Delhi Capitals: ఢిల్లీ గడ్డపై పంత్ షో.. దుమ్మురేపిన రిషబ్.. కళ్లు చెదిరేలా హెలికాప్టర్ షాట్ కూడా: వీడియో
DC vs GT IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కళ్లు చెదిరే హిట్టింగ్‍తో దడదడలాడించాడు. దీంతో గుజరాత్ టైటాన్స్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో పంత్ ఓ అద్భుతమైన హెలికాప్టర్ షాట్ బాదాడు
Delhi Capitals vs Gujarat Titans: ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కెప్టెన్ రిషభ్ పంత్ ధనాధన్ హిట్టింగ్‍తో దుమ్మురేపాడు. హోం గ్రౌండ్ ఢిల్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో తన మార్క్ షాట్లతో హెరెత్తించాడు. గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్లను దడదడలాడించాడు. జీటీ పేసర్ మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్లో ఏకంగా నాలుగు సిక్స్‌లు, ఓ ఫోర్‍తో దుమ్మురేపాడు. మొత్తంగా 43 బంతుల్లోనే అజేయంగా 88 పరుగులతో రెచ్చిపోయాడు రిషబ్. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో వీరంగం చేశాడు. అద్భుత అర్ధ శకతంతో ఢిల్లీకి భారీ స్కోరు సాధించిపెట్టాడు.
రిషబ్ పంత్ మెరుపులతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం హోరెత్తిపోయింది. పంత్‍తో పాటు అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66 పరుగులు) అర్ధ శకతంతో రాణించాడు. దీంతో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో4 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోరు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (7 బంతుల్లో 26 పరుగులు నాటౌట్) చివర్లో మెరిపించాడు.
చివరి రెండు ఓవర్లలో 53 రన్స్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చివరి రెండు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు పిండుకుంది. గుజరాత్ స్పిన్నర్ సాయి కిశోర్ వేసిన 19వ ఓవర్లో ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్.. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టాడు. మొత్తంగా ఆ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. మోహిత్ వేసిన చివరి ఓవర్లో పంత్ విధ్వంసం చేశాడు. తొలి బంతికి పంత్ డబుల్ తీయగా.. ఆ తర్వాత వైడ్ వచ్చింది. అనంతరం రెండో బంతికి పంత్ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత ఓ ఫోర్ బాదాడు రిషబ్. ఆ తర్వాత చివరి మూడు బంతులకు వరుసగా మూడు సిక్స్‌లతో మెరిపించాడు. చివరి ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీకి భారీ స్కోరు దక్కింది. గుజరాత్ ముందు ఏకంగా 225 పరుగుల లక్ష్యం ఉంది.
గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ ఈ మ్యాచ్‍లో 4 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్ర ఓ మ్యాచ్‍లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‍లో గుజరాత్ పేసర్ సందీప్ వారియర్ మూడు, నూర్ అహ్మద్ ఓ వికెట్ తీశారు.
పంత్ సూపర్ హెలికాప్టర్ షాట్
ఈ మ్యాచ్‍లో రిషబ్ పంత్ అద్భుతమైన హెలీకాప్టర్ షాట్ కొట్టాడు. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ వేసిన 16వ ఓవర్ తొలి బంతికి పంత్ సూపర్ షాట్ బాదాడు. ఫుల్ లెంగ్త్ బంతికి హెలికాప్టర్ షాట్ ఆడి మిడ్‍వికెట్ వైపు సిక్స్ కొట్టేశాడు పంత్. ఈ షాట్‍తో తన గురువు ఎంఎస్ ధోనీని గుర్తు చేశాడు పంత్.
ఈ సీజన్‍లో రిషబ్ పంత్‍కు ఇది మూడో అర్ధ శకతంగా ఉంది. రోడ్డు ప్రమాదం వల్ల 15నెలల పాటు క్రికెట్ దూరమైన పంత్.. ఆ తర్వాత ఈ సీజన్ ఐపీఎల్‍లో బరిలోకి దిగాడు. ఇప్పుడు ఫుల్ ఫిట్‍నెస్‍తో అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో, టీ20 ప్రపంచకప్ భారత జట్టులో పంత్‍కు చోటు ఖాయమే.
ఈ మ్యాచ్‍లో టాస్ ఓడి ముందుగా ఢిల్లీ బ్యాటింగ్‍కు దిగింది. ఓపెనర్ పృథ్వి షా (11) త్వరగా ఔటవ్వగా.. జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (23) కాసేపు వేగంగా ఆడాడు. అనంతరం షాయ్ హోప్ (5) త్వరగా ఔటైనా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్ అదరగొట్టారు. 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్ ఔటైనా చివరి వరకు సూపర్ హిట్టింగ్‍తో పంత్ మెరిపించాడు.