Rishabh Pant: రిషబ్ పంత్‍పై నిషేధం.. కీలక సమయంలో ఢిల్లీకి షాక్-delhi capitals captain rishabh pant handed one match suspension set to miss dc vs rcb clash ipl 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant: రిషబ్ పంత్‍పై నిషేధం.. కీలక సమయంలో ఢిల్లీకి షాక్

Rishabh Pant: రిషబ్ పంత్‍పై నిషేధం.. కీలక సమయంలో ఢిల్లీకి షాక్

Chatakonda Krishna Prakash HT Telugu
May 11, 2024 04:35 PM IST

Rishabh Pant Ban - IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‍పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా ఉన్న ఈ కీలక సమయంలో ఢిల్లీకి ఇది షాక్‍గా మారింది. ఆ వివరాలివే..

Rishabh Pant: రిషబ్ పంత్‍పై నిషేధం.. కీలక సమయంలో ఢిల్లీకి షాక్
Rishabh Pant: రిషబ్ పంత్‍పై నిషేధం.. కీలక సమయంలో ఢిల్లీకి షాక్ (PTI)

Rishabh Pant IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) పడి లేచిన కెరటంలా పుంజుకుంది. తొలి తొలి ఐదు మ్యాచ్‍ల్లో ఒక్కటి మాత్రమే గెలిచిన ఢిల్లీ.. ఆ తర్వాత ఏడు మ్యాచ్‍ల్లో ఏకంగా ఐదు విజయాలు సాధించింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచింది రిషబ్ పంత్ సారథ్యలోని ఢిల్లీ క్యాపిటల్స్. ప్లేఆఫ్స్ చేరాలంటే లీగ్ దశలో మిగిలిన తన రెండు మ్యాచ్‍లను ఢిల్లీ గెలవడం తప్పనిసరిగా మారింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో రేపు (మే 12), లక్నో సూపర్ జెయింట్స్‌తో మే 14న ఢిల్లీ తలపడాల్సి ఉంది. అయితే, ఇలాంటి కీలక సమయంలో ఆ జట్టుకు షాక్ ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కెప్టెన్ రిషబ్ పంత్‍పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. వివరాలివే..

నిషేధానికి కారణమిదే..

స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్‍పై ఓ మ్యాచ్ నిషేధాన్ని బీసీసీఐ విధించింది. రూ.30లక్షలు ఫైన్ వేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో మే 7న జరిగిన మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ సీజన్‍లో ఆ జట్టు మూడోసారి స్లోఓవర్ రేట్ తప్పిదం చేసింది. దీంతో కెప్టెన్ రిషబ్ పంత్‍పై ఓ మ్యాచ్ నిషేదం విధించింది బీసీసీఐ.

ఆర్సీబీతో మ్యాచ్‍కు పంత్ దూరం

నిషేధం వేటు పడటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో రేపు (మే 12) జరగనున్న కీలక మ్యాచ్‍కు రిషబ్ పంత్ దూరం కానున్నాడు. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పోరుకు కెప్టెన్ పంత్ దూరమవడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బగా ఉంది. పంత్ లేకపోవటంతో ఆర్సీబీతో మ్యాచ్‍లో ఢిల్లీ జట్టుకు ఎవరు కెప్టెన్సీ చేస్తారనేది కూడా ఉత్కంఠగా మారింది.

ఓ మ్యాచ్ నిషేధంతో పాటు రూ.30లక్షల ఫైన్ కూడా రిషబ్ పంత్‍కు విధించినట్టు బీసీసీఐ వెల్లడించింది. “ఢిల్లీలో మే 7వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ 56వ మ్యాచ్‍లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసి ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‍ను ఓ మ్యాచ్ నిషేధించటంతో పాటు ఫైన్ విధిస్తున్నాం” అని బీసీసీఐ నేడు (మే 11) వెల్లడించింది.

నిబంధనలు ఇలా..

ఐపీఎల్ నిబంధన ప్రకారం.. సీజన్‍లో మొదటిసారి జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే కెప్టెన్‍కు రూ.12లక్షల ఫైన్ పడుతుంది. రెండోసారి స్లోఓవర్ రేట్ రిపీట్ అయితే కెప్టెన్‍కు రూ.24లక్షలు, మిగిలిన ఆటగాళ్లకు రూ.12లక్షల ఫైన్ పడుతుంది. అదే సీజన్‍లో జట్టు మూడోసారి స్లోఓవర్ రేట్ తప్పిదం చేస్తే కెప్టెన్‍పై ఓ మ్యాచ్ నిషేధం, రూ.30లక్షల జరిమానా పడుతుంది. మిగిలిన ప్లేయర్లపై రూ.12లక్షల జరిమానా లేకపోతే మ్యాచ్‍లో ఫీజులో సగం ఏది తక్కువైతే అది ఫైన్‍గా ఉంటుంది. మూడో రూల్ ప్రకారం ఇప్పుడు రిషబ్ పంత్‍పై ఓ మ్యాచ్ వేటు పడింది.

ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య రేపు (మే 12) మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ పోరు జరగనుంది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలువాల్సిన ఈ పోరుకు పంత్ దూరమవడం ఢిల్లీకి గట్టి ఎదురుదెబ్బగా ఉంది. పంత్ ఈ సీజన్‍లో బ్యాటింగ్‍తో పాటు కీపింగ్‍లోనూ దుమ్మురేపాడు. 12 మ్యాచ్‍ల్లో 156 స్టైక్‍రేట్‍తో 413 రన్స్ చేశాడు పంత్.

Whats_app_banner