PKL 11 Highlights: అదరగొట్టిన తెలుగు టైటాన్స్.. బెంగళూర్ బుల్స్‌పై విజయం.. హైలెట్స్ ఇవే!-pro kabaddi league 11 telugu titans wins bengaluru bulls with 3 points pkl 11 yesterday match highlights ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pkl 11 Highlights: అదరగొట్టిన తెలుగు టైటాన్స్.. బెంగళూర్ బుల్స్‌పై విజయం.. హైలెట్స్ ఇవే!

PKL 11 Highlights: అదరగొట్టిన తెలుగు టైటాన్స్.. బెంగళూర్ బుల్స్‌పై విజయం.. హైలెట్స్ ఇవే!

Sanjiv Kumar HT Telugu
Nov 03, 2024 07:40 AM IST

Pro Kabaddi League 11 Highlights: నవంబర్ 2న జరిగిన ప్రో కబడ్డి లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ అదరగొట్టి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంత గడ్డపై బెంగళూర్ బుల్స్‌పై తెలుగు టైటాన్స్ మూడు పాయింట్ల తేడాతో గెలుపొందింది. దాంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది తెలుగు టైటాన్స్.

అదరగొట్టిన తెలుగు టైటాన్స్.. బెంగళూర్ బుల్స్‌పై విజయం.. హైలెట్స్ ఇవే!
అదరగొట్టిన తెలుగు టైటాన్స్.. బెంగళూర్ బుల్స్‌పై విజయం.. హైలెట్స్ ఇవే!

Pro Kabaddi League 11 Highlights: తెలుగు టైటాన్స్‌ పంజా విసిరింది. బెంగళూర్‌ బుల్స్‌ను బోల్తా కొట్టించి సీజన్‌లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం (నవంబర్ 2) గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ మూడు పాయింట్ల తేడాతో బెంగళూర్‌ బుల్స్‌పై గెలుపొందింది.

ఎవరికెన్ని పాయింట్స్

తెలుగు టైటాన్స్‌ ఆటగాళ్లు పవన్‌ సెహ్రావత్‌ (14 పాయింట్లు), ఆశీష్‌ నర్వాల్‌ (6 పాయింట్లు), అజిత్‌ పవార్‌ (5 పాయింట్లు), విజయ్‌ మాలిక్‌ (5 పాయింట్లు) అదరగొట్టారు. బెంగళూర్‌ బుల్స్‌ తరఫున ఆల్‌రౌండర్లు పంకజ్‌ (9 పాయింట్లు), నితిన్‌ రావల్‌ (7 పాయింట్లు), రెయిడర్‌ అజింక్య పవార్‌ (9 పాయింట్లు), డిఫెండర్‌ అరుల్‌ నంద బాబు వేలుస్వామి (4 పాయింట్లు) రాణించారు.

ఆరు మ్యాచులు-మూడో గెలుపు

తెలుగు టైటాన్స్‌కు ఇది ఆరు మ్యాచుల్లో మూడో విజయం కాగా.. బెంగళూర్‌ బుల్స్‌కు ఆరు మ్యాచుల్లో ఇది ఐదో పరాజయం కావటం గమనార్హం. ఈ విజయంతో తెలుగు టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రెయిడర్‌ పవర్‌ సెహ్రావత్‌ సీజన్‌లో అత్యధిక రెయిడ్‌ పాయింట్లు (65) సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

తెలుగు టైటాన్స్‌ పంజా:

ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్‌ అదరగొట్టింది. బెంగళూర్‌ బుల్స్‌పై ధనాధన్‌ ప్రదర్శన చేసింది. కూతలో టైటాన్స్‌ కేక అనిపించగా తొలి పది నిమిషాల్లోనే తెలుగు జట్లు ఏకంగా 15 పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు పవన్‌ సెహ్రావత్‌, ఆశీష్‌ నర్వాల్‌లు కూతకెళ్లి బుల్స్‌ను ఆలౌట్‌ చేశారు. దీంతో 18-3తో తెలుగు టైటాన్స్‌ తిరుగులేని స్థానంలో నిలిచింది.

తర్వాతి పది నిమిషాల ఆటలో బెంగళూర్‌ బుల్స్‌ కాస్త కోలుకుంది. డిఫెండర్లు మెరవటంతో సూపర్‌ ట్యాకిల్స్‌తో పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలో తెలుగు టైటాన్స్‌ 23-12తో నిలిచింది. విరామ సమయానికి 11 పాయింట్ల ముందంజలో నిలిచింది.

బుల్స్‌ మెరుపు వేగంతో.. :

విరామం అనంతరం బెంగళూర్‌ బుల్స్‌ భిన్నమైన ఆటను ప్రదర్శించింది. ద్వితీయార్థం ఆట మొదలైన నాలుగు నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్‌ చేసింది. చివరి ఎనిమిది నిమిషాల ఉండగా మరోసారి టైటాన్స్‌ ఆలౌట్‌ చేసింది. మెరుపు ట్యాకిల్స్‌కు కూత పాయింట్లు సైతం తోడయ్యాయి. దీంతో భారీ వెనుకంజ నుంచి పుంజుకుని 31-33తో రేసులోకి వచ్చింది బెంగళూర్‌ బుల్స్‌.

స్టార్‌ రెయిడర్‌ పవర్‌ సెహ్రావత్‌ విఫలమైతే.. టైటాన్స్‌ శిబిరం నైరాశ్యంలో పడటం ప్రతికూలంగా మారింది. ఆఖరు వరకు టైటాన్స్‌కు పోటీ ఇచ్చిన బెంగళూర్‌ బుల్స్‌ ద్వితీయార్థంలో 23 పాయింట్లు సాధించగా.. ఆతిథ్య జట్టు 15 పాయింట్లు మాత్రమే సాధించింది.

Whats_app_banner