Ravindra Jadeja Record: జడేజా అరుదైన రికార్డు.. కపిల్, ఇమ్రాన్ ఖాన్‌ల సరసన ఆల్ రౌండర్
Ravindra Jadeja Record: జడేజా అరుదైన రికార్డు సాధించాడు. దీంతో లెజెండరీ ప్లేయర్స్ కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్‌ల సరసన నిలిచాడీ ఆల్ రౌండర్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో జడ్డూ ఈ రికార్డు క్రియేట్ చేశాడు.
Ravindra Jadeja Record: గాయం నుంచి కోలుకొని వచ్చిన తర్వాత టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరింత చెలరేగుతున్నాడు. స్పిన్ ఫ్రెండ్లీ హోమ్ కండిషన్స్ లో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇటు బౌలింగ్ లో, అటు బ్యాటింగ్ లో ఇండియన్ టీమ్ ఆపద్భాందవుడిలా మారాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
ఈ మ్యాచ్ లో అతడు బ్యాట్ తో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. అయితే ఆ తర్వాత బౌలింగ్ లో రాణించిన జడేజా.. ఆస్ట్రేలియా కోల్పోయిన నాలుగు వికెట్లనూ తన ఖాతాలోనే వేసుకున్నాడు. డేంజరస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ వికెట్లు అతడు తీశాడు.
ఈ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఇండియాకు తొలి వికెట్ అందించిన జడేజా.. తద్వారా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో కపిల్ దేవ్ సరసన నిలిచాడు. హెడ్ వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 500 వికెట్లు, 5 వేల పరుగులు చేసిన రెండో ఇండియన్ ప్లేయర్ గా జడేజా నిలిచాడు.
ఈ లిస్టులో కపిల్ దేవ్ టాప్ లో ఉన్నాడు. కపిల్ తన కెరీర్ లో మొత్తం 356 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి 687 వికెట్లు తీయడంతోపాటు 9031 పరుగులు చేశాడు. ఇప్పుడు జడేజా ఇండియా తరఫున 298వ అంతర్జాతీయ మ్యాచ్ లో ఇలా 500 వికెట్లు, 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్ గా నిలిచాడు.
జడేజా కంటే ముందు కపిల్ దేవ్, వసీం అక్రమ్, జాక్ కలిస్, ఇమ్రాన్ ఖాన్, షకీబుల్ హసన్, షాహిద్ అఫ్రిది, డేనియల్ వెటోరీ, చమందా వాస్, షాన్ పొలాక్, ఇయాన్ బోథమ్ ఈ ఘనత సాధించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ రెండో టెస్టులోనూ జడేజా 10 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం