IPL 2024 RR vs PBKS: చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. వరుసగా నాలుగో ఓటమి తప్పదా?
IPL 2024 RR vs PBKS: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో.. వరుసగా నాలుగో ఓటమి తప్పదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

IPL 2024 RR vs PBKS: పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 రన్స్ మాత్రమే చేసింది. రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ మాత్రమే 48 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (18) సహా మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు.
చేతులెత్తేసిన బ్యాటర్లు
ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ టీమ్ బ్యాటర్లు తొలి ఓవర్ నుంచే తడబడుతూ ఆడారు. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (4)ను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రాయల్స్ కాస్త డిఫెన్స్ లో పడిపోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ మరో ఓపెనర్ కోహ్లెర్ కాడ్మోర్ తో ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు.
దీంతో రాయల్స్ పరుగుల కోసం తంటాలు పడ్డారు. క్రమంగా ఒత్తిడి పెరగడంతో ఎలిస్ బౌలింగ్ లో షార్ట్ పిచ్ బాల్ ను ఆడబోయే సంజూ శాంసన్ (18) ఔటయ్యాడు. ఆ వెంటనే కాడ్మోర్ (18) కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. ఈ సమయంలో అశ్విన్, రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.
పరాగ్ ఒక్కడే..
ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 50 పరుగులు జోడించారు. తర్వాత అశ్విన్ 19 బంతుల్లో 28 రన్స్ చేసి అర్ష్‌దీప్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో 92 రన్స్ దగ్గర రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయారు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధృవ్ జురెల్ (0) తొలి బంతికే గోల్డెన్ డకౌటై వెనుదిరిగాడు. రోవ్‌మన్ పావెల్ (4) కూడా విఫలమయ్యాడు.
ఓవైపు సహచరులంతా పెవిలియన్ చేరుతున్నా.. రియాన్ పరాగ్ మాత్రమే క్రీజులో నిలదొక్కుకొని స్కోరుబోర్డును మెల్లగా కదిలిస్తూ వెళ్లాడు. చివరి ఓవర్లో అతడు 48 పరుగులు చేసి ఔటయ్యాడు. పరాగ్ ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు ఉన్నాయి. దీంతో రాయల్స్ ఆమాత్రం స్కోరైనా సాధించగలిగింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో స్పిన్నర్ రాహుల్ చహర్ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చిన రెండు వికెట్లు తీయడం విశేషం.
ఇక నేథన్ ఎలిస్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ సామ్ కరన్, హర్షల్ పటేల్ కూడా చెరో రెండు వికెట్లు తీశారు. ముఖ్యంగా హర్షల్ అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కేవలం 6 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయడం విశేషం. దీంతో రాయల్స్ స్కోరు 144 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ తో మరోసారి పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ సొంతమైంది. అతడు ఈ సీజన్లో ఇప్పటి వరకూ 21 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా 20 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.