Nirmal Farmers Protest : ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతుల రాస్తారోకో, 4 గంటల పాటు బాసర నిర్మల్ హైవే నిర్భంధం
Nirmal Farmers Protest : నిర్మల్ రైతులు మరోసారి రోడ్డెక్కారు. దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా ఇక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మంగళవారం జేఏసీ పిలుపు మేరకు బంద్ చేపట్టారు. నాలుగు గ్రామాల ప్రజలు నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ పరిశ్రమను తరలించాలని చేపట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగింది. గుండంపల్లి దిలావర్పూర్ గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న పరిశ్రమను తరలించాలని గత నాలుగు నెలలుగా నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం జేఏసీ నాయకుల పిలుపుమేరకు బంద్ ప్రకటించారు. దీంతో విద్యాలయాలు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమను తరలించాలని రాస్తారోకో దిలావర్పూర్ మండలంలో చేపడుతున్న ఇథనాల్ పరిశ్రమను తరలించాలని కోరుతూ నాలుగు గ్రామాల ప్రజలు నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై నిరసన, రాస్తా రోకో చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమను గ్రామం నుంచి తరలించాలని నినాదాలు చేశారు. పరిశ్రమలు తరలించేంత వరకు ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
రాస్తారోకో కారణంగా బాసర నిర్మల్ లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక వాహనాలను పోలీసులు దారి మళ్లించి ట్రాఫిక్ నియంత్రణ చేశారు. అయినప్పటికీ భారీ వాహనాలు మాత్రం రోడ్డు పైనే నిలిపి వేచి చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ ఆర్డీఓ రత్నకుమారి నిరసన స్థలానికి చేరుకొని ప్రజలతో మాట్లాడారు, ఆమె శాంతియుతంగా ధర్నా చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలపెట్టకుండా చేసే ధర్నాను చట్టం గౌరవిస్తుందని, రాస్తారోకో చేయడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది ఎదుర్కొంటున్నది తక్షణమే విరమించాలని కోరారు, అయినప్పటికీ ప్రజల వినకుండా ధర్నా కొనసాగించారు. జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు రాస్తారోకోను విరమించేది లేదని పేర్కొన్నారు. ప్రాణ త్యాగమైనా చేస్తామని రాస్తారోకో విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. పరిస్థితి విషమించడంతో ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు.
వెంటనే రద్దు చేయాలి- రైతులు
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో భవిష్యత్తులో తమకు పూర్తిగా అంధకారమేనని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకొని వీలైనంత త్వరగా పరిశ్రమను నిలిపేయాలంటూ ఆందోళనలను తీవ్రతరం చేశారు. లేకపోతే పరిశ్రమ మూసే వరకు తమ పోరాటాలను ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఫ్యాక్టరీని రద్దు చేయాలని కోరారు. కాగా దిలావర్పూర్ మండల కేంద్రంలో స్వచ్ఛందంగా వ్యాపారులు బంద్ పాటించి రైతులు, రాస్తారోకో లో పాల్గొంటున్నారు.
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్ల ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు