Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్-mumbai indians will get rid of rohit sharma and hardik pandya feels virender sehwag ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sehwag On Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Published May 17, 2024 01:58 PM IST

Sehwag on Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరినీ వదిలించుకుంటుందని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఒక సినిమాలో షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్లు ఉన్నంత మాత్రాన అది హిట్ కాదని అనడం విశేషం.

రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్ (PTI)

Sehwag on Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో చేసిన ప్రదర్శన చూసిన తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరి స్థానాలు గల్లంతవుతాయని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలానికి ముందు ముంబై టీమ్ ఈ ఇద్దరు స్టార్లను ముంబై వదిలించుకుంటుందని చెప్పాడు.

ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. టీమంతా స్టార్లే ఉన్నా ఈ ఏడాది ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా ముంబై నిలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆ స్టార్లంతా ఫెయిలయ్యారు. ఈ సీజన్లో ఆ టీమ్ ప్రదర్శన చూస్తుంటే.. వచ్చే ఏడాదికి రోహిత్, హార్దిక్ లేకుండానే ఆ ఫ్రాంఛైజీ బరిలోకి దిగుతుందని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నాడు.

ఈ సందర్భంగా బాలీవుడ్ ఖాన్ త్రయం ఉదాహరణ చెప్పడం విశేషం. ఆ ముగ్గురు ఖాన్‌లు కలిసి సినిమా చేసినంత మాత్రాన హిట్ అవుతుందన్న గ్యారెంటీ ఉందా అని వీరూ ప్రశ్నించాడు. క్రిక్‌బజ్ తో మాట్లాడిన సెహ్వాగ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"నాకు ఒక్క విషయం చెప్పండి. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఒక సినిమాలో కలిసి నటించినంత మాత్రాన హిట్ కు గ్యారెంటీ ఉందా? దానికోసం సరిగా పర్ఫామ్ చేయాలి కదా? మంచి స్క్రిప్ట్ ఉండాలి. అలాగే ఈ అందరు పెద్ద ప్లేయర్స్ కూడా గ్రౌండ్లో పర్ఫామ్ చేయాలి. రోహిత్ శర్మ ఒక సెంచరీ చేశాడు. ముంబై ఓడిపోయింది. ఆ తర్వాత ఏమైంది మరి" అని సెహ్వాగ్ ప్రశ్నించాడు.

"ఇషాన్ కిషన్ సీజన్ మొత్తం ఆడాడు. పవర్ ప్లేను కూడా ఎప్పుడూ దాటలేకపోయాడు. ఈ సమయంలో ముంబై ఇండియన్స్ తరఫున కేవలం రెండు పేర్లే ఖాయం. ఒకరు బుమ్రా, మరొకరు సూర్యకుమార్ యాదవ్. ఈ ఇద్దరినీ రిటెయిన్ చేసుకుంటారు. ఇక అది మూడు, నాలుగు వరకు వస్తే.. ఏం చేస్తారో చూడాలి" అని సెహ్వాగ్ అన్నాడు.

ఆ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయాలి

ఇక ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ బుమ్రా, సూర్యకుమార్ లలో ఒకరిని కెప్టెన్ చేయాలని మరో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. సెహ్వాగ్ కూడా అదే చెబుతున్నాడు. ఈ ఇద్దరినీ రిటెయిన్ చేసుకోవడంతో పాటు వాళ్లలో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వాలని స్పష్టం చేశాడు. బుమ్రా గతంలో ఇంగ్లండ్ తో ఒక టెస్టుకు కెప్టెన్ గా ఉండగా.. సూర్యకుమార్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్ లకు కెప్టెన్ గా చేశాడు.

"నేను కూడా బుమ్రా, సూర్యకుమార్ లను ముంబై ఇండియన్స్ రిటెయిన్ చేసుకుంటుందని భావిస్తున్నాను. వాళ్లు తప్ప ఇంకా ఎవరినీ చేసుకోదు. విదేశీ ప్లేయర్స్ కూడా లేరు. టిమ్ డేవిడ్ అసలు అంచనాలను అందుకోలేదు. సూర్యకుమార్ యాదవ్, బుమ్రాలను రిటెయిన్ చేసుకొని వాళ్లలో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వాలన్నది నేను ఇచ్చే సలహా. రోహిత్ కూడా అవసరం లేదు. అతన్ని చూస్తుంటే రోహిత్ కూడా ఇదే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది" అని మనోజ్ తివారీ అన్నాడు.

Whats_app_banner