Ashwin Wickets: కపిల్ దేవ్‌ను మించిపోయిన అశ్విన్.. కుంబ్లే, హర్భజన్ తర్వాత అతడే
Ashwin Wickets: కపిల్ దేవ్‌ను మించిపోయాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. కుంబ్లే, హర్భజన్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అతడు నిలిచాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ లో ఈ ఘనత సాధించాడు.

Ashwin Wickets: టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్ లో టెస్టుల్లో నంబర్ 1 బౌలర్ గా ఎదిగిన అశ్విన్.. ఇక ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్లలో మూడోస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్ ను అతడు వెనక్కి నెట్టాడు.
కపిల్ దేవ్ టెస్టులు, వన్డేల్లో కలిపి 448 ఇన్నింగ్స్ లో 687 వికెట్లు తీశాడు. ఇప్పుడు అశ్విన్ తన 347వ ఇన్నింగ్స్ లోనే 688వ వికెట్ తో కపిల్ ను వెనక్కి నెట్టాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో అలెక్స్ కేరీ వికెట్ తీసిన తర్వాత అశ్విన్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ మొత్తం మూడు వికెట్లు తీశాడు. దీంతో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది.
అశ్విన్ ఖాతాలో ప్రస్తుతం మొత్తం 689 వికెట్లు ఉన్నాయి. ఇండియా తరపున 953 వికెట్లతో అనిల్ కుంబ్లే టాప్ లో ఉన్నాడు. అతని తర్వాత హర్భజన్ సింగ్ 707 వికెట్లతో రెండోస్థానంలో నిలిచాడు. కుంబ్లే ఇండియా తరఫున 499 ఇన్నింగ్స్ లో 953 వికెట్లు తీయడం విశేషం. ఇక హర్భజన్ 442 ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టాప్ 4 తర్వాత జహీర్ ఖాన్ 373 ఇన్నింగ్స్ లో 597 వికెట్లతో ఐదోస్థానంలో ఉన్నాడు.
అశ్విన్ ఇప్పటి వరకూ 171 టెస్ట్ ఇన్నింగ్స్ లో 466 వికెట్లు తీసుకున్నాడు. ఇక 65 టీ20లలో 72 వికెట్లు, వన్డేల్లో 151 వికెట్లు తీశాడు. అశ్విన్ ముఖ్యంగా టెస్టుల్లో ఇండియా తరఫున కీలకమైన బౌలర్ గా ఉన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.