IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు-ipl 2024 srh vs gt sunrisers hyderabad qualified for the playoffs after match called off due to heavy rain in hyderabad ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Srh Vs Gt: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

Hari Prasad S HT Telugu

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరింది సన్ రైజర్స్ హైదరాబాద్. గుజరాత్ టైటన్స్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో సన్ రైజర్స్ 15 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు (IPL- X)

IPL 2024 SRH vs GT: హైదరాబాద్ వర్షం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ను ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేర్చింది. ఎడతెరపి లేని వర్షం కారణంగా సన్ రైజర్స్, గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ రద్దయింది. దీంతో సన్ రైజర్స్ 13 మ్యాచ్ లలో 15 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇక నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం ఆర్సీబీ, సీఎస్కే తలపడనున్నాయి.

ప్లేఆఫ్స్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్

హైదరాబాద్ లో గురువారం (మే 16) మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో సన్ రైజర్స్, గుజరాత్ మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయింది. భారీ వర్షం కారణంగా ఉప్పల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారిపోయింది. రాత్రి 10 గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టినా.. మైదానాన్ని సిద్ధం చేయడం అసాధ్యమని గ్రౌండ్ సిబ్బంది చెప్పడంతో మ్యాచ్ రద్దు చేశారు.

ఈ మ్యాచ్ రద్దవడంతో సన్ రైజర్స్, గుజరాత్ లకు చెరొక పాయింట్ వచ్చింది. దీంతో సన్ రైజర్స్ మొత్తం 13 మ్యాచ్ లలో 7 గెలిచి, ఐదు ఓడి, ఒకటి రద్దవడంతో 15 పాయింట్లు సాధించింది. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మరో స్థానం కోసం పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది.

నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు ఎవరిది?

గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ రద్దవడంతో 15 పాయింట్లతో సన్ రైజర్స్ మూడో స్థానానికి చేరింది. కేవలం ఒకే ఒక్క జట్టుకు మాత్రమే 15కి మించి పాయింట్లు వచ్చే అవకాశం ఉండటంతో సన్ రైజర్స్ నేరుగా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. శుక్రవారం (మే 17) ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. శనివారం (మే 18) సీఎస్కే, ఆర్సీబీ మధ్య వర్చువల్ ఎలిమినేటర్ జరగనుంది.

ఆర్సీబీ ఒకవేళ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఆ టీమ్ సీఎస్కేను 18 పరుగులతో ఓడించాలి. లేదంటే కనీసం 11 బంతులు మిగిలి ఉండగా టార్గెట్ చేజ్ చేయాలి. మరోవైపు సీఎస్కే మాత్రం కేవలం గెలిస్తే చాలు ప్లేఆఫ్స్ చేరుతుంది. అయితే బెంగళూరులోనూ శనివారం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే మాత్రం ఆర్సీబీ ఇంటిదారి పడుతుంది.

సన్ రైజర్స్ చివరి మ్యాచ్

సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరినా.. ఆదివారం (మే 19) హైదరాబాద్ లోనే తన చివరి లీగ్ మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో గెలిచి, ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ చివరి మ్యాచ్ లో ఓడితే మాత్రం సన్ రైజర్స్ రెండో స్థానంతో లీగ్ స్టేజ్ ముగిసే అవకాశం ఉంటుంది. ఇది నిజంగా గుడ్ న్యూసే.

మరోవైపు వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం రెండో స్థానంలోనే ఉంది. కేకేఆర్ తొలి స్థానంతోనే ప్లేఆఫ్స్ కు వెళ్లనుంది. మొత్తానికి సన్ రైజర్స్ తో మూడు ప్లేఆఫ్స్ బెర్తులు కన్ఫమ్ కాగా.. నాలుగో టీమ్ ఏది అన్నది తేలాల్సి ఉంది.