Pakistan Cricket: ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‍కు మరో దెబ్బ.. జరిమానా, డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత.. కారణమిదే
Pakistan Cricket: బంగ్లాదేశ్‍పై తొలి టెస్టులో ఓడిన బాధలో పాకిస్థాన్ ఉంది. చాలా మంది పాక్ మాజీలు ఆ టీమ్‍పై విరుచుపడుతున్నారు. ఈ తరుణంలో ఐసీసీ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. డబ్ల్యూటీసీ పాయింట్లను కోల్పోవటంతో పాటు జరిమానాకు గురయ్యారు పాక్ ఆటగాళ్లు.
సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ పరాభవానికి గురైంది. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి బంగ్లా చేతిలో పాక్ ఓటమి పాలైంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా పరాజయం పాలైంది షాన్ మసూద్ సారథ్యంలోని పాక్. ఈ ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‍కు ఐసీసీ రూపంలో మరో దెబ్బ తగిలింది. ఆ జట్టు ఖాతాలో ఆరు డబ్ల్యూటీసీ పాయింట్లలో ఐసీసీ కోత విధించటంతో పాటు జరిమానా విధించింది. బంగ్లాదేశ్‍కు కూడా ఫైన్ పడింది.
కారణం ఇదే
బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో పాకిస్థాన్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. నిర్ణీత సమయం కంటే ఓవర్లను ఆలస్యం చేసింది. ఈ కారణంతో పాక్ టీమ్‍పై ఐసీసీ వేటు వేసింది. ఆరు డబ్ల్యూటీసీ పాయింట్లను ఆ జట్టు ఖాతాలో నుంచి కోత విధించింది. ఇప్పటికే ఈ ఓటమితో ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ 2023-25 సైకిల్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో ప్లేస్‍కు పాక్ పడిపోయింది. ఇప్పుడు మరో ఆరు పాయింట్లు కూడా చేజారిపోయాయి.
జరిమానా
ఫస్ట్ టెస్టులో స్లోఓవర్ రేట్ వల్ల పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులోనూ 30 శాతం జరిమానా విధించింది ఐసీసీ. పాక్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‍తో పాటు ఇతర ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతకు గురైంది.
బంగ్లాకు కూడా..
తొలి టెస్టులో బంగ్లాదేశ్ కూడా స్లోఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో ఆ జట్టు డబ్ల్యూటీసీ ఖాతాలో మూడు పాయింట్లలో కోత విధించింది ఐసీసీ. పాక్‍పై గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరిన బంగ్లాదేశ్.. ఈ కోతతో ఏడో స్థానానికి పడిపోయింది. అలాగే, బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంతోతో పాటు ఆ జట్టు ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది ఐసీసీ.
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్‍కు అదనంగా 10 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా వేసింది ఐసీసీ. ఓ డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. సెకండ్ ఇన్నింగ్స్ 33వ ఓవర్లో పాక్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ వైపు కోపంగా షకీబ్ బంతి విసరడంతో ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది.
బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాకిస్థాన్ టీమ్‍పై విమర్శలు గట్టిగా వస్తున్నాయి. కొందరు పాక్ మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో నాలుగో రోజైన ఆదివారం (ఆగస్టు 25) 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్‍పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. పాక్‍పై తొలిసారి టెస్టు గెలిచి బంగ్లా చరిత్ర సృష్టించింది. అలాగే, పాక్‍ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో టెస్టులో ఓడించిన తొలి టీమ్‍గా నిలిచింది.
ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన పాకిస్థాన్ అనూహ్యంగా ఓడింది. రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది పాక్. బంగ్లా స్పిన్నర్లు మెహదీ హసన్ మీరాజ్ నాలుగు, షకీబుల్ హసన్ మూడు వికెట్లతో విజృంభించి పాక్‍ను కుప్పకూల్చారు. ఆ తర్వాత 30 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని బంగ్లా అలవోకగా ఛేదించింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య ఈ సిరీస్‍లో చివరిదైన రెండో టెస్టు ఆగస్టు 30న మొదలుకానుంది.