KL Rahul: చాలా భయమేసింది.. స్కూల్‍లోనూ ఎప్పుడూ అలా జరగలేదు: కేఎల్ రాహుల్
KL Rahul: ఐదేళ్ల క్రితం కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూ వివాదంపై కేఎల్ రాహుల్ ఇప్పుడు స్పందించాడు. ఆ ఇంటర్వ్యూ తర్వాత తనకు చాలా భయమేసిందని అన్నాడు. సస్పెన్షన్‍కు గురైనప్పుడు ఎలా ఫీలయ్యాడో తాజాగా చెప్పాడు.
భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2019లో ఓ వివాదంలో చిక్కుకున్నాడు. కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ టాక్ షోకు హార్దిక్ పాండ్యాతో కలిసి రాహుల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ ఇద్దరూ అసభ్యకరమైన కొన్ని కామెంట్లు చేశారు. దీనిపై వారు విమర్శలను ఎదుర్కొన్నారు. రాహుల్, హార్దిక్‍పై బీసీసీఐ నిషేధం కూడా విధించింది. అయితే, కొన్నాళ్లకు సస్పెన్షన్ ఎత్తేసింది. ఈ వివాదంపై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు స్పందించాడు కేఎల్ రాహుల్.
స్కూల్‍లోనూ సస్పెండ్ కాలేదు.. భయమేసింది
కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూ తర్వాత తనకు చాలా భయమేసిందని కేఎల్ రాహుల్ చెప్పాడు. నిఖిల్ కామత్‍కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయంపై రాహుల్ మాట్లాడాడు. తాను ఎప్పుడూ స్కూల్ నుంచే సస్పెండ్ అవలేదని, అలాంటిది జట్టు నుంచి నిషేధానికి గురయ్యే సరికి వణికిపోయానని అన్నాడు.
కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూ తర్వాత ఏం చేయాలో కూడా తనకు అర్థం కాలేదని కేఎల్ రాహుల్ చెప్పాడు. “ఆ ఇంటర్వ్యూ నన్ను చాలా భయపెట్టేసింది. నేను టీమ్ నుంచి సస్పెండ్ అయ్యాను. నేను స్కూల్‍లోనే ఎప్పుడూ సస్పెండ్ కాలేదు.. పనిష్మెంట్ తీసుకోలేదు. అందుకే అప్పుడేం చేయాలో అర్థం కాలేదు. నేను స్కూల్‍లో అల్లరి చేశాను కానీ ఎప్పుడు బయటికి వెళ్లలేదు. ఈ విషయంలో నా కోసం తల్లిదండ్రులు స్కూల్‍కు రావడం కూడా జరగలేదు” అని రాహుల్ తెలిపాడు.
ఎలాగైనా టోల్స్ వచ్చేవి
రెండేళ్ల క్రితం వరకు తనపై ట్రోల్స్ విపరీతంగా వచ్చేవని రాహుల్ చెప్పాడు. వాటిని తాను పట్టించుకునే వాడిని కాదని తెలిపాడు. “నేను ట్రోలింగ్‍లో ఎక్కువగా ఉండేవాడిని. నేను ఏమీ పట్టించుకోకూడదని అనుకున్నా. కొన్నాళ్ల క్రితం వరకు నేను కూడా చాలా ట్రోలింగ్‍గు గురయ్యా. కూర్చున్నా.. నిలబడినా నాపై ట్రోల్స్ వచ్చేవి” అని రాహుల్ అన్నాడు.
ఆ ఇంటర్వ్యూ నన్ను మార్చేసింది
కాఫీ విత్ కరణ్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూ తనను మార్చేసిందని కేఎల్ రాహుల్ చెప్పాడు. “ఆ ఇంటర్వ్యూ చాలా విభిన్నం. అది నన్ను చాలా మార్చేసింది. నేను మొదటి నుంచి చాలా తక్కువగా మాట్లాడేవాడిని. సిగ్గు పడుతుండేవాడిని. ఇండియాకు ఆడిన తర్వాత నాకు చాలా ఆత్మవిశ్వాసం వచ్చింది. ఎక్కువ మంది మధ్యలో ఉండేందుకు నాకు సమస్యగా అనిపించేది కాదు. గదిలో 100 మంది ఉన్నా నేను ఉన్నానని అందరూ గుర్తించేవారు. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడేవాడిని” అని రాహుల్ చెప్పాడు.
కేఎల్ రాహుల్ ప్రస్తుతం దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీకి రెడీ అవుతున్నాడు. ఈ టోర్నీ సెప్టెంబర్ 5న మొదలుకానుంది. ఈసారి కొందరు స్టార్ భారత ఆటగాళ్లు కూడా ఈ టోర్నీ ఆడనున్నారు. సెప్టెంబర్ 19వ తేదీన బంగ్లాదేశ్‍తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్‍లో రాహుల్‍కు చోటు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. చెన్నైలో తొలి టెస్టు జరగనుంది.
వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రాహుల్‍ను రిటైన్ చేసుకుంటుందా లేదా అనేది కూడా ఉత్కంఠగా ఉంది. రాహుల్ ఫ్రాంచైజీ మారుతాడన్న అంచనాలు బలంగా ఉన్నాయి.