DC vs LSG: స్టబ్స్, పోరెల్ మెరుపులు.. ఢిల్లీ దీటైన స్కోరు.. సూపర్ క్యాచ్ పట్టిన రాహుల్.. చప్పట్లతో అభినందించిన ఓనర్
DC vs LSG IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోరు చేసింది. ఢిల్లీ ఓపెనర్ అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ అర్ధ శతకాలతో మెరిపించారు.
DC vs LSG IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో తన చివరి లీగ్ మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‍లో రాణించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో నేటి (మే 14) మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ సేన దీటైన స్కోరు చేసింది. హోం గ్రౌండ్‍లో జరిగిన ఈ మ్యాచ్‍లో ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్ చేరాలంటే గెలిచి తీరాల్చిన మ్యాచ్‍లో లక్నో ముందు 209 పరుగుల దీటైన లక్ష్యం ఉంది.
దుమ్మురేపిన పోరెల్
టాస్ ఓడి ఈ మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఫామ్‍లో ఉన్న ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (0)ను తొలి ఓవర్లోనే లక్నో పేసర్ అర్షద్ ఖాన్ ఔట్ చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ అదరగొట్టాడు. 33 బంతుల్లోనే 58 పరుగులతో మంచి అర్ధ శతకం చేశాడు పోరెల్. 5 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదాడు. ఢిల్లీ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. షాయ్ హోప్ (27 బంతుల్లో 38 పరుగులు) కూడా బాగానే ఆడాడు. పోరెల్‍కు సహకరించాడు. అయితే, తొమ్మిదో ఓవర్లో బిష్ణోయ్ బౌలింగ్‍లో కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్‍కు షాయ్ హోప్ ఔటయ్యాడు. దూకుడు కొనసాగించిన పోరెల్ 51 బంతుల్లోనే పోరెల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 9.2 ఓవర్లలోనే ఢిల్లీ స్కోరు 100 దాటింది. అయితే, 12వ ఓవర్లో పోరెల్‍ను ఔట్ చేసి ఢిల్లీని దెబ్బకొట్టాడు నవీనుల్ హక్.
స్టబ్స్ మెరుపులు
ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 23 బంతుల్లో 33 పరుగులు ఉన్నంత సేపు రాణించాడు. 5 ఫోర్లు బాదాడు. నవీనుల్ హక్ బౌలింగ్‍లో 17వ ఓవర్లో భారీ షాట్‍కు ప్రయత్నించి పంత్ క్యాచౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించి అజేయ అర్ధ శకతం చేశాడు. తన మార్క్ భీకర హిట్టింగ్‍తో దుమ్మురేపాడు. 25 బంతుల్లోనే 57 పరుగులతో స్టబ్స్ అదరగొట్టాడు. 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో చెలరేగాడు. అతడి హిట్టింగ్‍తో ఢిల్లీ 200 పరుగుల మార్క్ దాటింది.
లక్నో బౌలర్లలో నవీనుల్ హక్ రెండు, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
రాహుల్ సూపర్ క్యాచ్.. అభినందించిన గొయెంకా
ఈ మ్యాచ్‍లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ కాకుండా ఫీల్డింగ్ చేశాడు. ఈ క్రమంలో ఓ సూపర్ క్యాచ్ పట్టాడు. తొమ్మిదో ఓవర్లో రవి బిష్ణోయ్ బౌలింగ్‍లో ఢిల్లీ బ్యాటర్ షాయ్ హోప్ బంతిని బలంగా బాదగా షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ వద్దకు బుల్లెట్ వేగంతో వెళ్లింది. క్యాచ్ పట్టేందుకు రాహుల్ ప్రయత్నించగా.. బంతి చేతుల్లో పడి దూరంగా ఎగిరింది. అయితే, మళ్లీ డైవ్ కొట్టి దూరంగా పడబోయిన బంతిని రాహుల్ ఒడిసిపట్టి క్యాచ్ పూర్తి చేశాడు. దీంతో హోప్ ఔటయ్యాడు. రాహుల్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో జట్టు ఓనర్ సంజీవ్ గొయెంకా చప్పట్లతో స్టాండ్స్ నుంచి అభినందించారు. సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మ్యాచ్‍లో భారీ ఓటమి తర్వాత రాహుల్‍ను బహిరంగంగా అరవటంతో గోయెంకాపై విమర్శలు వచ్చాయి. అయితే, ఇప్పుడు రాహుల్ క్యాచ్‍ను ఆయన నిలబడి చప్పట్లో అభినందించడం వైరల్‍గా మారింది. ఇప్పటికే రాహుల్‍కు వ్యక్తిగతంగా కూడా డిన్నర్ ఇచ్చి కూల్ చేశారు గోయెంకా.