Rishabh Pant Litton Das Fight: బంగ్లాదేశ్ వికెట్ కీపర్‌కి చెపాక్ టెస్టులో రిషబ్ పంత్ వార్నింగ్, ఆఖరికి అతనికే క్యాచ్
IND vs BAN 1st Test Updates: చెపాక్ టెస్టులో తొలి రోజే బంగ్లాదేశ్ నుంచి కవ్వింపులు మొదలయ్యాయి. రిషబ్ పంత్‌పైకి బంతి విసురుతూ బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిట్టన్ దాస్ కవ్వింపులకి దిగాడు. దాంతో సీరియస్ అయిన పంత్ మైదానంలోనే వార్నింగ్ ఇచ్చాడు.
Pant Litton Das Fight: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య గురువారం ఉదయం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీమ్.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
తొలి సెషన్‌లోనే బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్మద్ దెబ్బకి మూడు కీలక వికెట్లు చేజార్చుకున్న భారత్ జట్టు ఆత్మరక్షణలో పడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 19 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటైపోగా, నెం.3లో వచ్చిన శుభమన్ గిల్ 8 బంతులాడినా కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాడు.
వరుసగా రెండు వికెట్లు చేజారిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. ఆదుకుంటాడని ఆశించిన టీమిండియా అభిమానులుకి నిరాశే ఎదురైంది. 6 బంతుల్లో 6 పరుగులే చేసిన కోహ్లీ వికెట్ చేజార్చుకున్నాడు. ఈ ముగ్గురినీ హసన్ మహ్మద్ ఔట్ చేశాడు. దాంతో భారత్ జట్టు 9.2 ఓవర్లు ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 34/3తో ఆత్మరక్షణలో పడిపోయింది.
పంత్ రాకతో మార్మోగిన చెపాక్
కారు యాక్సిడెంట్‌తో చాలా రోజులు ఆటకి దూరంగా ఉండిపోయిన రిషబ్ పంత్.. దాదాపు 632 రోజుల తర్వాత మళ్లీ టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. దాంతో చెపాక్ టెస్టులో పంత్ బ్యాటింగ్ కోసం మైదానంలోకి వస్తున్నప్పుడు అభిమానుల కేరింతలు, చప్పట్లతో చెపాక్ స్టేడియం మార్మోగిపోయింది.
ఇప్పటికే వన్డే, టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్.. చెపాక్‌లో స్వేచ్ఛగా బ్యాట్‌తో కాసేపు చెలరేగిపోయాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ షాట్స్ ఆడిన పంత్.. కట్ షాట్, కవర్ డ్రైవ్‌లతో అభిమానుల్ని అలరించాడు.
పంత్‌ను రెచ్చగొట్టిన బంగ్లా కీపర్
భారత్ జట్టు మూడు వికెట్లు చేజార్చుకున్న దశలో బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్‌ను కవ్వింపు చర్యలతో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిట్టన్ దాస్ రెచ్చగొట్టాడు. బంతిని బౌలర్‌కి తిరిగి అందజేసే క్రమంలో పంత్ శరీరానికి అతి దగ్గరగా విసురుతూ వచ్చాడు. దాంతో కాసేపు సహనంతో చూసిన రిషబ్ పంత్.. గట్టిగా లిట్టన్ దాస్‌కి వార్నింగ్ ఇచ్చాడు.
‘‘బంతిని అతనికి విసురు.. అంతేతప్ప నాపై విసిరి గాయపరచొద్దు’’ అని సీరియస్‌గా హెచ్చరించాడు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ఆ తర్వాత కూడా లిట్టర్ దాస్ తన తీరుని మార్చుకోలేదు. దాంతో చెపాక్ టెస్టులో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.
పంత్‌కి స్లెడ్జింగ్ కొత్త కాదు
రిషబ్ పంత్‌పై ఇలా ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కి దిగడం కొత్త కాదు. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా స్లెడ్జింగ్‌కి దిగారు. దాంతో పంత్ కూడా వారికి రివర్స్‌లో పంచ్‌లు విసిరాడు. వాస్తవానికి పంత్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇలా స్లెడ్జింగ్ ఎదురైనప్పుడే వస్తుంటుంది. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ప్లేయర్లు పంత్‌ని బేబీ సిట్టర్ అంటూ ఎగతాళి చేశారు. ఆ సిరీస్‌లో కంగారూల బౌలర్లకి రిషబ్ పంత్ చుక్కలు చూపించేశాడు.
లిట్టన్ దాస్ చేతికే చిక్కిన పంత్
చెపాక్ స్టేడియంలో కాసేపు పట్టుదలతో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్.. ఆఖరికి 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైపోయాడు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీని ఔట్ చేసిన హసన్ హమ్మద్ బౌలింగ్‌లోనే కీపర్ లిట్టన్ దాస్‌కి క్యాచ్ ఇచ్చి పంత్ ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 52 బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్ 6 ఫోర్లు కొట్టాడు. పంత్ ఔటయ్యే సమయానికి భారత్ జట్టు 25.3 ఓవర్లలో 96/4తో ఉంది.