడు. మిగతా బౌలర్లంతా భారీగా పరుగులు ఇచ్చారు. షెపర్డ్ అయితే 2 ఓవర్లలోనే 30 పరుగులు సమర్పించుకోవడం విశేషం. ఇప్పటికే ఈ రెండు టీమ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి వెళ్లిపోవడంతో ఈ మ్యాచ్ కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది.

Whats_app_banner