Kapil Dev on Rohit Sharma: రోహిత్ బరువు తగ్గాలి.. ఇలా ఉంటే కష్టం: కపిల్ దేవ్
Kapil Dev on Rohit Sharma: రోహిత్ బరువు తగ్గాలి.. ఇలా ఉంటే కష్టం అని అన్నాడు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఓ క్రికెటర్ కు ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని అతడు అభిప్రాయపడ్డాడు.
Kapil Dev on Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ లో అడుగుపెట్టినప్పటి నుంచే చూడటానికి బొద్దుగా ఉంటాడు. ఫీల్డ్ లో అతని కదలికలు కూడా చాలా బద్ధకంగా కనిపిస్తాయి. నిజానికి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా మొదట్లో ఇలాగే ఉన్నా.. తర్వాత కఠినమైన కసరత్తులు చేస్తూ, డైట్ ఫాలో అవుతూ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫిట్‌నెస్ ఉన్న ప్లేయర్ గా ఎదిగాడు.
కానీ రోహిత్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అతని సైజు తరచూ ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా రోహిత్ ఫిట్‌నెస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు మంచి బ్యాటరే అయినా.. ఫిట్‌నెస్ కూడా చాలా ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించాడు. ఈ మధ్యే రోహిత్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి ఇండియన్ కెప్టెన్ గా నిలిచిన విషయం తెలిసిందే.
"ఫిట్ గా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఓ కెప్టెన్ కు ఇది చాలా అవసరం. ఫిట్ గా లేకపోవడం సిగ్గు చేటు. రోహిత్ ఈ విషయంలో కాస్త కఠినంగా శ్రమించాలి. అతడు గొప్ప బ్యాటరే కావచ్చు కానీ ఫిట్ నెస్ విషయం చూస్తే కాస్త ఎక్కువ బరువు ఉన్నట్లు కనిపిస్తాడు. కనీసం టీవీలో అయితే అలా కనిపిస్తాడు. ఎవరినైన టీవీలో, నేరుగా చూసినప్పుడు భిన్నంగా కనిపిస్తారన్న మాట నిజమే.
కానీ రోహిత్ గొప్ప ప్లేయర్, గొప్ప కెప్టెన్ అయినా కూడా అతడు ఫిట్ గా ఉండటం ముఖ్యం. విరాట్ నే చూడండి. అతన్ని చూసినప్పుడల్లా ఫిట్‌నెస్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది" అని ఏబీపీ న్యూస్ తో మాట్లాడుతూ కపిల్ అన్నాడు.
కెప్టెన్ గా ఈ మధ్య ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తొలి సెంచరీ చేశాడు రోహిత్ శర్మ. క్లిష్టమైన నాగ్‌పూర్ పిచ్ పై ఎంతో ఓపిగ్గా ఆడిన రోహిత్ 120 రన్స్ చేయడంతో ఇండియా ఇన్నింగ్స్ విజయం సాధించగలిగింది. ఆ తర్వాత రెండో టెస్టులోనూ 32, 31 పరుగులు చేశాడు. ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే తిరుగులేని 2-0 ఆధిక్యం సంపాదించిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం