Bollywood Khans movie: మేం ముగ్గురం కలిసి సినిమా చేయబోతున్నాం: ఖాన్ త్రయం మూవీపై ఆమిర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Bollywood Khans movie: బాలీవుడ్ ను మూడు దశాబ్దాల నుంచి ఏలుతున్న ముగ్గురు ఖాన్‌లు ఒకే సినిమాలో కలిసి నటించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ చెప్పడం విశేషం.
Bollywood Khans movie: బాలీవుడ్ ఖాన్ త్రయం గురించి తెలియని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ త్రయం మూడు దశాబ్దాలకు పైగానే బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే ఈ ముగ్గురూ కలిసి ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. ఈ మధ్యే వీళ్లు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో కలిసి డ్యాన్స్ చేయడంతో ఈ ఐడియా తెరపైకి రాగా.. ఇప్పుడు ఆమిర్ దీనిపై స్పందించాడు.
ఆ ఇద్దరితో మాట్లాడాను: ఆమిర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ మధ్యే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్నాడు. నెట్‌ఫ్లిక్స్ లో వచ్చే ఈ షోలో అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ముగ్గురు ఖాన్‌లు కలిసి ఒక్క సినిమా అయినా చేయాల్సిందే అని, లేదంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని తాను సల్మాన్, షారుక్ లతో అన్నట్లు ఆమిర్ ఈ షోలో వెల్లడించాడు. ఓ ప్రేక్షకుడు ముగ్గురి సినిమాపై అడిగినప్పుడు ఆమిర్ ఇలా స్పందించాడు.
"మీది, నాది ఒకటే ఆలోచన. నేను ఈ మధ్యే షారుక్, సల్మాన్ లను కలిశాను. అప్పుడు వాళ్లతో మాట్లాడుతూ.. మనం ముగ్గురం ఒకే ఇండస్ట్రీలో పని చేయడం ప్రారంభించి మూడు దశాబ్దాలకు పైనే అయింది. ముగ్గురం కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోతే ప్రేక్షకులు బాధపడతారు. ఒక్క సినిమా అయినా చేయొచ్చు కదా అని అన్నాను" అంటూ ఆమిర్ ఈ మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నాడు.
అయితే రెండు రోజుల కిందటే సల్మాన్ ను మరోసారి కలిసినప్పటి విషయాన్ని చెబుతూ మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమిర్ వెల్లడించాడు. "మేం ముగ్గురం మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాం" అని ఆమిర్ అన్నాడు. సల్మాన్ ను కలిసినప్పుడు అతడు తనకు తన బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ కు చెందిన డెనిమ్స్ ఇచ్చినట్లు కూడా తెలిపాడు.
ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్.. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లలో సినిమాలు వచ్చినా.. ఈ ముగ్గురు కలిసి ఇప్పటి వరకూ ఒక్క మూవీలోనూ నటించలేదు. ఇప్పుడు ఆమిర్ చెప్పింది నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
యువకుడిలా కనిపించడం వెనుక సీక్రెట్
ఇక ఆమిర్ ఖాన్ 59 ఏళ్ల వయసులోనూ చాలా యంగ్, ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. దీనికి కారణం ఏంటన్నది కూడా ఇదే షోలో ఆమిర్ వెల్లడించాడు. తాను అసలు ఎలాంటి కాస్మెటిక్స్ వాడనని, అసలు షాంపూ ఉంటుందని యాక్టర్ అయిన తర్వాతే తెలుసుకున్నానని చెప్పడం విశేషం.
"నేను నా ముఖానికి ఎలాంటి క్రీమ్ రాయను. జిమ్ కు కూడా వెళ్లను. సినిమాకు అవసరం అయితే తప్ప. నేను యాక్టింగ్ లోకి అడుగు పెట్టే ముందు అసలు నాకు షాంపూ గురించి తెలియదంటే నమ్ముతారా? తలకు కూడా సబ్బే వాడేవాడిని" అని ఆమిర్ చెప్పడం విశేషం. తనకు వచ్చిన జీన్స్ కారణంగానే తాను ఇలా యంగ్ గా కనిపిస్తున్నానేమో అని కూడా ఆమిర్ అన్నాడు.