Telugu Titans vs Tamil Thalaivas: తెలుగు టైటన్స్ హ్యాట్రిక్.. తమిళ తలైవాస్‌నూ చిత్తు చేసిన హోమ్ టీమ్
Telugu Titans vs Tamil Thalaivas: తెలుగు టైటన్స్ హ్యాట్రిక్ విజయాలతో ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో దూసుకెళ్తోంది. తాజాగా తమిళ తలైవాస్ పై విజయంతో పాయింట్ల టేబుల్లో ఏకంగా నాలుగో స్థానానికి వెళ్లడం విశేషం.
Telugu Titans vs Tamil Thalaivas: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ మొదట్లో ఎప్పటిలాగే తడబడిన తెలుగు టైటన్స్ టీమ్.. తర్వాత పుంజుకుంది. ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ సీజన్ తొలి లెగ్ మ్యాచ్ లు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో సొంత ప్రేక్షకుల ముందు మన టీమ్ సత్తా చాటుతోంది.
తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలైవాస్
తమిళ తలైవాస్ తో బుధవారం (నవంబర్ 6) రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో ఒక పాయింట్ తేడాతో తెలుగు టైటన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 35-34 తేడాతో మన టీమ్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పటిష్టమైన తమిళ తలైవాస్ జట్టుపై తెలుగు టైటన్స్ ఏకంగా మూడు సీజన్ల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్ చాలా హోరాహోరీగా సాగి ఆకట్టుకుంది. టైటన్స్ తరఫున పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో తెలుగు టైటన్స్ 20-17తో మంచి లీడ్ సాధించింది. అయితే సెకండాఫ్ తమిళ తలైవాస్ కాస్త పుంజుకుంది. దీంతో మ్యాచ్ ఎంతో ఉత్కంఠ రేపింది. ప్రతి పాయింట్ కోసం రెండు జట్లూ తీవ్రంగా తలపడ్డాయి. తలైవాస్ తరఫున సచిన్ 17 పాయింట్లు సాధించడం విశేషం. అంతే జట్టు పాయింట్లలో సగం అతనొక్కడే నమోదు చేశాడు. చివరికి నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో టైటన్స్ 35-34తో తలైవాస ను చిత్తు చేసింది. గత నెల 19న ఇక్కడే జరిగిన మ్యాచ్ లో ఇదే తలైవాస్ చేతుల్లో ఏకంగా 29-44 తేడాతో చిత్తయిన టైటన్స్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది.
పీకేఎల్ 11 పాయింట్ల టేబుల్
పీకేఎల్ 11లో తెలుగు టైటన్స్ హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల టేబుల్లో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. మొదటి మ్యాచ్ లోనే బెంగళూరు బుల్స్ ను 37-29తో చిత్తు చేసిన సీజన్ లో బోణీ చేసిన టైటన్స్.. తర్వాత వరుసగా తమిళ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్, దబంగ్ ఢిల్లీ చేతుల్లో ఓడింది. ఆ తర్వాత వరుసగా పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్, తమిళ తలైవాస్ ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాలు సాధించింది.
ఈ తాజా విజయంతో తెలుగు టైటన్స్ 7 మ్యాచ్ లలో 4 విజయాలు, 3 ఓటములతో 21 పాయింట్లు సాధించి నాలుగో స్థానానికి వెళ్లింది. అయితే ప్రత్యర్థికి ఇచ్చిన పాయింట్ల విషయంలోనే టైటన్స్ చాలా వెనుకబడి ఉంది. చేసిన పాయింట్లు, ఇచ్చిన పాయింట్ల మధ్య తేడా 35గా ఉంది. టైటన్స్ కంటే ముందు పుణెరి పల్టన్, యూ ముంబా, తమిళ తలైవాస్ ఉన్నాయి. తమిళ తలైవాస్ కూడా 21 పాయింట్లతోనే ఉన్నా.. ప్రత్యర్థి కంటే 32 పాయింట్లు ఎక్కువ నమోదు చేసింది. తెలుగు టైటన్స్ తమ తర్వాతి మ్యాచ్ లో శనివారం (నవంబర్ 9) పుణెరి పల్టన్ తో తలపడనుంది.