DC vs RR IPL 2024 Result: శాంసన్ అద్భుత పోరాటం వృథా.. ఔట్‍పై వివాదం.. రాజస్థాన్‍పై ఢిల్లీ గెలుపు.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
DC vs RR IPL 2024 Result: రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ 2024 సీజన్‍లో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత పోరాటం వృథా అయింది.
DC vs RR IPL 2024 Result: ఐపీఎల్ 2024 సీజన్‍లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ పుంజుకుంది. రాజస్థాన్ రాయల్స్‌పై నేడు (మే 7) కీలక విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్స్ ఆశలను ఢిల్లీ సజీవంగా ఉంచుకుంది. హోం గ్రౌండ్‍లో నేడు జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో రాజస్థాన్‍పై గెలిచింది. మ్యాచ్ ఎలా సాగిందంటే..
శాంసన్ ఒంటరి పోరాటం
222 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత పోరాటం చేశాడు. మిగిలిన వారు విఫలమైనా సంజూ దూకుడుగా ఆడుతూ ముందుకు సాగాడు. 46 బంతుల్లోనే 86 పరుగులతో సంజూ అదరగొట్టాడు. 8 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదాడు. హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. అయితే, 16వ ఓవర్లో కీలక సమయంలో సంజూ శాంసన్ ఔటయ్యాడు. మొత్తంగా 20 ఓవర్లలో రాజస్థాన్ 8 వికెట్లకు 201 పరుగులు చేసి, ఓడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (4), జాస్ బట్లర్ (19) విఫలం కాగా.. ఆ తర్వాత శాంసన్ అద్భుతంగా ఆడాడు. దూకుడుగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చాడు. రియాన్ పరాగ్ (22) పర్వాలేదనిపించాడు.
వివాదాస్పద నిర్ణయం
శాంసన్ మాత్రం మరో ఎండ్‍లో ధనాధన్ ఆట కొనసాగించాడు. 28 బంతుల్లో అర్ధ శకతం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా భారీ షాట్లు ఆడాడు. అయితే, 16వ ఓవర్లో ఢిల్లీ పేసర్ ముకేశ్ బౌలింగ్‍లో ఫీల్డర్ హోప్ బౌండరీ లైన్ వద్ద పట్టిన సూపర్ క్యాచ్‍కు సంజూ ఔటయ్యాడు. అయితే, హోప్ కాలు బౌండరీ లైన్‍కు తాకినట్టు అనిపించడటంతో క్యాచ్ చెక్ చేయాలని అంపైర్లను శాంసన్ అడిగాడు. అయితే, థర్డ్ అంపైర్ ఆ క్యాచ్‍ను ఎక్కువ సేపు పరిశీలించలేదు. సంక్లిష్టంగా ఉన్న ఈ క్యాచ్‍పై ఔట్ అని చాలా త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో నిరాశగా పెవిలియన్ చేరాడు శాంసన్. ఈ ఔట్ వివాదాస్పదంగా మారింది. అది నాటౌట్ అంటూ చాలా మంది సోషల్ మీడియాలోనూ పోస్టులు చేస్తున్నారు. కాగా.. శాంసన్ ఔటయ్యాక శుభం దూబే (12 బంతుల్లో 25 పరుగులు) కాసేపు మెరిపించాడు. ఫెరీరా (1), రవిచంద్రన్ అశ్విన్ (2), రవ్మన్ పావెల్ (13) సహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో రాజస్థాన్ ఓటమి పాలైంది.
ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, రసిక్ సలామ్ చెరొకటి దక్కించుకున్నారు.
మెక్‍గుర్క్, పోరెల్ సూపర్ హాఫ్ సెంచరీలు
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (20 బంతుల్లో 50 పరుగులు; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శకతంతో మెరుపులు మెరిపించగా.. అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65 పరుగులు; 7ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత హాఫ్ సెంచరీ చేశారు. ఇద్దరూ ధనాధన్ బ్యాటింగ్‍తో ఢిల్లీకి అద్భుత ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా ఫ్రేజర్ దుమ్మురేపాడు. ఐదో ఓవర్లోనే హాఫ్ సెంచరీ చేరాడు. ఫ్రేజర్ ఔటయ్యాక పోరెల్ అదరగొట్టాడు. శాయ్ హోప్ (1), కెప్టెన్ రిషబ్ పంత్ (15), అక్షర్ పటేల్ (15) ఎక్కువ రన్స్ చేయలేకపోయారు. అయితే, చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41 పరుగులు; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించాడు. దీంతో ఢిల్లీకి భారీ స్కోరు దక్కింది.
రాజస్థాన్ బౌలర్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (3/24) మూడు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. యుజువేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
ఢిల్లీకి ఇంకా ప్లేఆఫ్స్ ఆశలు
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‍ల్లో ఢిల్లీ ఆరు గెలిచి.. ఆరు ఓడింది. దీంతో 12 పాయింట్లను దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానానికి ఎగబాకింది. లీగ్ దశలో మిగిలిన తన రెండు మ్యాచ్‍లు కూడా గెలిస్తే ఢిల్లీకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అయితే, నెట్‍రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాల్సి రావొచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‍ల్లో 8 గెలిచి.. 3 ఓడింది. మిగిలిన మూడు మ్యాచ్‍ల్లో ఒక్కటి గెలిచినా ఆ జట్టు కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్ఆర్ రెండోస్థానంలో కొనసాగింది.