Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటిపై 3 రౌండ్ల కాల్పులు.. బాలీవుడ్‌లో కలకలం-three rounds of gunfire shots at salman khan home and investigation goes details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటిపై 3 రౌండ్ల కాల్పులు.. బాలీవుడ్‌లో కలకలం

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటిపై 3 రౌండ్ల కాల్పులు.. బాలీవుడ్‌లో కలకలం

Sanjiv Kumar HT Telugu
Apr 14, 2024 10:15 AM IST

Gunfire At Salman Khan Home: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన హిందీ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. సల్మాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్ ఇంటిపై 3 రౌండ్ల కాల్పులు.. బాలీవుడ్‌లో కలకలం
సల్మాన్ ఖాన్ ఇంటిపై 3 రౌండ్ల కాల్పులు.. బాలీవుడ్‌లో కలకలం (PTI)

Gunfire At Salman Khan Home: హిందీ చిత్ర పరిశ్రమ షాక్‌లోకి వెళ్లింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన సంఘటనతో కలకలం మొదలైంది. సల్మాన్ ఖాన్ నివాసం బయట ఆదివారం (ఏప్రిల్ 14) తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సల్మాన్ ఖాన్ నివసిస్తున్న బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట ఆ ఇద్దరు వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

ఈ ఘటనతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ అవాక్కైంది. కాగా ఈ సంఘటనపై స్థానిక పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు.

"ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి ముందు మోటార్ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు కోసం సంఘటనా స్థలానికి చేరుకున్నారు" అని ముంబై పోలీసులు తెలిపారు.

సల్మాన్ ఖాన్ నివాసం బయట భద్రతను కట్టుదిట్టం చేశామని, వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు అతని ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల ఫుటేజీని సేకరిస్తున్నారని పోలీసులు చెప్పారు.

స్థానిక పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ బెదిరింపుల నేపథ్యంలో 2022 నవంబర్ నుంచి సల్మాన్ ఖాన్ భద్రతను వై ప్లస్‌కు పెంచిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్‌కు వ్యక్తిగతంగా ఆయుధాన్ని తీసుకెళ్లేందుకు లైసెన్స్ కూడా లభించింది. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సల్మాన్ ఖాన్ కొనుగోలు చేశాడు.

గత ఏడాది మార్చిలో, సల్మాన్ ఖాన్ కార్యాలయానికి ఇ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఆ తరువాత ముంబై పోలీసులు గ్యాంగ్ స్టర్స్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, మరొక వ్యక్తిపై ఐపీసీ సెక్షన్లు 120-బి (నేరపూరిత కుట్ర), 506-2 (క్రిమినల్ బెదిరింపు), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సల్మాన్ ఖాన్ నివాసం ఉన్న బాంద్రాకు చెందిన ఆర్టిస్ట్ మెనేజ్ మెంట్ కంపెనీ నడుపుతున్న ప్రశాంత్ గుంజాల్కర్ అనే వ్యక్తి బాంద్రా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఖాన్ త్రయంలో సల్మాన్ ఖాన్ ఒకరు. ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ అభిమానులు, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఇటీవలే టైగర్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాల తర్వాత మూడో చిత్రంగా వచ్చిన టైగర్ 3 మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఇందులో సల్మాన్ కు జోడీగా మూడోసారి కత్రీనా కైఫ్ నటించింది.